Fast track court
-
కాట్నపల్లి ఘటనపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు
సుల్తానాబాద్ రూరల్(పెద్దపల్లి), పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలోని రైస్‌మిల్లు సమీపంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆ పై హత్య చేసిన దారుణ ఘటనలో నిందితుడికి సత్వరమే శిక్ష పడేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క, ఐటీ, పురపాలక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.సీఎం రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రి వర్గం ఈమేరకు నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. కాట్నపల్లిలోని ఓ రైస్‌మిల్లులో పనిచేస్తున్న దంపతుల ఆరేళ్ల కూతురిని బీహార్‌కు చెందిన యువకుడు ఈనెల 14న అపహరించి హత్యాచారం చేసిన ఘటన తమను కలచివేసిందన్నారు. మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ఆదివారం రైస్‌మిల్లు సమీపంలోని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ, హత్యాచార ఘటనపై సీఎంతోపాటు మంత్రివర్గం, ఎంపీ, ఎమ్మెల్యేలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. నిందితునికి త్వరగా శిక్ష పడేలా చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు చర్యలను మరింత విస్తృతం చేస్తామని చెప్పారు. బాధిత కుటుంబానికి రూ.8లక్షలు బాధిత కుటుంబానికి రైస్‌మిల్లు యాజమాన్యం నుంచి రూ.5.50లక్షలు ఇప్పించాలని, ప్రభుత్వం ద్వారా మరో రూ.2.50లక్షలు పరిహారం అందించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. అదే విధంగా చిన్నారి తండ్రికి ఉద్యోగావకాశం కల్పించడంతో పాటు సొంతిల్లు మంజూరు చేసేలా వారి స్వస్థలం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌తో చర్చించామని ఆయన తెలిపారు. మంత్రుల వెంట కలెక్టర్ శ్రీహర్ష, రామగుండం సీపీ శ్రీనివాస్ ఉన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం తెలంగాణను డ్రగ్స్‌రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది కాట్నపల్లి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్ సరఫరా, విక్రయాలపై నిరంతర నిఘా పెంచి వాటిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. మంత్రులు పెద్దపల్లిలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, మత్తులో ఉండడంవల్లే సుల్తానాబాద్ రైస్‌మిల్లులో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య జరిగిందని భావిస్తున్నామన్నారు. -
మహనీయుల స్ఫూర్తితో ఉత్తమ న్యాయవాదులుగా ఎదగండి
చిలకలపూడి (మచిలీపట్నం): సహనంలో మహాత్మాగాందీ, జ్ఞానంలో బీఆర్ అంబేడ్కర్, ధైర్యంలో అల్లూరి సీతారామరాజు, సాహసంలో టంగుటూరి ప్రకాశం పంతులును ఆదర్శంగా తీసుకున్నప్పుడే సంపూర్ణ న్యాయవాదులుగా ఎదుగుతారని హైకోర్టు న్యాయమూర్తి, కృష్ణా జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్మించిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మొదటి అంతస్తు భవనాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. బార్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ శేషసాయి మాట్లాడారు. న్యాయ వ్యవస్థకు ఎంతో మంది గొప్ప న్యాయమూర్తులు, న్యాయవాదులను అందించిన ఘనత మచిలీపట్నం బార్ అసోసియేషన్‌కు ఉందన్నారు. జస్టిస్ కృపాసాగర్ మాట్లాడుతూ..తన సొంత బార్ అసోసియేషన్ అయిన మచిలీపట్నం బార్ అసోసియేషన్‌కు రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక తదితరులు పాల్గొన్నారు. -
Gyanvapi: వాయిదాతో కొనసాగనున్న ఉత్కంఠ!
వారణాసి: ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఉత్తర ప్రదేశ్ వారణాసి జ్ఞానవాపి కేసులో ఇవాళ(నవంబర్ 8, మంగళవారం) కీలక తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే ఈ పిటిషన్లపై తదుపురి విచారణను నవంబర్ 14 తేదీకి వాయిదా వేసింది వారణాసి కోర్టు. మసీదు ప్రాంగణంలో ఉన్న శివలింగాన్ని పూజించేలా అనుమతి ఇవ్వాలని, హిందువులకు ఆ ప్రాంగణం అప్పగించాలని, అలాగే ముస్లింల ప్రవేశాన్ని నిషేధించేలా ఆదేశాలు ఇవ్వాలని.. మొత్తం మూడు డిమాండ్లతో కూడిన హిందువుల పక్షాన దాఖలైన పిటిషన్‌పై తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ మేరకు సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) మహేంద్ర పాండే తీర్పును అక్టోబర్ 27న రిజర్వ్ చేసి ఉంచారు. ముందుగా నవంబర్ 8వ తేదీన తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే జడ్జి అనివార్య కారణాల వల్ల అందుబాటులో లేకపోవడంతో నవంబర్ 14వ తేదీకి వాయిదా పడింది. ప్రస్తుతానికి ముస్లిం వర్గాలకు అక్కడ నమాజ్‌కు అనుమతి ఇస్తున్నారు. ఇక.. గత విచారణ సందర్భంగా వాజుఖానాలో ఉన్న శివలింగం అంశంపై సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్‌కు అనుమతించాలని, కార్బన్ డేటింగ్ చేయించాలనే అభ్యర్థనను వారణాసి కోర్టు తోసిపుచ్చింది. ఇక ఆ ఆకారం శివలింగం కాదని, ఫౌంటెన్ భాగమని ముస్లిం వర్గాలు వాదిస్తున్నాయి. మసీదు నిర్వహణను చూసుకుంటున్న ఏఐఎంసీ.. హిందు సంఘాల తరపున పిటిషన్ వేసిన వీవీఎస్ఎస్ వాదనను తోసిచ్చుతోంది. ఇదీ చదవండి: కర్మ అంటే ఇదేనేమో.. దెబ్బకు తిక్క కుదిరింది! -
అంకిత హత్యపై... ‘ఫాస్ట్‌ట్రాక్’ విచారణ
డెహ్రాడూన్/రిషికేశ్: రిషికేశ్‌లోని రిసార్టు రిసెప్షనిస్ట్ అంకితా భండారి(19)హత్యపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తామని సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రకటించారు. పోస్ట్‌మార్టం రిపోర్టు బయట పెడతామన్నారు. ఈ హామీ అనంతరం కుటుంబసభ్యులు అంకిత అంత్యక్రియలు పూర్తి చేశారు. హత్యపై కీలక ఆధారాలు దొరికే అవకాశమున్న రిసార్ట్‌ను ప్రభుత్వం ఎందుకు కూల్చేసిందని అంకిత తండ్రి అంతకుముందు ప్రశ్నించారు. దోషులను శిక్షించాలంటూ రిషికేశ్–బద్రీనాథ్ జాతీయ రహదారిపై 8 గంటలు ఆందోళనజరిగింది. మరోవైపు హత్యను పక్కదారి పట్టించేందుకు నిందితుడు, మాజీ మంత్రి వినోద్ దకొడుకు పులకిత్ ప్రయత్నించినట్లు వెలుగులోకి వచ్చింది. వినోద్ మాత్రం తన కొడుకు అమాయకుడంటూ వెనకేసుకుని వచ్చారు. -
ఉన్మాదికి ఉరి.. సరైన తీర్పు
వారంతా లోకం తెలియని పసి పిల్లలు. నైర్మల్యానికి ప్రతీకలు. అందరిలా వయసుతోపాటు వచ్చే శారీరక మార్పులే తమపై జరుగుతున్న అరాచకాలకు కారణమని వాళ్లకు తెలియదు. ఆలోచించేంత లోకజ్ఞానం కూడా లేదు. కానీ కంటికి రెప్పలా కాపాడుకునే తమ బిడ్డలపై కసాయిల చూపులు పడుతున్నాయి. లైంగిక దాడులు పెరుగుతున్నాయి. తమ కంటిపాపలను పాపాలభైరవులు గాయపరుస్తున్నారు. కళ్లు మూసుకుపోయి కామవాంఛ తీర్చుకుంటున్నారు. గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువడిన రోజే విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మూడు లైంగిక దాడి కేసులు నమోదయ్యాయి. పీఎంపాలెంలో టీడీపీ నేత నరేంద్ర బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లా కుమ్మరాపల్లి గ్రామంలో బాలికపై ఇదే గ్రామానికి చెందిన వృద్ధుడు శారీరక వేధింపులకు పాల్పడి అసభ్యకరంగా ప్రవర్తించడంపై పోక్సో కేసు నమోదు చేశారు. మరో ఘటనలో.. తనకు కాబోయే భార్య (మైనర్)ను గర్భవతిని చేసి మొహం చాటేశాడో ప్రబుద్ధుడు. అతనిపై కూడా పెందుర్తి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇలా అభం శుభం తెలియని పసిమనసులను గాయం చేస్తున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కామాంధులకు ఉరే సరైన శిక్ష అని బాధితులు స్పష్టం చేస్తున్నారు. సాక్షి విశాఖపట్నం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష పడడం చారిత్రకమైన తీర్పు అని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్డు తీర్పును స్వాగతిస్తున్నామని...ఈ హత్య కేసులో పోలీసుల పనితీరు బావుందని పేర్కొన్నారు. శుక్రవారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గతేడాది ఆగస్టు 15వ తేదీన గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్యని కత్తితో పొడిచి అతికిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈకేసులో పోలీసులు కేవలం హత్య జరిగిన 10 గంటల వ్యవధిలోనే నిందితుడ్ని అరెస్ట్ చేశారన్నారు. సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డ్ అయ్యాయని, వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపితే కేవలం రెండు రోజుల్లోనే నివేదిక ఇచ్చారన్నారు. అంతేకాకుండా హత్య జరిగిన 24 గంటల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశామన్నారు. కేవలంలో ఏడాదిలోపే ప్రత్యేక న్యాయస్థానం నింధితుడికి సరైన శిక్ష విధించిందన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే మృగాలకు ఈశిక్షతో వణుకుపుట్టాలన్నారు. దిశ చట్టం స్ఫూర్తితో కేసు దర్యాప్తు మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ చట్టాన్ని రూపొందించి, కేంద్రానికి పంపామమన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో దిశ పొలీస్ స్టేషన్లు, ఫోరెన్సిక్ ల్యాబ్‌లు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు, అన్ని చోట్లా తగిన సిబ్బందిని కూడా నియమించామన్నారు. ఆడపిల్లలకు పూర్తి రక్షణ కల్పించే విధంగా ఈచర్యలన్నీ సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్నారన్నారు. ఒక దిశ యాప్ ద్వారానే ఆపద సమయంలో దాదాపు 900 మంది అమ్మాయిలను రక్షించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.24 కోట్ల మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. రమ్య కేసు పూర్తిగా దిశ చట్టం స్ఫూర్తితోనే జరిగిందన్నారు. ఈ తీర్పు ఇప్పుడు దిశ చట్టం అవసరాన్ని మరింత గుర్తు చేస్తోందన్నారు. గతంలో దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో, సుదీర్ఘంగా ఏడేళ్ల పాటు విచారణ తర్వాత కానీ నిందితుడికి శిక్ష పడలేదన్నారు. కానీ ఇక్కడ దిశ చట్టం స్పూర్తితో ఫాస్ట్‌ట్రాక్ కోర్డులో చాలా వేగంగా విచారణ పూర్తయిందన్నారు. కేవలం 8 గంటల్లోనే హంతకుడికి శిక్ష పడిందన్నారు. రమ్య కుటుంబాన్ని అండగా సీఎం ఇదేస్ఫూర్తితో ఇక ముందు కూడా కేసుల విచారణ జరుగుతోందన్నారు. రమ్యకుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుందని హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. వారికి రూ.1.60 కోట్లతో భూమి(దాదాపు ఐదెకరాలు) కొని ఇవ్వడంతో పాటు, రూ.10 లక్షల ఇచ్చామని తెలిపారు. అంతేకాకుండా రమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చి సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి అన్నలా అండగా నిలిచారన్నారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర, సీపీ సీహెచ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా డ్రగ్స్ ప్రభావం మన రాష్ట్రంలో లేదని హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. ముందస్తుగా డ్రగ్స్ మూలాలను తెలుసుకునేందుకు పోలీసులంతా నిఘా పెడుతున్నారు. గంజాయి సాగు లేకుండా ఎస్ఈబీ పోలీసులు ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నారు. గంజాయి సాగు చేసే గిరిజన ప్రజలు ప్రభుత్వం ఇప్పటికే ఆల్ట్రర్నేటివ్ పంటలను పండించేందుకు ప్రోత్సాహం అందిస్తుంది. పోలీసులకు వారంతపు సెలవులు సిబ్బంది ఉన్నచోట అమలు చేస్తున్నాం. సిబ్బంది కొరత ఉన్న దగ్గర కొంత సమస్యగా ఉంది. త్వరలో స్టాఫ్ కొరత లేకుండా నియమాకాలు చేస్తామన్నారు. ఘన స్వాగతం అంతకుముందు ఎయిర్‌పోర్టులో హోంమంత్రి తానేటి వనితకు ఘనస్వాగతం లభించింది. పోలీస్, రెవెన్యూ అధికారులు, వైఎస్సార్ సీపీ నగర మహిళా నాయకురాలు పేడాడ రమణి కుమారి, డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్, రజక కార్పొరేషన్ డైరెక్టర్ యువశ్రీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చుక్క వరలక్ష్మి తదితరులు ఆమెకు స్వాగతం పలికారు. (చదవండి: దివ్యాంగురాలిని పెళ్లాడిన యువకుడు) -
‘దిశ చట్టంతోనే రమ్య కుటుంబానికి న్యాయం జరిగింది’
సాక్షి, అమరావతి: రమ్య హత్య కేసులో శశికృష్ణకు ఉరి ఖరారు కావడంపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. కోర్టు విధించిన ఈ చారిత్రాత్మకమైన తీర్పుని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హత్య జరిగిన పది గంటల వ్యవధిలో శశికృష్ణను పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు వారం రోజుల్లో ఛార్జ్ షీటు వేశారని తెలిపారు. 8 నెలల వ్యవధిలో తీర్పు వచ్చిందని, రమ్య కేసులో తీర్పుపై దిశ చట్టం ప్రభావం ఎంతైనా ఉందన్నారు. ‘ఆడ పిల్లలు ఇబ్బంది పడకూడదని సీఎం జగన్మోహన్ రెడ్డి దిశ యాప్ తీసుకువచ్చారు.. దిశ చట్టం పెండింగులో ఉన్నప్పటికీ పోలీసులకు కావాల్సిన సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేశారని’ చెప్పారు. దిశ చట్టంతోనే రమ్య కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు దిశ చట్టంపై హేళన మానుకోవాలని హితవు పలికారు. -
