ఇబ్రహీంపట్నంలో భారీ పేలుడు
ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు
మందుగుండు సామగ్రితో ప్రయోగం చేస్తుండగా ఘటన
ధ్వంసమైన ఇల్లు
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం సుందరయ్యనగర్ కాలువ కట్టపై గురువారం సాయంత్రం ఒక ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో వీరు దీపావళి బాణసంచాలో వినియోగించే మందుగుండు సామగ్రితో ప్రయో గం చేస్తుండగా ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం భావిస్తున్నారు. వివరాల్లోకెళితే.. సుందరయ్యనగర్ కట్టపై ఉంటున్న పోతాబత్తుల భాస్కరరావు వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. అతని కువ ూరుడు రఘువర్మ (20) ముదినేపల్లిలో పాలిటెక్నిక్ చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. అతని స్నేహితులు సైకం వెంకటేష్ (14) విజయశక్తి స్కూల్‌లో తొమ్మిదో తరగతి, కన్నా కోమలరాజు (17) చైతన్య కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ముగ్గురూ కలసి ఇంట్లో ఏదో ప్రయోగం చేస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో రఘువర్మ అరచేతి భాగం విరిగి సుమారు 200 మీటర్ల దూరంలో పడింది.
రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. వెంకటేష్‌కు రెండు కళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఛాతీ, పొట్ట భాగం, కాళ్లకు గాయాలయ్యాయి. కోమలరాజు రెండు కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న తహశీల్దార్ హరిహర బ్రహ్మాజీ, సీఐ జె.మురళీకృష్ణ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ముగ్గురినీ 108 సిబ్బంది గొల్లపూడిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి ఇంటి గోడలు, పైకప్పు రేకులు, ఇంట్లోని సామగ్రి పూర్తిగా ధ్వంసమయ్యాయి. పరిసరాల్లో పడివున్న విద్యుత్ వైర్లు, బ్యాటరీ తదితర వస్తువులను పరిశీలించిన పోలీసులు.. వీరు ఏదో ప్రయోగం చేస్తుండగా ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సమీపంలోని క్వారీల్లో ఉపయోగించే పేలుడు సామగ్రిని ఏమైనా వినియోగించారా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న వెస్ట్ ఏసీపీ రాఘవరావు సీఐ మురళీకృష్ణ, తహశీల్దార్ బ్రహ్మాజీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశీలించారు. గాయపడిన ముగ్గురి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. క్లూస్ టీం నిపుణుల బృందం ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ప్రాంతంలో ఇంతటి భారీ పేలుడు జరగడం చర్చనీయాంశమైంది.