నాదెండ్ల మనోహర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు)కు 9,024 సవరణ ప్రతిపాదనలు అందాయని శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ చెప్పారు. సవరణ ప్రతిపాదనలను సోమవారం సభ్యులందరికీ అందిస్తామన్నారు.
బిల్లుపై శాసనసభలో ఆందోళనలు - చర్చలు - అభిప్రాయాలు - సవరణ ప్రతిపాదనలు - వాకౌట్లు - సభ్యుల సస్పెస్షన్లు.... జరుగుతున్న విషయం తెలిసిందే. శాసనసభ అభిప్రాయం తెలియజేయమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ బిల్లును ఇక్కడకు పంపారు. ఈ బిల్లుకు అనేక సవరణలు చేయవలసిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. సభలో సభ్యులు తమ అభిప్రాయాలు తెలియజేయడంతోపాటు సవరణలు ప్రతిపాదిస్తూ వినతి పత్రాలను స్పీకర్కు సమర్పించారు. పార్టీలు, సభ్యులు ప్రతిపాదించిన సవరణలలో అన్ని అంశాలు ఉన్నాయి. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, హైదరాబాద్, ఉద్యోగుల పెన్షన్, ఉమ్మడి రాజధాని, హైకోర్టు, ఉద్యోగుల పంపిణీ, విద్యుత్ పంపిణీ ఒప్పందాలు, కొత్త ప్లాంట్లు, విద్యా సంస్థల్లో కామన్ అడ్మిషన్, ఎన్‌టీపీసీలు, విశ్వవిద్యాలయాలు, నియోజకవర్గాలు...ఇలా సమగ్రంగా అనేక అంశాలను ఆ సవరణ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.