
గంటా... ఓ ఊసరవెల్లి
- ఆయన నిష్ర్కమణతో పార్టీకి పట్టిన చీడ వడిలింది
- ఆయన పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- డీసీసీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ
అనకాపల్లి, న్యూస్‌లైన్: ‘గంటా శ్రీనివాసరావు ఓ ఊసరవెల్లి. స్వప్రయోజనాల కోసం పార్టీలు మారడం ఆయనకు రివాజు. అధికారమే పరమావధిగా రంగులు మార్చడం ఆయన నైజం. రాష్ట్రంలోని ఏ జిల్లా వాడో కూడా స్పష్టంగా తెలియని గంటాను ప్రజలు అక్కున చేర్చుకుని ఆదరిస్తే వారినే మోసం చేసిన ఘనుడాయన. ఇప్పటికైనా ప్రజలు అటువంటి నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి’ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ అన్నారు. శుక్రవారం అనకాపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన గంటా తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గంటా కాంగ్రెస్ పార్టీని వీడడంతో పీడ విరగడైపోయిందన్నారు.
సమైక్యాంధ్ర పేరుతో పదవి కోసం ప్రజల్ని గంటా మోసం చేశారని విమర్శించారు. ‘ఆయన ఏ రోజైనా ఉద్యమంలో పాల్గొన్నారా...నిరాహార దీక్ష చే శాడా... జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడైనా చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యా సం పుచ్చుకుంటా’ అని ధర్మశ్రీ సవాలు విసిరారు. ఇప్పటికైనా గంటా నైజాన్ని గుర్తించి జిల్లా ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలని, ఆయనను జిల్లా నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడిమిశెట్టి రాంజీ మాట్లాడుతూ పార్టీ నాయకులంతా సమైక్యంగా పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని కోరారు. సమావేశంలో నిమ్మదల సన్యాసిరావు, బి.ఎస్.ఎం.కె.జోగినాయుడు, గెంజి సత్యారావు, పంపాన సత్తిబాబు పాల్గొన్నారు.