9 నిమిషాలు.. అద్భుత దర్శనం | 9 minutes fantastic view | Sakshi
Sakshi News home page

9 నిమిషాలు.. అద్భుత దర్శనం

Published Wed, Mar 12 2014 2:52 AM | Last Updated on Mon, Aug 20 2018 4:00 PM

9 నిమిషాలు.. అద్భుత దర్శనం - Sakshi

9 నిమిషాలు.. అద్భుత దర్శనం

అరసవల్లి, న్యూస్‌లైన్ : అరసవల్లి సూర్యనారాయణస్వామివారి మూలవిరాట్టును మూడో రోజు మంగళవారం ఉదయం భానుడి లేలేత కిరణాలు అభిషేకించాయి. ఈ అద్భుత దృశ్యం 9 నిమిషాల పాటు భక్తులకు కనువిందు చేసింది. ఇంద్ర పుష్కరిణి మీదుగా గాలి గోపురంలోంచి ఆలయ ఆవరణలోకి ప్రవేశించిన సూర్యకిరణాలు తొలుత ధ్వజస్తంభాన్ని తాకాయి. అనంతరం గర్భగుడిలోకి ప్రవేశించి 6.23 గంటల నుంచి 6.31 గంటల వరకు ఆదిత్యుడి మూలవిరాట్టును స్పృశించాయి. ఈ సమయంలో స్వామి బంగారు ఛాయలో దర్శనమిచ్చి భక్తులను సమ్మోహన పరిచారు. అపురూపమైన కిరణ దర్శనం కోసం భక్తులు తెల్లవారుజామున నాలుగు గంటలకే ఆలయం వద్దకు చేరుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు క్యూలైన్ల ద్వారా ఉదయం 6 గంటలకు భక్తులను లోపలికి అనుమతించారు. మంగళవారంతో కిరణ దర్శనం ముగిసింది. తొలి రోజు ఆదివారం వాతావరణం అనుకూలించక ఈ దర్శనం లభ్యం కాలేదు. అంతా సానుకూలంగా ఉండటంతో రెండో రోజు సోమవారం లభ్యమైంది. కాగా సోమవారం సాయంత్రం వర్షం పడడంతో కిరణ దర్శనం లభ్యం కాదని అనుకున్నప్పటికీ మంగళవారం ఉదయానికి వాతావరణం అనుకూలించటంతో సూర్యకిరణాలు స్వామివారిని తాకాయి. దాదాపు 2600 మంది భక్తులు కిరణ దర్శనం చేసుకున్నారు. మళ్లీ అక్టోబర్ 1,2,3 తేదీల్లో కిరణ దర్శనం లభ్యమవుతుందని ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు.
 
ఆదిత్యుడిని దర్శించుకున్న విశాఖ రూరల్ ఎస్పీ
కిరణ స్పర్శ సమయంలో సూర్యనారాయణస్వామివారిని విశాఖపట్నం రూరల్ ఎస్పీ దుగ్గల్ దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement