
అమరావతిలో భారీగా ఇంటి అద్దెలు
♦ రవాణా సౌకర్యం అస్తవ్యస్తంగా ఉంది
♦ సచివాలయ మహిళా ఉద్యోగుల అసంతృప్తి
♦ తాత్కాలిక సచివాలయ సందర్శన
తుళ్లూరు రూరల్: రాజధాని ప్రాంతంలో ఇంటి అద్దెలు భారీగా ఉన్నాయని, రవాణా సౌకర్యాలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయని సచివాలయ మహిళా ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయాన్ని బుధవారం ఏపీ సచివాలయ మహిళా ఉద్యోగులు సందర్శించారు. వారిని సచివాలయ ప్రాంగణంలో గుంటూరు జేసీ చెరుకూరి శ్రీధర్ ఆహ్వానించారు. అనంతరం వారితో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ.. విభజన కారణంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉత్సాహంతో జూన్ నెలాఖరుకు అమరావతికి వచ్చేందుకు ముందుకు రావడంపై వారిని అభినందించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం చేయాలనుకున్న అభివృద్ధి గురించి వారికి వివరించారు. మహిళా ఉద్యోగులను తమ అభిప్రాయాలు చెప్పాలని జేసీ కోరడంతో ఇక్కడ ఇంటి అద్దెలు రూ.10-15 వేలకు పైగా ఉన్నాయని తెలిసిందని, రవాణా సౌకర్యం అస్తవ్యస్తంగా ఉందని, ఇది ఇబ్బందికరమని పేర్కొన్నారు. ఆప్సా అధ్యక్షురాలు సత్య సులోచన మాట్లాడుతూ మహిళలుగా తమకు చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏపీ అభివృద్ధిని కాంక్షిస్తూ జూన్ నెలాఖరుకు వచ్చేందుకు సిద్ధమన్నారు. అయితే సౌకర్యాలు, నిర్మాణాలు అసంతృప్తిగా ఉన్నాయన్నారు. ఇంతవరకు కనీసం డ్రైనేజీ, విద్యుత్తు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించలేకపోయారని,గడువు నెల రోజులే ఉన్నందున వసతులు లేక ఇబ్బంది కలుగుతుందన్నారు. ఆప్సా రాష్ట్ర కార్యదర్శి ప్రశాం తి, తహసీల్దార్ సుధీర్‌బాబు, సీఆర్‌డీఏ ఐటీ సోషల్ డెరైక్టర్ ప్రభాకరరెడ్డి, ల్యాండ్ డెరైక్టర్ చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.