Fast Track Court Sensational Verdict On Guntur Btech Student Ramya Murder Case - Sakshi
Sakshi News home page

Guntur Btech Student Murder Case: బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు

Published Fri, Apr 29 2022 3:09 PM | Last Updated on Sat, Apr 30 2022 7:39 AM

BTech Student Ramya Murder Case Guntur Fast Track Court Sensational Verdict - Sakshi

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని నల్లపు రమ్య కేసులో న్యాయస్థానం శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. గుంటూరులో రమ్యను పాశవికంగా నడిరోడ్డుపై హత్య చేసిన కుంచాల శశికృష్ణకు ఎస్‌సీ, ఎస్‌టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. నడిరోడ్డుపై ఒక విద్యార్థినిని అత్యంత పాశవికంగా చంపడం, ముద్దాయిని పట్టుకునే సమయంలో ఆత్మహత్యాయత్నం చేయడం, విచారణ సందర్భంగా కోర్టు నుంచి పరారు కావడానికి ప్రయత్నించడం తదితర కారణాల వల్ల ఈ కేసును అత్యంత అరుదైనది (రేరెస్ట్‌ ఆఫ్‌ ది రేర్‌)గా భావిస్తున్నామని న్యాయమూర్తి రాంగోపాల్‌ తన తీర్పులో పేర్కొన్నారు.

క్రైం నెంబర్‌ 446/2021 అండర్‌ సెక్షన్‌ 354(డి).. 302 ఐపీసి, సెక్షన్‌3 (2)(విఎ)ఆఫ్‌ ఎస్‌సి–ఎస్‌టీ యాక్ట్‌ కింద నమోదైన కేసులో ఉరి శిక్ష (దీన్ని హైకోర్టు నిర్దారించాల్సి ఉంటుంది), రూ.వెయ్యి జరిమానా లేదా ఒక నెల సాధారణ జైలు శిక్ష విధించారు. 354(డి) సెక్షన్‌ కింద రెండేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా లేదా 15 రోజుల జైలు శిక్ష, ఎస్‌సి–ఎస్‌టీ కేసు సెక్షన్‌ 3 (2)(వి) కింద జీవిత ఖైదు, రూ.500 జరిమానా లేదా 15 రోజుల జైలు శిక్ష, ఎస్‌సి–ఎస్‌టీ కేసు సెక్షన్‌ 3 (2)(విఎ) కింద రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా లేదా 15 రోజుల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

పొడిచి పొడిచి హత్య 
గుంటూరు పరమాయకుంటలో నివాసముంటూ బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న నల్లపు రమ్య(20)కు వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామం వడ్డెరపాలెంకు చెందిన కుంచల శశికృష్ణ(19)తో ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా పరిచయం అయ్యింది. పదోతరగతి మధ్యలో మానేసి, ఆటోమొబైల్‌ షాపులో పనిచేసిన శశికృష్ణ.. తర్వాత తన నానమ్మ ఊరు వెళ్లి అక్కడ కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు. రమ్యను బస్టాండ్‌లో తరచూ కలిసే శశికృష్ణ.. తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అందుకు రమ్య తిరస్కరించింది. అతని ఫోన్‌ నంబర్‌ను కూడా బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టింది.

దీంతో కోపం పెంచుకున్న శశికృష్ణ గత ఏడాది ఆగస్టు 15న తన ఇంటి నుంచి టిఫిన్‌ కోసం హోటల్‌కు వచ్చిన రమ్యను నడిరోడ్డుపై కత్తితో పలుమార్లు పొడిచి చంపాడు. ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. సీసీ కెమెరాలో నమోదైన హత్య దృశ్యాల ఆధారంగా శశికృష్ణను 12 గంటల్లోనే నరసరావుపేట సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ రవికుమార్‌ ఆధ్వర్వంలో పోలీసులు 36 మందిని విచారించి ఏడు రోజుల్లో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. సెప్టెంబర్‌ 13న కోర్టు విచారణకు తీసుకుంది. డిసెంబర్‌ 31న విచారణ ప్రారంభించింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎన్‌.శారదామణి 28 మంది సాక్షులను విచారించారు. హత్యకు సంబంధించి కీలకమైన సీసీ టీవీ వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి ఇరువర్గాల వాదనలు విని, ఈనెల 26న విచారణ పూర్తి చేశారు. 

కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు 
ఈ కేసును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ నేతృత్వంలో అన్ని సాక్ష్యాలను సేకరించారు. ఆఖరుకు డీఎన్‌ఎ టెస్ట్‌ కూడా చేయించారు. సాక్షులు అందరూ సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పారు. మంగళవారంతో వాదనలు పూర్తి అయ్యాయి. శుక్రవారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో న్యాయవాదులు, ప్రజా సంఘాలు, మీడియాతో కోర్టు ఆవరణ కిక్కిరిసిపోయింది.  మధ్యాహ్నం 12 గంటలకు కోర్టు మొదలవ్వగానే.. శశికృష్ణ దోషిగా నిర్ధారణ అయ్యిందని, మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు వెలువరిస్తానని న్యాయమూర్తి ప్రకటించారు. సరిగ్గా 2.30 గంటలకు దోషికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. అనంతరం భారీ బందోబస్తు నడుమ ముద్దాయిని జైలుకు తరలించారు. కాగా, గుంటూరు జిల్లా చరిత్రలో విద్యార్థినిపై హత్య కేసులో ఉరిశిక్ష పడటం ఇది రెండోసారి. 1999లో జెకేసీ కళాశాలలో సాయిలక్ష్మీ ప్రసన్న అనే విద్యార్థినిని సుభాని అనే వ్యక్తి కత్తితో నరికి చంపాడు. ఆ కేసులోనూ దోషికి ఉరి శిక్ష పడింది. 

అన్ని విధాలా అండగా నిలిచిన ప్రభుత్వం
రమ్య హత్య జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి ఈ ఘటనపై సీరియస్‌ అయ్యారు. నిందితులను వెంటనే అరెస్టు చేయడంతో పాటు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. అప్పటి హోం మంత్రి మేకతోటి సుచరిత, ఇతర ప్రజా ప్రతినిధులు రమ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని ప్రకటించారు. రెండో రోజే ముఖ్యమంత్రి ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలు రమ్య తల్లి నల్లపు జ్యోతికి అందించారు.

అదే నెల 20వ తేదీకల్లా రమ్య తల్లికి నవరత్నాలు – పేదలందరికి ఇల్లు పథకం కింద గుంటూరులో ఇంటి పట్టా అందించారు. పోస్టుమార్టం, ఛార్జ్‌షీట్‌ వేసే దశలో అమె తల్లికి మరో రూ.8,25,000 ఇచ్చారు. ఇంటి నిర్మాణం కోసం రూ.1.80 లక్షలు చెల్లించారు. రమ్య సోదరి నల్లపు మౌనికకు సెప్టెంబర్‌ 16న రెవిన్యూ విభాగంలో ఉద్యోగం ఇచ్చారు. అప్పటికి మౌనికకు డిగ్రీ పూర్తి కాకపోవడంతో ఐదేళ్లలోగా డిగ్రీ పూర్తి చేసుకునే అవకాశం కల్పించారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించింది. వారు కోరిన విధంగా వారి సొంత గ్రామమైన అమృతలూరు మండలం యలవర్రులో కోటీ 61 లక్షల 25 వేల 300 రూపాయల ఖర్చుతో ఐదు ఎకరాల పట్టా భూమిని కొనుగోలు చేసి రమ్య తల్లి పేరున రిజిస్టర్‌ చేశారు. ప్రభుత్వ స్పందనను జాతీయ ఎస్‌సీ కమిషన్‌ కొనియాడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ కేసులో ప్రభుత్వం స్పందించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ప్రభుత్వానికి కృతజ్ఞతలు
రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఆగష్టు 15న నా కుమార్తె హత్యకు గురైందని తెలిసి సృహ కోల్పోయాను. తర్వాత ఎస్పీ వచ్చి ధైర్యం చెప్పారు. దిశ డీఎస్పీ రవికుమార్‌ నాతో వివరాలు సేకరించారు. సీఎం ఆదేశాల మేరకు దోషిని వెంటనే పట్టుకుంటామన్నారు. ఆ మాట నిలుపుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదలుకుని పోలీస్‌ శాఖలో ప్రతి ఒక్కరూ మాకు వెన్నంటి ఉండి అండగా నిలిచారు. ఆ సమయంలో ఇప్పుడు మంత్రిగా ఉన్న మేరుగ నాగార్జున పరామర్శించి, మరింత ధైర్యం చెప్పారు. న్యాయస్థానమంటే ఎరుగని మాకు ప్రత్యేక పీపీ శారదామణి సొంత మనిషిగా భావించి సహకరించారు.  ఇవాళ దోషికి ఉరి శిక్ష విధించడంతో మాకు ఊరట లభించింది. మాకు సహకరించిన ప్రభుత్వం, పోలీసులు, దళిత ప్రజా సంఘాల నాయకులందరికీ ధన్యవాదాలు
– జ్యోతి, హత్యకు గురైన రమ్య తల్లి 

సీఎంతో మాట్లాడాకే ధైర్యం వచ్చింది
మా అక్కను చంపిన వాడిని గంటల వ్యవధిలోనే గుర్తించి పట్టుకున్నారు. ఈ కేసులో మాకు న్యాయం జరుగుతుందని తొలుత భావించలేదు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు వెళ్లే ముందు కూడా న్యాయం జరుగుతుందని పెద్దగా అనిపించలేదు. అయితే సీఎంతో మాట్లాడిన తర్వాతే ధైర్యం వచ్చింది. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీఎం దగ్గరుండి అన్నీ తానై చూసుకున్నారు. ప్రభుత్వం, పోలీసులు, న్యాయస్థానం, ప్రజాప్రతినిదులు మాకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. 
– మౌనిక, హత్యకు గురైన రమ్య సోదరి

ఈ తీర్పుతో మహిళలకు భరోసా 
గత ఏడాది ఆగస్టు 15న బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్యకు గురవ్వగానే ఘటనా స్థలాన్ని పరిశీలించాం. అనంతరం జీజీహెచ్‌కు వెళ్లి రమ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పాం. హత్య చేసిన యువకుడిని సాంకేతిక ఆధారాలతో గుర్తించి, పది గంటల వ్యవధిలోనే అరెస్ట్‌ చేశాం. సాక్ష్యాలు, సీసీ పుటేజీ, వేలి ముద్రలు, డీఎన్‌ఏ తదితర ఆధారాలు సేకరించాం. పోలీస్, ఫోరెనిక్స్, న్యాయస్థానం.. ఒక బృందంగా పని చేశాం. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సైతం పోలీసుల పనితీరును అభినందించింది. ఈ తీర్పుతో మహిళలకు భరోసా కలుగుతుందనడంలో సందేహం లేదు.
–  కె.ఆరిఫ్‌హఫీజ్, గుంటూరు జిల్లా ఎస్పీ 

ఈ శిక్షకు అతను అర్హుడే
రమ్య హత్య కేసుపై జిల్లా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. కోర్టు ట్రయల్‌ జరుగుతున్న క్రమంలో పలువురు సాక్షులను విచారించాం. సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయస్థానం దోషికి మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. హత్యకు పాల్పడిన అతను ఈ శిక్షకు పూర్తిగా అర్హుడే.
– శారదామణి, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌  

మరణ శిక్ష సరికాదు
క్షణికావేశంలో చేసిన తప్పుకు మరణ శిక్ష సరికాదు. ఘటన జరిగిన రోజు నుంచి నా కుమారుడు ఏడుస్తూనే ఉన్నాడు. తప్పు చేశానని పశ్చాత్తాప పడుతున్నాడు. నా కుమారుడికి ఉరి శిక్ష వేస్తే రమ్య తిరిగి వస్తుందనుకుంటే ఆ శిక్ష వేయొచ్చు. కోర్టు తన నిర్ణయాన్ని పునరాలోచించాలి.    
– భూలక్ష్మి, శశికృష్ణ తల్లి