రమ్య హత్య కేసులో సంచలన తీర్పు.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య హత్య కేసులో గుంటూరు కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘దిశ’ స్ఫూర్తితో ఈ కేసు దర్యాప్తులో సమర్థవంతంగా వ్యవహరించిన పోలీసులను, ప్రాసిక్యూషన్ న్యాయవాదిని ఆయన అభినందించారు. మహిళల రక్షణ, భద్రత పట్ల ప్రభుత్వ సంకల్పాన్ని ఈ కేసు చాటి చెప్పిందన్నారు. చదవండి: బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు మహిళలు, యువతులు, బాలికలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఈ తీర్పు గట్టి సందేశాన్ని పంపిందని వ్యాఖ్యానించారు. నేరాల నిరోధంలో, దురదృష్టవశాత్తూ జరిగే నేరాల దర్యాప్తులో పోలీసులు ఇదే స్ఫూర్తితో పని చేసి మహిళల భద్రత, రక్షణకు పెద్దపీట వేయాలన్నారు. ఈ తరహా కేసుల సత్వర పరిష్కారం కోసం ఇదే చిత్తశుద్ధితో పనిచేసి, దోషులకు కఠినంగా శిక్షలు పడేలా కృషి చేయాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన వెలువరించింది. కాగా, ఇదే విషయమై పోలీసు శాఖకు అభినందనలు అంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు. చదవండి: రమ్య హత్య కేసులో సంచలన తీర్పు: కుటుంబ సభ్యులు ఏమన్నారంటే.. విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నాను. ఈ కేసు విషయంలో వేగంగా దర్యాప్తు పూర్తిచేసి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ శాఖకు అభినందనలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2022 -
సత్తా చాటిన ‘దిశ’.. న్యాయం జరిగింది
సాక్షి, అమరావతి: ‘మహిళలపై అకృత్యాలకు పాల్పడిన వారికి దిశ వ్యవస్థ ద్వారా ఉరి శిక్ష వేయించండి చూద్దాం..’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు తరచూ ప్రభుత్వానికి విసురుతున్న సవాల్‌కు శుక్రవారం జవాబు లభించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన దిశ వ్యవస్థ తన సత్తా చాటింది. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే అతి తక్కువ వ్యవధిలో ఓ హంతకుడికి న్యాయస్థానం ద్వారా ఉరిశిక్ష వేయించింది. గుంటూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణను 10 గంటల్లోనే అరెస్టు చేయడంతోపాటు.. సత్వరం చార్జ్‌షీట్ దాఖలు, ఫోరెన్సిక్ నివేదికల సమర్పణ, క్రమంతప్పని రీతిలో విచారణ ద్వారా నిందితుడి నేరాన్ని రుజువు చేసి, కేవలం 257 రోజుల్లోనే దోషిగా తేల్చి.. కోర్టు ద్వారా ఉరి శిక్ష వేయించగలిగింది. మహిళా భద్రత పరిరక్షణలో దేశానికే దిశ వ్యవస్థ చుక్కానిగా నిలిచింది. యుద్ధప్రాతిపదికన స్పందన మహిళలపై నేరాలకు పాల్పడే వారిని తక్షణం గుర్తించి సత్వరం శిక్ష విధించే ప్రక్రియలో దిశ వ్యవస్థ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. 2021 ఆగస్టు 15న గుంటూరులో ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్యపై శశికృష్ణ అనే యువకుడు నడిరోడ్డుపై దాడి చేసి కత్తితో పొడిచి హత్య చేశాడు. సీసీ కెమెరాల సహాయంతో పోలీసులు నిందితుడిని కేవలం 10 గంటల్లోనే అరెస్టు చేశారు. నేర నిరూపణకు కీలకమైన ఫోరెన్సిక్, డీఎన్ఏ పరీక్షలను కేవలం 48 గంటల్లోనే పూర్తి చేసి నివేదికలు తెప్పించారు. నిందితుడు సాంకేతికపరమైన లోపాలను అవకాశంగా చేసుకుని తప్పించుకునేందుకు ఏమాత్రం వీలులేకుండా చేశారు. రమ్య మృతదేహం, నిందితుడి దుస్తులు, కత్తి, ఘటనా స్థలంలో ఉన్న రక్తపు నమూనాలను సరిపోల్చి నిర్ధారించారు. ఫోరెన్సిక్ వ్యవస్థ బలోపేతం కేవలం రెండ్రోజుల్లోనే ఫోరెన్సిక్, డీఎన్ఏ నివేదికలు తెప్పించడం దిశ వ్యవస్థతోనే సాధ్యమైంది. ఎందుకంటే రాష్ట్ర విభజన అనంతరం ఫోరెన్సిక్ సైన్స్ విభాగం హైదరాబాద్‌లోనే ఉండిపోయింది. దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ నివేదికల కోసం నమూనాలను హైదరాబాద్‌లోని ల్యాబొరేటరీకి పంపించి నివేదికలు తెప్పించడంలో తీవ్ర జాప్యం జరిగేది. కానీ దిశ వ్యవస్థలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రంలో ఫోరెన్సిక్ సైన్స్ విభాగాన్ని బలోపేతం చేసింది. గుజరాత్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ సౌజన్యంతో రాష్ట్రంలో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలను నెలకొల్పడంతో పాటు ఈ వ్యవస్థను మూడింతలు అభివృద్ధి చేసింది. ఆ విభాగంలో నిపుణులను ఐదింతలు పెంచింది. తద్వారా రమ్య కేసులో కేవలం 48 గంటల్లోనే ఫోరెన్సిక్, డీఎన్ఏ నివేదికలను తెప్పించారు. దిశ వ్యవస్థలో భాగంగా సైబర్ క్రైమ్ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఐదింతలు బలోపేతం చేసింది. దాంతో ఈ కేసులో నిందితుడి కాల్‌డేటాను పోలీసులు సత్వరం, సమర్థవంతంగా విశ్లేషించగలిగారు. హత్యకు ముందు నిందితుడు తన మొబైల్ ఫోన్ ద్వారా మాట్లాడిన టవర్ లొకేషన్, రమ్యను వేధిస్తూ అంతకుముందు మాట్లాడిన కాల్‌డేటా, పంపిన వాట్సాప్ మెసేజ్‌లు అన్నింటినీ నిర్ధారించారు. పక్కాకుట్రతోనే రమ్యను శశికృష్ణ హత్య చేశాడని నిరూపించే సాక్ష్యాలను పోలీసులు న్యాయస్థానం ముందుంచారు. చకచకా కొలిక్కి.. రమ్య హత్య కేసును పోలీసులు దిశ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. కేంద్ర హోం శాఖ ప్రమాణాల ప్రకారం 60 రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయాల్సి ఉండగా, ఈ కేసులో కేవలం వారం రోజుల్లోనే చార్జ్‌షీట్ దాఖలు చేయడం విశేషం. దిశ కేసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించడం కేసు సత్వర విచారణకు దోహదపడింది. గతంలో మహిళలపై దాడుల కేసుల్లో విచారణ ఏళ్ల తరబడి సాగేది. ఎందుకంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఇతర పోలీసు కేసులతోపాటు ఈ కేసులను కూడా వాదించాల్సి వచ్చేది. దాంతో పని భారంతో తరచూ వాయిదాలు కోరేవారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ అడ్డంకిని తొలగించింది. దిశ కింద నమోదు చేసిన కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించింది. దాంతో రమ్య హత్య కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్రమం తప్పకుండా న్యాయస్థానంలో విచారణకు హాజరై నేరాన్ని పూర్తి ఆధారాలతో నిరూపించారు. తద్వారా హత్య జరిగిన 257 రోజుల్లోనే కోర్టు హంతకుడికి ఉరిశిక్ష విధించేలా దిశ వ్యవస్థ తన సత్తా చాటింది. ‘దిశ’తో దర్యాప్తు వేగవంతం ఇలా మహిళలపై దాడుల కేసుల్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. కేంద్ర హోం శాఖ ప్రమాణాల ప్రకారం 60 రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయాలి. కాగా ఏపీ పోలీసులు 164 అత్యాచారం కేసులు, 378 లైంగిక వేధింపుల కేసుల్లో వారం రోజుల్లోనే చార్జ్షీట్లు దాఖలు చేశారు. దేశంలోనే అత్యధికంగా 854 కేసుల్లో జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 2020–21లో దేశంలోనే అత్యధికంగా 92.21 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే చార్జ్షీట్లు దాఖలు చేశారు. 2022లో ఇప్పటి వరకు 94.94 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే చార్జ్షీట్లు నమోదు చేశారు. -
రమ్య హత్య కేసులో సంచలన తీర్పు: కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..
