ప్రేయసి భర్తను హత్య చేసిన ప్రియుడు
Published Fri, Feb 24 2017 8:12 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
కొల్లిపర : ప్రేయసి మీద వ్యామోహంతో ఆమె భర్తను గొంతు కోసి చంపిన సంఘటన కొల్లిపర ఎస్సీ కాలనీలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...కొల్లిపరకు చెందిన నూతక్కి దీనప్రసాద్ (30)కు అమర్తలూరుకు చెందిన సౌజన్యతో 10 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. వివాహం కాకముందే సౌజన్యకు అమర్తలూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సజ్జా నాగరాజుతో వివాహేతర సంబంధం ఉంది. వివాహమైన తర్వాత కూడా ఆ సంబంధం కొనసాగుతూ ఉంది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని తలచి అతనిని అంతమొందించాలని సౌజన్య, నాగరాజు భావించారు.
దీనిలో భాగంగా బుధవారం రాత్రి సౌజన్య ఇంటికి నాగరాజు వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న సౌజన్య భర్త దీనప్రసాద్ నాగరాజుతో ఘర్షణకు దిగాడు. ఇదే అదునుగా నాగరాజు కత్తితో దీనప్రసాద్‌ను గొంతుకోసి పారిపోయాడు. దీనప్రసాద్ అక్కడకక్కడే మృతి చెందాడు. సౌజన్య గురువారం ఉదయం నారాకోడూరులో ఉంటున్న అత్త నాగమ్మకు ఫోన్ చేసి మీ అబ్బాయి మద్యం మత్తులో గొంతుకోసుకుని చనిపోయాడని చెప్పింది. వెంటనే కొల్లిపర వచ్చిన ఆమె ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. తన కుమారుడిని ఎవరోచంపి ఉంటారని ఫిర్యాదులో పేర్కొం ది. దీంతో సౌజన్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా జరిగిన వాస్తవం తెలిపినట్టు సమాచారం. మరో నిందితుడు నాగరాజు పరారీలో ఉన్నాడు.
సంఘటన స్ధలాన్ని తెనాలి డీఎస్పీ రమణమూర్తి, సీఐ చినమల్లయ్య, దుగ్గిరాల ఎస్‌ఐ మురళి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం జిల్లా వైద్యశాలకు తరలించారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. నిందితుని కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ చెప్పారు.
Advertisement
Advertisement