
సాక్షి, అమరావతి: గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ఉపయోగపడే గిరిజన సలహా మండలి ఏర్పాటు కోసం ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడేళ్ల పోరాటానికి ఫలితం లభించింది. గవర్నర్ నరసింహన్ ప్రశ్నించడం, ప్రతిపక్షం పోరాటంతో ఎట్టకేలకు గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వ్ అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలోనూ ప్రతిపక్ష పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికకావడంతో ఇన్ని రోజులు గిరిజన సలహామండలిని ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేసింది. రాజ్యాంగ పరంగా ఏర్పాటు చేయాల్సిన మండలిని కూడా ఏర్పాటు చేయకపోవడంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు.
గవర్నర్ స్పందిస్తూ గిరిజన సలహా మండలి ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక సుమారు రెండేళ్లు మాత్రమే అధికారం మిగిలి ఉండగా టీడీపీ ప్రభుత్వం ఈ మండలిని ఏర్పాటు చేసింది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన ఏడుగురు ఎస్టీ ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు అధికారులు సభ్యులుగా మరో అధికారి సభ్య కార్యదర్శిగా గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసింది. మరో 8 మంది ఎస్టీలను సభ్యులుగా నామినేట్ చేసింది. వచ్చే సాధారణ ఎన్నికల వరకు మండలి కాలపరిమితి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గిరిజన సలహా మండలి: చైర్‌పర్సన్–గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సభ్యులుగా, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి, కేంద్ర ప్రభుత్వ ఎస్టీ, ఎస్టీ విభాగం డైరెక్టర్, రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక సంస్థ డైరెక్టర్.
సభ్య కార్యదర్శిగా రాష్ట్ర గిరిజన శాఖ ప్రత్యేక కమిషనర్
నాన్–అఫీషియల్ సభ్యులుగా శాసన సభ్యులు విశ్వసరాయి కళావతి (ఎమ్మెల్యే, పాలకొండ), పాముల పుష్ప శ్రీవాణి (ఎమ్మెల్యే, కురుపాం), పీడిక రాజన్నదొర (ఎమ్మెల్యే, సాలూరు), కె.సర్వేశ్వరరావు (ఎమ్మెల్యే, అరకు), గిడ్డి ఈశ్వరి (ఎమ్మెల్యే, పాడేరు), వంతల రాజేశ్వరి (ఎమ్మెల్యే, రంపచోడవరం), ఎం. శ్రీనివాసరావు (ఎమ్మెల్యే, పోలవరం). నామినేటెడ్ సభ్యులుగా ఎన్.జయకృష్ణ , గుమ్మడి సంధ్యారాణి, జనార్దన్ థాట్‌రాజ్, ఎం.మణికుమారి, కెపీఆర్‌కె ఫణీశ్వరి, ఎం.ధారూనాయక్, ఎం.జీవుల నాయక్, వి.రంగారావులు నియమితులయ్యారు.