సాక్షి, గుంటూరు: బీటెక్ విద్యార్థి రమ్య హత్య కేసులో గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడి శశిక్రిష్టకి ఉరిశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. కోర్టు తీర్పుపై రమ్య కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఉరిశిక్ష అమలైన రోజు మరింత సంతోషిస్తామని రమ్య తల్లి అన్నారు. కష్టకాలంలోనూ ప్రభుత్వం పూర్తి అండగా నిలిచిందని తెలిపారు. ఇంత వేగంగా కేసు పూర్తవుతుందనుకోలేదన్నారు. రమ్య సోదరి మౌనిక మాట్లాడుతూ కేసు విచారణలో ఎక్కడా ఏ చిన్న అలక్ష్యం జరగలేదన్నారు. ప్రభుత్వం మొదటి నుంచి మాకు పూర్తి అండగా నిలిచిందని తెలిపారు. ఇదిలా ఉంటే, గతేడాది ఆగస్టు 15న తనను ప్రేమించడంలేదంటూ టిఫిన్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన బీటెక్ విద్యార్థి రమ్యను శశికృష్ణ దారుణంగా పొడిచి చంపాడు. ఘటన జరిగిన 9 నెలల్లోనే కేసు విచారణ పూర్తి చేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత శశికృష్ణకు కోర్టు ఉరిశిక్ష విధించింది. 28 మంది సాక్షుల నుంచి వాంగూల్మం సేకరించింది. నేర నిర్థారణలో సీసీ ఫుటేజీ కీలకంగా మారిందని, సెక్షన్ 302 కింద ఉరిశిక్షను కోర్టు ఖరారు చేసిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ప్రత్యక్ష సాక్షులతో పాటు డిజిటల్ ఎవిడెన్స్ కీలకంగా మారాయని ఎస్పీ తెలిపారు. పోలీసులు ప్రత్యేక శ్రద్ధతో కేసును పరిష్కరించారన్నారు. చదవండి: (బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు) కేసు వివరాలిలా.. ►ఆగస్టు 15, 2021న రమ్య హత్య ►సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి గుర్తింపు ►10 గంటల వ్యవధిలో అరెస్టు ►2 రోజుల్లో ఫోరెన్సిక్, డీఎన్ఏ నిర్ధారణ ►దిశ కింద కొత్త ల్యాబులు, సామర్థ్యం పెంపుతో అత్యంత వేగంగా ఫోరెన్సిక్ ఫలితాలు ►ఘటన జరిగిన వారంరోజుల్లో దిశ ప్రకారం ఛార్జి షీటు దాఖలు ►క్రమం తప్పకుండా కోర్టు విచారణ ►వాదనలు వినిపించిన దిశ ప్రత్యేక న్యాయవాది ►257 రోజుల్లో తీర్పు ఇచ్చిన గుంటూరు కోర్టు ►ఏప్రిల్ 29, 2022న నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు -
బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్య కేసులో న్యాయస్థానం శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. గుంటూరులో రమ్యను పాశవికంగా నడిరోడ్డుపై హత్య చేసిన కుంచాల శశికృష్ణకు ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. నడిరోడ్డుపై ఒక విద్యార్థినిని అత్యంత పాశవికంగా చంపడం, ముద్దాయిని పట్టుకునే సమయంలో ఆత్మహత్యాయత్నం చేయడం, విచారణ సందర్భంగా కోర్టు నుంచి పరారు కావడానికి ప్రయత్నించడం తదితర కారణాల వల్ల ఈ కేసును అత్యంత అరుదైనది (రేరెస్ట్ ఆఫ్ ది రేర్)గా భావిస్తున్నామని న్యాయమూర్తి రాంగోపాల్ తన తీర్పులో పేర్కొన్నారు. క్రైం నెంబర్ 446/2021 అండర్ సెక్షన్ 354(డి).. 302 ఐపీసి, సెక్షన్3 (2)(విఎ)ఆఫ్ ఎస్సి–ఎస్టీ యాక్ట్ కింద నమోదైన కేసులో ఉరి శిక్ష (దీన్ని హైకోర్టు నిర్దారించాల్సి ఉంటుంది), రూ.వెయ్యి జరిమానా లేదా ఒక నెల సాధారణ జైలు శిక్ష విధించారు. 354(డి) సెక్షన్ కింద రెండేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా లేదా 15 రోజుల జైలు శిక్ష, ఎస్సి–ఎస్టీ కేసు సెక్షన్ 3 (2)(వి) కింద జీవిత ఖైదు, రూ.500 జరిమానా లేదా 15 రోజుల జైలు శిక్ష, ఎస్సి–ఎస్టీ కేసు సెక్షన్ 3 (2)(విఎ) కింద రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా లేదా 15 రోజుల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పొడిచి పొడిచి హత్య గుంటూరు పరమాయకుంటలో నివాసముంటూ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న నల్లపు రమ్య(20)కు వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామం వడ్డెరపాలెంకు చెందిన కుంచల శశికృష్ణ(19)తో ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయం అయ్యింది. పదోతరగతి మధ్యలో మానేసి, ఆటోమొబైల్ షాపులో పనిచేసిన శశికృష్ణ.. తర్వాత తన నానమ్మ ఊరు వెళ్లి అక్కడ కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు. రమ్యను బస్టాండ్‌లో తరచూ కలిసే శశికృష్ణ.. తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అందుకు రమ్య తిరస్కరించింది. అతని ఫోన్ నంబర్‌ను కూడా బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. దీంతో కోపం పెంచుకున్న శశికృష్ణ గత ఏడాది ఆగస్టు 15న తన ఇంటి నుంచి టిఫిన్ కోసం హోటల్‌కు వచ్చిన రమ్యను నడిరోడ్డుపై కత్తితో పలుమార్లు పొడిచి చంపాడు. ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. సీసీ కెమెరాలో నమోదైన హత్య దృశ్యాల ఆధారంగా శశికృష్ణను 12 గంటల్లోనే నరసరావుపేట సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్వంలో పోలీసులు 36 మందిని విచారించి ఏడు రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 13న కోర్టు విచారణకు తీసుకుంది. డిసెంబర్ 31న విచారణ ప్రారంభించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.శారదామణి 28 మంది సాక్షులను విచారించారు. హత్యకు సంబంధించి కీలకమైన సీసీ టీవీ వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి ఇరువర్గాల వాదనలు విని, ఈనెల 26న విచారణ పూర్తి చేశారు. కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు ఈ కేసును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నేతృత్వంలో అన్ని సాక్ష్యాలను సేకరించారు. ఆఖరుకు డీఎన్ఎ టెస్ట్ కూడా చేయించారు. సాక్షులు అందరూ సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పారు. మంగళవారంతో వాదనలు పూర్తి అయ్యాయి. శుక్రవారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో న్యాయవాదులు, ప్రజా సంఘాలు, మీడియాతో కోర్టు ఆవరణ కిక్కిరిసిపోయింది. మధ్యాహ్నం 12 గంటలకు కోర్టు మొదలవ్వగానే.. శశికృష్ణ దోషిగా నిర్ధారణ అయ్యిందని, మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు వెలువరిస్తానని న్యాయమూర్తి ప్రకటించారు. సరిగ్గా 2.30 గంటలకు దోషికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. అనంతరం భారీ బందోబస్తు నడుమ ముద్దాయిని జైలుకు తరలించారు. కాగా, గుంటూరు జిల్లా చరిత్రలో విద్యార్థినిపై హత్య కేసులో ఉరిశిక్ష పడటం ఇది రెండోసారి. 1999లో జెకేసీ కళాశాలలో సాయిలక్ష్మీ ప్రసన్న అనే విద్యార్థినిని సుభాని అనే వ్యక్తి కత్తితో నరికి చంపాడు. ఆ కేసులోనూ దోషికి ఉరి శిక్ష పడింది. అన్ని విధాలా అండగా నిలిచిన ప్రభుత్వం రమ్య హత్య జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. నిందితులను వెంటనే అరెస్టు చేయడంతో పాటు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. అప్పటి హోం మంత్రి మేకతోటి సుచరిత, ఇతర ప్రజా ప్రతినిధులు రమ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని ప్రకటించారు. రెండో రోజే ముఖ్యమంత్రి ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలు రమ్య తల్లి నల్లపు జ్యోతికి అందించారు. అదే నెల 20వ తేదీకల్లా రమ్య తల్లికి నవరత్నాలు – పేదలందరికి ఇల్లు పథకం కింద గుంటూరులో ఇంటి పట్టా అందించారు. పోస్టుమార్టం, ఛార్జ్‌షీట్ వేసే దశలో అమె తల్లికి మరో రూ.8,25,000 ఇచ్చారు. ఇంటి నిర్మాణం కోసం రూ.1.80 లక్షలు చెల్లించారు. రమ్య సోదరి నల్లపు మౌనికకు సెప్టెంబర్ 16న రెవిన్యూ విభాగంలో ఉద్యోగం ఇచ్చారు. అప్పటికి మౌనికకు డిగ్రీ పూర్తి కాకపోవడంతో ఐదేళ్లలోగా డిగ్రీ పూర్తి చేసుకునే అవకాశం కల్పించారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించింది. వారు కోరిన విధంగా వారి సొంత గ్రామమైన అమృతలూరు మండలం యలవర్రులో కోటీ 61 లక్షల 25 వేల 300 రూపాయల ఖర్చుతో ఐదు ఎకరాల పట్టా భూమిని కొనుగోలు చేసి రమ్య తల్లి పేరున రిజిస్టర్ చేశారు. ప్రభుత్వ స్పందనను జాతీయ ఎస్సీ కమిషన్ కొనియాడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ కేసులో ప్రభుత్వం స్పందించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఆగష్టు 15న నా కుమార్తె హత్యకు గురైందని తెలిసి సృహ కోల్పోయాను. తర్వాత ఎస్పీ వచ్చి ధైర్యం చెప్పారు. దిశ డీఎస్పీ రవికుమార్ నాతో వివరాలు సేకరించారు. సీఎం ఆదేశాల మేరకు దోషిని వెంటనే పట్టుకుంటామన్నారు. ఆ మాట నిలుపుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదలుకుని పోలీస్ శాఖలో ప్రతి ఒక్కరూ మాకు వెన్నంటి ఉండి అండగా నిలిచారు. ఆ సమయంలో ఇప్పుడు మంత్రిగా ఉన్న మేరుగ నాగార్జున పరామర్శించి, మరింత ధైర్యం చెప్పారు. న్యాయస్థానమంటే ఎరుగని మాకు ప్రత్యేక పీపీ శారదామణి సొంత మనిషిగా భావించి సహకరించారు. ఇవాళ దోషికి ఉరి శిక్ష విధించడంతో మాకు ఊరట లభించింది. మాకు సహకరించిన ప్రభుత్వం, పోలీసులు, దళిత ప్రజా సంఘాల నాయకులందరికీ ధన్యవాదాలు – జ్యోతి, హత్యకు గురైన రమ్య తల్లి సీఎంతో మాట్లాడాకే ధైర్యం వచ్చింది మా అక్కను చంపిన వాడిని గంటల వ్యవధిలోనే గుర్తించి పట్టుకున్నారు. ఈ కేసులో మాకు న్యాయం జరుగుతుందని తొలుత భావించలేదు. సీఎం జగన్మోహన్రెడ్డి వద్దకు వెళ్లే ముందు కూడా న్యాయం జరుగుతుందని పెద్దగా అనిపించలేదు. అయితే సీఎంతో మాట్లాడిన తర్వాతే ధైర్యం వచ్చింది. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీఎం దగ్గరుండి అన్నీ తానై చూసుకున్నారు. ప్రభుత్వం, పోలీసులు, న్యాయస్థానం, ప్రజాప్రతినిదులు మాకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. – మౌనిక, హత్యకు గురైన రమ్య సోదరి ఈ తీర్పుతో మహిళలకు భరోసా గత ఏడాది ఆగస్టు 15న బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకు గురవ్వగానే ఘటనా స్థలాన్ని పరిశీలించాం. అనంతరం జీజీహెచ్‌కు వెళ్లి రమ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పాం. హత్య చేసిన యువకుడిని సాంకేతిక ఆధారాలతో గుర్తించి, పది గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశాం. సాక్ష్యాలు, సీసీ పుటేజీ, వేలి ముద్రలు, డీఎన్ఏ తదితర ఆధారాలు సేకరించాం. పోలీస్, ఫోరెనిక్స్, న్యాయస్థానం.. ఒక బృందంగా పని చేశాం. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సైతం పోలీసుల పనితీరును అభినందించింది. ఈ తీర్పుతో మహిళలకు భరోసా కలుగుతుందనడంలో సందేహం లేదు. – కె.ఆరిఫ్‌హఫీజ్, గుంటూరు జిల్లా ఎస్పీ ఈ శిక్షకు అతను అర్హుడే రమ్య హత్య కేసుపై జిల్లా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. కోర్టు ట్రయల్ జరుగుతున్న క్రమంలో పలువురు సాక్షులను విచారించాం. సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయస్థానం దోషికి మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. హత్యకు పాల్పడిన అతను ఈ శిక్షకు పూర్తిగా అర్హుడే. – శారదామణి, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరణ శిక్ష సరికాదు క్షణికావేశంలో చేసిన తప్పుకు మరణ శిక్ష సరికాదు. ఘటన జరిగిన రోజు నుంచి నా కుమారుడు ఏడుస్తూనే ఉన్నాడు. తప్పు చేశానని పశ్చాత్తాప పడుతున్నాడు. నా కుమారుడికి ఉరి శిక్ష వేస్తే రమ్య తిరిగి వస్తుందనుకుంటే ఆ శిక్ష వేయొచ్చు. కోర్టు తన నిర్ణయాన్ని పునరాలోచించాలి. – భూలక్ష్మి, శశికృష్ణ తల్లి ‘దిశ’ను విమర్శిస్తున్న వారికి ఇదో చెంపపెట్టు ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ గుంటూరు కోర్టు ఇచ్చిన తీర్పు దిశ చట్టంపై విమర్శలు చేస్తున్న వారికి చెంపపెట్టు. దేశంలో ఎక్కడాలేని రీతిలో పిల్లలు, మహిళల రక్షణ కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ చట్టానికి రూపకల్పన చేశారు. పార్లమెంట్ ఆమోదించడంలో జాప్యం వల్ల దిశ ఇంకా చట్ట రూపం సంతరించుకోలేదు. ఆ చట్టం స్ఫూర్తితో దిశ యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. కోటి మంది ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఆపదలో ఉన్న మహిళలు యాప్‌లో సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులు రక్షణ చర్యలు చేపడుతున్నారు. – సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కోర్టు తీర్పు చరిత్రాత్మకం విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ గుంటూరు కోర్టు తీర్పునివ్వడం చరిత్రాత్మకం. హత్య జరిగిన 10 గంటల్లోపే నిందితుణ్ణి అరెస్ట్ చేసి.. 24 గంటల్లోనే చార్జిషీట్ దాఖలు చేశాం. కోర్టు తీర్పుతో ఇలాంటి ఘటనలకు పాల్పడే మృగాలకు వణుకు పుడుతుంది. ఈ తీర్పు ఇప్పుడు దిశ చట్టం అవసరాన్ని మరింత గుర్తు చేస్తోంది. – తానేటి వనిత, హోంమంత్రి ‘దిశ’ గొప్పదనమిది విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణకు గుంటూరు కోర్టు ఉరిశిక్ష విధించడాన్ని స్వాగతిస్తున్నాం. 9 నెలల్లోనే నిందితుడికి ఉరి శిక్షపడేలా చేయడం సీఎం వైఎస్ జగన్ పరిపాలన గొప్పదనం. దిశ చట్టాన్ని కేంద్రం ఆమోదిస్తే.. 21 రోజుల్లోనే నిందితులకు ఉరి శిక్ష పడేలా చేయడానికి ఆస్కారం ఉండేది. – ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి ‘దిశ’తో సత్వర న్యాయం గుంటూరులో ఉన్మాది కత్తిపోట్లకు బలైన రమ్య హత్యకేసు నిందితునికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునివ్వడం హర్షణీయం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ’దిశ’ బిల్లు స్ఫూర్తితో సత్వర న్యాయానికి ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ కేసు విచారణ, బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని జాతీయ ఎస్సీ కమిషన్ సైతం మెచ్చుకుంది. మహిళలపై అకృత్యాలకు పాల్పడే మృగాళ్లకు ఈ కేసు ఒక హెచ్చరికగా నిలుస్తుంది. – వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్, మహిళా కమిషన్ మృగాళ్లకు కనువిప్పు రమ్య హత్య కేసులో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు మృగాళ్లకు కనువిప్పు అవుతుంది. ఎవరైనా మహిళల జోలికి వస్తే తమ ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చెప్పడానికి ఈ కేసు ఒక ఉదాహరణ. రమ్య కేసును దిశ చట్టం రూపకల్పనలో పేర్కొన్నట్టుగా వేగవంతంగా చర్యలు చేపట్టి శిక్ష పడేలా చేశారు. – విడదల రజని, వైద్యారోగ్య శాఖ మంత్రి -
అవంతికి హామీ ఇచ్చిన సీపీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేమంత్ కుటుంబ సభ్యులకు పూర్తి భద్రత కల్పిస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హామీనిచ్చారు. హేమంత్ ఇంటివద్ద 24 గంటల భద్రత ఏర్పాటు చేయాలని చందానగర్ పోలీసులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఒక మహిళా కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. తమకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలన్నహేమంత్ భార్య అవంతి విజ్ఞప్తి మేరకు సజ్జనార్ స్పందించారు. దీంతోపాటు హేమంత్ కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్టు ఆయన తెలిపారు. (చదవండి: ‘చచ్చింది కుక్కనే కదా...మనిషి కాదుగా’) ఇదిలాఉండగా.. హేమంత్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితులు యుగేంధర్ రెడ్డి, లక్ష్మారెడ్డిని పోలీసులు ఆరు రోజుల పాటు విచారించనున్నారు. కేసు విచారణలో భాగంగా అవంతిక తండ్రి లక్ష్మారెడ్డి, యుగేందర్ రెడ్డిలను గచ్చిబౌలి పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గోపన్ పల్లి వద్ద హేమంత్ కిడ్నాప్ స్థలం నుంచి సంగారెడ్డిలో హత్యా స్థలం వరకు నిందితులను తీసుకెళ్లి పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు. ప్రధాన కుట్రదారు లక్ష్మారెడ్డి, అమలు చేసింది యుగంధర్ రెడ్డి అని పోలీసులు నిర్ధారించారు. సుపారీ కిల్లింగ్‌లో ఇంకా ఎవరి హస్తం ఉందనే కోణంలో విచారిస్తున్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటివరకు 21 మందిని పోలీసులు అరెస్టు చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. (చదవండి: హేమంత్ హత్య : అసలు తప్పెవరిది?) -
సమత కేసులో ముగిసిన వాదనలు
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో హత్యాచారానికి గురైన సమత కేసులో సోమవారం వాదనలు ముగిశాయి. గత ఏడాది డిసెంబర్లో సాక్షులను విచారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. తీర్పును ఈ నెల 27వ తేదిన వెల్లడించనున్నట్లు ప్రకటించింది. గతేడాది నవంబర్ 24వ తేదీన నిందితులైన ఎ1 షెక్ బాబా, ఎ2 షేక్ షాబోద్దీన్, ఎ3 షెక్ ముఖ్దీమ్లు కొమరంభీం జిల్లా ఎల్లపటార్ గ్రామంలో సమతను అత్యాచారం చేసి, హత్యా చేసిన సంగతి తెలిసిందే. కాగా నవంబర్ 27వ తేదిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. డిసెంబర్ 11న ప్రభుత్వం కేసు విచారణలో భాగంగా ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది. ఇక డిసెంబర్ 14న పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేయగా కేసులోని 44 మంది సాక్షులలో 25 మందిని కోర్టు విచారించింది. చదవండి: సమత కేసు డిసెంబర్ 26కి వాయిదా -
లేదు.. తెలియదు.. కాదు!
నల్లగొండ: ‘మనీషాను తీసుకెళ్లావా.. అత్యాచారం జరిపి హత్య చేసి బావిలో పూడ్చిపెట్టావా?’అన్న జడ్జి ప్రశ్నలకు ‘లేదు.. తెలియదు.. కాదు..’అని నిర్భయంగా సమాధానమిచ్చాడు సైకో శ్రీనివాస్‌రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామా రం మండలం హాజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని గురువారం నల్ల గొండ మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారించారు. ముగ్గురు బాలికల హత్యలకు సంబంధించి 101మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు ఇప్పటికే నమోదు చేసింది. ఈ క్రమంలో గురువారం మనీషా కేసుకు సంబంధించి నిందితుడి వాంగ్మూలం రికార్డ్ చేశారు. ఒక్కో సాక్షి వాంగ్మూలాన్ని శ్రీనివాస్‌రెడ్డికి జడ్జి చదివి వినిపిం చారు. కాగా, వీటిపై జడ్జి అడిగిన ప్రశ్నలకు నిందితుడు తాపీగా ‘తెలియదు.. కాదు’అని జవాబు ఇచ్చాడు. హత్యకు గురైన బాలికల దుస్తులపై స్మెర్మ్ ఆనవాళ్లు నీకు సంబంధించినవేనని ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది కదా? అని అడగగా, ఎస్ఓటీ పోలీసులు సిరంజీలతో చల్లారని చెప్పుకొచ్చాడు. ఫోర్న్ చూస్తావా అన్న ప్రశ్నకు తన దగ్గర స్మార్ట్ ఫోన్ లేదని చెప్పాడు. మనీషా హత్య జరిగిన రోజు తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశానని, అందుకే టవర్ లొకేషన్ ఆ ప్రాంతంలో చూపించిందని తెలిపాడు. కర్నూల్లో జరిగిన సువర్ణ హత్యపై అడగ్గా, ఆమె ఎవరో తనకు తెలియదని సమాధానం ఇచ్చాడు. కాగా, ఈ కేసు తదుపరి విచారణను జడ్జి జనవరి 3వ తేదీకి వాయిదా వేశారు. ఆగస్టులో చార్జ్‌షీట్ దాఖలు గత ఏప్రిల్‌లో హాజీపూర్‌కు చెందిన శ్రావణి మిస్సింగ్ కేసుపై విచారణ చేస్తున్న పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా శ్రావణితోపాటు కల్పన, మనీషాను కూడా అత్యాచారం చేసి చంపి పాతి పెట్టినట్టుగా ఒప్పుకున్నాడు. పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో పోలీసులు సాక్ష్యాలన్నింటినీ పకడ్బందీగా సేకరించారు. ఆగస్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నల్లగొండలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో విచారణ సాగుతోంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో వందమంది సాక్షులను విచారించారు. కేసు విచారణ వారంరోజుల్లోగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని పీపీ వెంకట్‌రెడ్డి తెలిపారు. కనిపించని ఆందోళన కోర్టులో విచారణ సందర్భంగా జడ్జి అడిగిన ప్రతి ప్రశ్నకు నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి నిర్భయంగా సమాధానాలు చెప్పాడు. అతని ముఖంలో ఎటువంటి ఆందోళన కనిపించకపోవడం గమనార్హం. -
హాజీపూర్ కేసు: ‘సువర్ణ ఎవరో తెలీదు’
సాక్షి, నల్గొండ : హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిపై జరుగుతున్న విచారణ ఫోక్సో స్పెషల్ కోర్టులో గురువారం ముగిసింది. తదుపరి విచారణను జనవరి 3కు న్యాయమూర్తి వాయిదా వేశారు. మనీషా కేసుకు సంబంధించి 29 మంది సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలాలను జడ్జి నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి వినిపించారు. కానీ జడ్జి అడిగిన ప్రతి ప్రశ్నకు అతని నుంచి ఎక్కువగా కాదు, లేదు, తెలియదు అనే సమాధానాలు వచ్చినట్లు తెలుస్తోంది. జడ్జి ప్రశ్నలను అడిగే సమయంలో శ్రీనివాస్ రెడ్డి ముఖంలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. ఫోర్న్ వీడియోలు చూస్తావా అని జడ్జి ప్రశ్నించగా.. తన దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ లేదని సమాధానమిచ్చాడు. కర్నూలులో జరిగిన సువర్ణ హత్యతో నీకు ఏమైనా సంబంధం ఉందా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. అసలు సువర్ణ ఎవరో తనకు తెలీదని నిందితుడు పేర్కొనడం జరిగింది. కాగా బాలికల దుస్తులపై ఉన్న స్పెర్మ్, రక్తపు మరకల ఆనవాళ్లు ఫోరెన్సిక్ రిపోర్టులో నీదే అని తేలింది.. దీనిపై నువ్వేమంటావు అని జడ్జి ప్రశ్నించగా.. ఎస్ఓటీ పోలీసులే వాటిని దుస్తులపై సిరంజిలతో చల్లారని నిందితుడు చెప్పినట్టు సమాచారం. హత్య జరిగిన రోజు తన ఫోన్ స్విచ్చాఫ్ చేశానని, అందుకే టవర్ లొకేషన్ ఆ ప్రాంతంలో చూపిందని నిందితుడు వెల్లడించాడు. అయితే ఈ కేసులో సాక్ష్యాలుగా తన అమ్మ, నాన్న, అన్నని తీసుకురావాలని నిందితుడు జడ్జిని కోరినట్లు తెలుస్తోంది. -
ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో హాజీపూర్ కేసు విచారణ
-
సమత కేసు డిసెంబర్ 26కి వాయిదా
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో అత్యాచారం, హత్యకు గురైన సమత కేసు విచారణ రెండోరోజు ప్రారంభమైంది. ఈ కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సమత కేసులో రెండో రోజు సాక్షులను పోలీసులు మంగళవారం కోర్టుహాల్లో ప్రవేశపెట్టారు. దీంతో కోర్టులో సమత కేసు సాక్షుల విచారణ కొనసాగింది. కాగా సోమవారం ఏడుగురు సాక్షులను విచారించాల్సి ఉండగా.. కేవలం మృతురాలి భర్త, దగ్గరి బంధువును మాత్రమే ప్రత్యేక కోర్టు విచారించింది. తొలిరోజు మిగిలిన ఐదుగురితోపాటు.. షెడ్యూల్ ప్రకారం మంగళవారం సాక్ష్యం చెప్పాల్సిన ఏడుగురు, మొత్తంగా 12 మందిని కోర్టు విచారించనున్నది. డిసెంబర్ 31 వరకు సాక్షులను విచారించి వారి స్టేట్మెంట్ను ప్రత్యేక కోర్టు రికార్డు చేయనున్నది. తర్వాత పోలీసులు నమోదు చేసిన డీఎన్ఏ, ఎఫ్ఐఆర్ , ఇతర ఆధారాలు, సాక్షాధారాలు పరిశీలించి జనవరి మొదటి లేదా రెండో వారంలో ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రత్యేక కోర్టుకు వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి వెళ్లారు. ఈ రోజు ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌ను పరిశీలించడానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. దీంతోపాటు కోర్టులో సమత కేసు విచారణ కూడా జరుగుతుండటంతో ఐజీ నాగిరెడ్డి ప్రత్యేక కోర్టుకు వెళ్లారు. రెండో రోజు విచారణ అనంతరం సమత కేసును ప్రత్యేక కోర్టు గురువారానికి (డిసెంబర్ 26) వాయిదా వేసింది. -
హాజీపూర్ కేసు.. మరో వారం రోజుల్లో తీర్పు!