‘దిశ’ను విమర్శిస్తున్న వారికి ఇదో చెంపపెట్టు 
ఇంజనీరింగ్‌ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ  గుంటూరు కోర్టు ఇచ్చిన తీర్పు దిశ చట్టంపై విమర్శలు చేస్తున్న వారికి చెంపపెట్టు. దేశంలో ఎక్కడాలేని రీతిలో పిల్లలు, మహిళల రక్షణ కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశ చట్టానికి రూపకల్పన చేశారు. పార్లమెంట్‌ ఆమోదించడంలో జాప్యం వల్ల దిశ ఇంకా చట్ట రూపం సంతరించుకోలేదు. ఆ చట్టం స్ఫూర్తితో దిశ యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. కోటి మంది ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఆపదలో ఉన్న మహిళలు యాప్‌లో సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులు రక్షణ చర్యలు చేపడుతున్నారు.     
– సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు

కోర్టు తీర్పు చరిత్రాత్మకం
విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ గుంటూరు కోర్టు తీర్పునివ్వడం చరిత్రాత్మకం. హత్య జరిగిన 10 గంటల్లోపే నిందితుణ్ణి అరెస్ట్‌ చేసి.. 24 గంటల్లోనే చార్జిషీట్‌ దాఖలు చేశాం. కోర్టు తీర్పుతో ఇలాంటి ఘటనలకు పాల్పడే మృగాలకు వణుకు పుడుతుంది. ఈ తీర్పు ఇప్పుడు దిశ చట్టం అవసరాన్ని మరింత గుర్తు చేస్తోంది.    
    – తానేటి వనిత, హోంమంత్రి

‘దిశ’ గొప్పదనమిది
విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణకు గుంటూరు కోర్టు ఉరిశిక్ష విధించడాన్ని స్వాగతిస్తున్నాం. 9 నెలల్లోనే  నిందితుడికి ఉరి శిక్షపడేలా చేయడం సీఎం వైఎస్‌ జగన్‌ పరిపాలన గొప్పదనం. దిశ చట్టాన్ని కేంద్రం ఆమోదిస్తే.. 21 రోజుల్లోనే నిందితులకు ఉరి శిక్ష పడేలా చేయడానికి ఆస్కారం ఉండేది.    
– ఆర్‌కే రోజా,  పర్యాటక శాఖ మంత్రి

‘దిశ’తో సత్వర న్యాయం

గుంటూరులో ఉన్మాది కత్తిపోట్లకు బలైన రమ్య హత్యకేసు నిందితునికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునివ్వడం హర్షణీయం. ఇది రాష్ట్ర  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ’దిశ’ బిల్లు స్ఫూర్తితో సత్వర న్యాయానికి ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ కేసు విచారణ, బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని జాతీయ ఎస్సీ కమిషన్‌ సైతం మెచ్చుకుంది. మహిళలపై అకృత్యాలకు పాల్పడే మృగాళ్లకు ఈ కేసు ఒక హెచ్చరికగా నిలుస్తుంది.
 – వాసిరెడ్డి పద్మ, చైర్‌పర్సన్, మహిళా కమిషన్‌

మృగాళ్లకు కనువిప్పు

రమ్య హత్య కేసులో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు మృగాళ్లకు కనువిప్పు అవుతుంది. ఎవరైనా మహిళల జోలికి వస్తే తమ ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చెప్పడానికి ఈ కేసు ఒక ఉదాహరణ. రమ్య కేసును దిశ చట్టం రూపకల్పనలో పేర్కొన్నట్టుగా వేగవంతంగా చర్యలు చేపట్టి శిక్ష పడేలా చేశారు.    
– విడదల రజని, వైద్యారోగ్య శాఖ మంత్రి

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement