ఏపీ టెన్త్ లో 94.52 శాతం ఉత్తీర్ణత
♦ విశాఖలో టెన్త్ ఫలితాలు విడుదల చేసిన గంటా
♦ 98.89 శాతంతో వైఎస్సార్ జిల్లాకు అగ్రస్థానం
♦ 90.11 శాతంతో ఆఖరి స్థానంలో చిత్తూరు
సాక్షి, విశాఖపట్నం: పదో తరగతి ఫలితాల్లో బాలబాలికలు సత్తాచాటారు. రాష్ట్రవ్యాప్తంగా 94.52 శాతం ఉత్తీర్ణత సాధించారు. మంగళవారం విడుదల చేసిన ఈ ఫలితాల్లో వైఎస్సార్ జిల్లా 98.89 శాతంతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 90.11 శాతంతో ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరు మరోసారి ఆఖరి స్థానంలో నిలిచింది. విశాఖలోని ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు.
గతేడాది రాష్ట్రస్థాయి ఉత్తీర్ణత శాతం 91.42 కాగా ఈ ఏడాది 3.1 శాతం పెరిగింది. ఈసారి ఉత్తీర్ణతలో బాలుర కంటే బాలికలు పైచేయి సాధించారు. రాష్ట్రంలో 10,941 స్కూళ్లకు గాను 4,217 పాఠశాలలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఈ ఏడాది జీరో ఫలితాలొచ్చిన పాఠశాల ఒక్కటి కూడా లేదు. 6,444 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. వీరిలో ప్రైవేటు స్కూళ్లకు చెందిన వారు 6,055 మంది ఉన్నారు. ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివిన వారిలో ఒక్కరూ 10 జీపీఏ సాధించలేకపోయారు.
జూన్ 16 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 16 నుంచి 29 వరకు నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు జూన్ మూడో తేదీలోగా సంబంధిత స్కూల్లో పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులకు మార్కుల జాబితాను పది రోజుల్లో పంపిస్తారు. సంబంధిత కేంద్రాలు, పాఠశాలల నుంచి సమాచారం రాగానే విత్‌హెల్డ్‌లో ఉంచిన విద్యార్థుల ఫలితాలు ప్రకటిస్తారు. మార్కులు తిరిగి లెక్కింపు కోరేవారు సబ్జెక్టుకు రూ. 500 చొప్పున ఈ నెల 23లోగా చెల్లించాల్సి ఉంటుంది.
సమాధాన పత్రాల పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత హెడ్మాస్టర్లతో ధ్రువీకరణ చేయించి, 23లోగా వెయ్యి రూపాయలు చలానా తీసి డీఈవో కార్యాలయాల్లో అందజేయాలి. వచ్చే ఏడాది నుంచి ఒకటో తరగతి మొదలు పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు అన్ని పరీక్షలూ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. వీటితో పాటు ప్రభుత్వం నిర్వహించే అన్ని ‘సెట్లు’ కూడా ఆన్‌లైన్‌లోనే జరుపుతామన్నారు. ఇందుకోసం ఒక కమిటీనీ నియమించామని చెప్పారు. డీఎస్సీలో ఎంపికైన 10,300 మంది స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు జూన్ ఒకటికల్లా నియామక ఉత్తర్వులు అందజేస్తామని మంత్రి తెలిపారు. వచ్చే నెల నుంచి టీచర్లకు బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామని తెలిపారు.