సాక్షి, నల్గొండ : హాజీపూర్ వరుస హత్యల ఘటనలో మరో వారం రోజుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. గత కొన్ని రోజులుగా నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ ఘటనపై విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో నిందితుడైన శ్రీనివాస్‌రెడ్డి విచారణ ముగిసింది. అయితే నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని మరోసారి కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో వచ్చే గురువారం శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. చివరిసారిగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు శ్రీనివాస్‌రెడ్డిని అభిప్రాయం తీసుకోనుంది. అనంతరం న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించనుంది. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యాలకు పాల్పడి హత్యచేసిన విషయం విదితమే. -
సమత కేసు : లాయర్‌ను నియమించిన కోర్టు
సాక్షి,ఆదిలాబాద్ : సమత అత్యాచారం, హత్య కేసుకు సంబంధించిన విచారణ ఆదిలాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమత కేసులో ప్రధాన నిందితుడైన షేక్ బాబు సహా షేక్ శాబొద్దీన్, షేక్ ముఖ్దూమ్‌లను పోలీసులు రెండోరోజైన మంగళవారం ఆదిలాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సమత కేసును విచారించిన కోర్టు రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. సమత కేసులో బార్ అసోసియేషన్ నిర్ణయంతో నిందితుల తరపున వాదించడానికి లాయర్లు ఎవరు ముందుకు రాకపోవడంతో రహీమ్ అనే అడ్వకేట్‌ను నియమించినట్లు కోర్టు పేర్కొంది. నిందితుల తరపున వాదించడానికి తాను సిద్ధమేనని, ఈ మేరకు బార్ అసోసియేషన్ అనుమతి కోరనున్నట్లు రహీమ్ తెలిపారు. (చదవండి : సమత కేసు: రెండోరోజు కోర్టుకు నిందితులు) -
సమత కేసు: రెండోరోజు కోర్టుకు నిందితులు
సాక్షి, ఆదిలాబాద్: సమత అత్యాచారం, హత్య కేసు నిందితులను రెండోరోజు మంగళవారం కూడా కోర్టుకు వచ్చారు. ప్రధాన నిందితుడు షేక్ బాబు సహా మరో ఇద్దరు నిందితులు షేక్ శాబొద్దీన్, షేక్ ముఖ్దూమ్‌లను పోలీసులు మంగళవారం ఆదిలాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ ఘటనలో 44 మంది సాక్షులతో కూడిన చార్జిషీట్‌ను అసిఫాబాద్ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి శనివారం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం నుంచి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఇందులోభాగంగా రోజుకు ఐదుగురు సాక్షుల చొప్పున విచారించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా బాధితురాలు దళిత మహిళ కావడంతో అత్యాచారం, హత్య కేసులతో పాటుగా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నట్లు అభిప్రాయపడుతున్నారు. కాగా చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ.. నవంబరు 24న కుమురం భీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో అత్యాచారం, హత్యకు గురై న విషయం తెలిసిందే. బాధితురాలిని చిత్రహింసలకు గురిచేసి అత్యంత పాశవికంగా హతమార్చిన నిందితులను అదే నెల27న పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో బాధితురాలి పేరును ‘సమత’గా మార్చిన పోలీసులు.. నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాక.. గొంతుకోసి చంపారని కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో పేర్కొన్నారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఈ విషయం తేలిందన్నారు. అలాగే బాధితురాలి శరీరంలో నిందితుల డీఎన్ఏ లభించిన నివేదికను కోర్టుకు సమర్పించారు. ఇక దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ ఘటనకు మూడు రోజుల ముందు ఈ దారుణం జరిగింది. అయితే దిశ తరహాలో మొదట ప్రాధాన్యత దక్కకపోవడంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. తర్వాత ప్రభుత్వం స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిందితులు ఏ1గా షేక్‌బాబా, ఏ2 షేక్ షాబొద్దీన్, ఏ3 షేక్ ముఖ్దూమ్లకు ఉరిశిక్ష విధించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. -
కోర్టుకు ‘సమత’ నిందితులు; 44 మందిని..
సాక్షి, ఆదిలాబాద్: సమత అత్యాచారం, హత్య కేసు నిందితులను ఆదిలాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు షేక్ బాబు సహా మరో ఇద్దరు నిందితులు షేక్ శాబొద్దీన్, షేక్ ముఖ్దూమ్‌లను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ ఘటనలో 44 మంది సాక్షులతో కూడిన చార్జిషీట్‌ను అసిఫాబాద్ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి శనివారం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం నుంచి విచారణ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా రోజుకు ఐదుగురు సాక్షుల చొప్పున విచారించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా బాధితురాలు దళిత మహిళ కావడంతో అత్యాచారం, హత్య కేసులతో పాటుగా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నట్లు అభిప్రాయపడుతున్నారు. కాగా చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ.. నవంబరు 24న కుమురం భీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో అత్యాచారం, హత్యకు గురై న విషయం తెలిసిందే. బాధితురాలిని చిత్రహింసలకు గురిచేసి అత్యంత పాశవికంగా హతమార్చిన నిందితులను అదే నెల27న పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో బాధితురాలి పేరును ‘సమత’గా మార్చిన పోలీసులు.. నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాక.. గొంతుకోసి చంపారని కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో పేర్కొన్నారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఈ విషయం తేలిందన్నారు. అలాగే బాధితురాలి శరీరంలో నిందితుల డీఎన్ఏ లభించిన నివేదికను కోర్టుకు సమర్పించారు. ఇక దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ ఘటనకు మూడు రోజుల ముందు ఈ దారుణం జరిగింది. అయితే దిశ తరహాలో మొదట ప్రాధాన్యత దక్కకపోవడంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. తర్వాత ప్రభుత్వం స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిందితులు ఏ1గా షేక్‌బాబా, ఏ2 షేక్ షాబొద్దీన్, ఏ3 షేక్ ముఖ్దూమ్లకు ఉరిశిక్ష విధించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. -
ఉన్నావ్: యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం
లక్నో : ఉన్నావ్ అత్యాచారం, హత్య ఘటన అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం 218 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలపై అత్యాచారం, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి ఈ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఉన్నావ్ బాధితురాలు మరణానంతరం ప్రభుత్వంపై అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో యోగి ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆయోద ముద్ర వేసింది. ఈ క్రమంలో.. అత్యాచారం కేసులను విచారించడానికి 144 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను, పిల్లలపై నేరాలకు సంబంధించిన కేసులను విచారించడానికి 74 కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. -
తక్షణ న్యాయం ఉండదు!
జోధ్‌పూర్: న్యాయమన్నది ఎప్పుడూ తక్షణం అందేదిగా ఉండరాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బాబ్డే స్పష్టం చేశారు. న్యాయం ఎప్పుడూ ప్రతీకారంగా మారకూడదని, అలా మారినప్పుడు న్యాయానికి ఉన్న లక్షణాలేవీ మిగలవని ఆయన తెలిపారు. రాజస్తాన్ హైకోర్టులో శనివారం ఒక కొత్త భవనాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు దిశ హత్య కేసు నిందితులు ఎన్కౌంటర్లో మరణించిన నేపథ్యంలో ప్రాధాన్యమేర్పడింది. ఇటీవలి పరిణామాలు చాలా పురాతనమైన చర్చను సరికొత్త ఉత్సాహంతో మొదలుపెట్టాయన్న జస్టిస్ బాబ్డే న్యాయవ్యవస్థ కేసుల విచారణలో జరుగుతున్న జాప్యం విషయంలో తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. ప్రజలందరికీ న్యాయం అందుబాటులో ఉండేందుకు న్యాయవ్యవస్థ కట్టుబడి ఉండాలని, ఇందుకోసం కొత్త మార్గాలను అన్వేషించడంతోపాటు ఉన్నవాటిని దృఢతరం చేసుకోవాల్సిన అవసరమూ ఉందని ప్రధాన న్యాయమూర్తి వివరించారు. వివాదాలను వేగంగా సంతృప్తికరంగా పరిష్కరించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అదే సమయంలో న్యాయవ్యవస్థ పట్ల మారుతున్న దృక్పథంపై కూడా అవగాహన ఉండాలని అన్నారు. న్యాయవ్యవస్థలో జరిగిన తప్పిదాలను స్వయంగా దిద్దుకునే ఏర్పాటు అవసరముందని, అయితే ఈ ఏర్పాట్లను ప్రచారం చేయాలా? వద్దా? అన్నది చర్చనీయాంశమని అన్నారు. గత ఏడాది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నలుగురు బహిరంగంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. చేసిన వ్యాఖ్యలు, జరిగిన తప్పిదాలను స్వయంగా సరిచేసుకునేందుకు జరిగిన ఒక ప్రయత్నమేనని అన్నారు. ‘లిటిగేషన్లను వేగంగా పరిష్కరించే పద్ధతులను ఏర్పాటు చేయడమే కాదు. లిటిగేషన్లను ముందస్తుగా నివారించాల్సి ఉంది’అని చెప్పారు. కేసు దాఖలయ్యే ముందే మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారానికి ఇప్పటికే కొన్ని చట్టాలున్నాయని, వాటిని అన్ని కేసులకూ తప్పనిసరి చేసే విషయాన్ని ఆలోచించాలని చెప్పారు. అంతకుముందు కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ మానభంగ కేసుల విచారణ సత్వరం జరిగేలా ప్రధాన న్యాయమూర్తి, ఇతర సీనియర్ న్యాయమూర్తులు ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకు తగిన నిధులు అందిస్తుందని హామీ ఇచ్చారు. విచారణ జాప్యం దేశంలోని మహిళలను తీవ్రమైన బాధకు, ఒత్తిడికి గురిచేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో హేయమైన నేరాల విచారణకు 704 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఉన్నాయని, పోక్సో, మానభంగ నేరాల విచారణకు మరో 1,123 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి వివరించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్ తరువాత మానభంగ కేసుల నిందితులకు సత్వర శిక్ష పడేలా చూడాలన్న డిమాండ్లు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్కౌంటర్లో దిశ నిందితులు మరణించడంపై కొన్ని వర్గాల వారు సంతోషం వ్యక్తం చేయడం, సంబరాలు చేసుకోవడం కొందరి ఆందోళనకు కారణమవుతోంది. పేదలకు అందని స్థాయిలో న్యాయ ప్రక్రియ: రాష్ట్రపతి దేశంలో న్యాయ ప్రక్రియ పేదలకు అందని స్థాయిలో ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. జోధ్‌పూర్‌లో శనివారం హైకోర్టు కొత్త భవనం ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ ‘‘న్యాయ ప్రక్రియ బాగా ఖరీదైపోయింది. పలు కారణాల వల్ల సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా హైకోర్టు, సుప్రీంకోర్టులు సాధారణ కక్షిదారులకు అందడం అసాధ్యంగా మారింది’’అని వ్యాఖ్యానించారు. ‘‘ఈ రోజుల్లో పేదవారెవరైనా ఇక్కడకు ఫిర్యాదు తీసుకుని రాగలరా? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైంది. ఎందుకంటే రాజ్యాంగం పీఠికలో అందరికీ న్యాయం అందించడం బాధ్యతని మనమందరం అంగీకరించాం కాబట్టి’ అని అన్నారు. న్యాయం కోసం పెడుతున్న ఖర్చుపై గాంధీజీ ఆందోళన వ్యక్తం చేశారని, దరిద్ర నారాయణుల సేవే ఆయనకు అన్నింటికంటే ముఖ్యమైన అంశమని అన్నారు. గాంధీజీ ప్రాథమ్యాలను గుర్తు చేసుకుంటే, కటిక పేదవాడు, అతి బలహీనుడి ముఖాలను మనం మననం చేసుకుంటే ఈ అంశాల్లో మనకు తగిన మార్గం కనిపిస్తుందని అన్న రాష్ట్రపతి న్యాయ ప్రక్రియను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఉచిత న్యాయసేవలు ఒక మార్గం కావచ్చునని సూచించారు. -
జస్టిస్ ఫర్ 'దిశ'.. ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు
సాక్షి, హైదరాబాద్ : దిశ అత్యాచారం, హత్య ఘటనలో దోషులను త్వరితగతిన తేల్చేందుకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. జస్టిస్ ఫర్ దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు హైకోర్టు ఆమోదముద్ర వేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు వీలుగా బుధవారం రాష్ట్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్ మొదటి అదనపు సెషన్స్ జిల్లా జడ్జి కోర్టును ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టుగా పరిగణిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రోజువారీగా ‘దిశ’కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించి సత్వరం తీర్పు వెలువరించనుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు కావడం ఇది రెండోసారి. ఇటీవల వరంగల్ జిల్లాలో 9 నెలల పాపపై అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. ఈ కేసులో సత్వర విచారణ జరిపిన కోర్టు 56 రోజుల్లో తీర్పు చెప్పింది. నిందితుడికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్పు చేసింది. సీఎం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ఘటనలో విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. అందుకు అనుమతివ్వాల్సిందిగా రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి ఎ.సంతోష్‌రెడ్డి ఈనెల 2వ తేదీన హైకోర్టుకు లేఖ రాశారు. ఈ మేరకు ఆ తర్వాతి రోజే హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఆమోదముద్ర వేశారు. హైకోర్టు అనుమతితో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తూ 3వ తేదీతో న్యాయ శాఖ ఉత్తర్వులు (జీవో ఆర్టీ నంబర్ 639) జారీ చేసింది. -
దిశ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: జస్టిస్ ఫర్ దిశ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మహబూబ్‌నగర్‌లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయనుంది. మహబూబనగర్ డిస్ట్రిక్ట్ కోర్టు సెషన్స్ జడ్జిని నియమిస్తూ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. షాద్‌నగర్ సమీపంలో జరిగిన దిశ హత్యాచారం కేసు యావత్ దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులపై సత్వరమే విచారణ జరిపి..వెంటనే ఉరితీయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను వేగవంతంగా కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటుతో విచారణను వేగంగా పూర్తిచేసి.. ఈ కేసులో దోషులను తేల్చి.. కఠినశిక్ష విధించాలని ప్రభుత్వం తరఫున లా సెక్రటరీ సంతోష్ రెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు. -
రేప్ కేసులకు ‘ఫాస్ట్‌ట్రాక్’
న్యూఢిల్లీ: పెండింగ్‌లో ఉన్న అత్యాచార కేసులను విచారించేందుకు అక్టోబర్ 2 నుంచి ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేందుకు కేంద్ర న్యాయ శాఖ సిద్ధం అవుతోంది. మొత్తం 1,023 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి రూ.767.25 కోట్లు ఖర్చవుతుందని న్యాయ విభాగం పేర్కొంది. అందులో నిర్భయ నిధుల కింద కేంద్రం నుంచి రూ. 474 కోట్లు మంజూరు కానున్నాయి. ఆర్థిక సంఘం ఖర్చుల వివరాలను ప్రతిపాదించిన తర్వాత దాన్ని ఆర్థిక మంత్రి దగ్గరకు పంపనున్నామని, న్యాయవిభాగం ఈ నెల 8న కేబినేట్ సెక్రెటేరియట్‌కు రాసిన లేఖలో తెలిపింది. దీనితోపాటే అక్టోబర్ 2 నుంచి ఈ కోర్టులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. మొదటి దశలో 9 రాష్ట్రాల్లో 777 కోర్టులు ఏర్పాటు చేస్తామని, రెండో దశలో 246 కోర్టులు ఏర్పాటు చేస్తామని మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇదివరకే తెలిపిన సంగతి తెలిసిందే.