నిందితుడికి సత్వరమేశిక్ష పడేలా చర్యలు
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండ
మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క
సుల్తానాబాద్ రూరల్(పెద్దపల్లి), పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలోని రైస్‌మిల్లు సమీపంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆ పై హత్య చేసిన దారుణ ఘటనలో నిందితుడికి సత్వరమే శిక్ష పడేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క, ఐటీ, పురపాలక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రి వర్గం ఈమేరకు నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. కాట్నపల్లిలోని ఓ రైస్‌మిల్లులో పనిచేస్తున్న దంపతుల ఆరేళ్ల కూతురిని బీహార్‌కు చెందిన యువకుడు ఈనెల 14న అపహరించి హత్యాచారం చేసిన ఘటన తమను కలచివేసిందన్నారు.
మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ఆదివారం రైస్‌మిల్లు సమీపంలోని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ, హత్యాచార ఘటనపై సీఎంతోపాటు మంత్రివర్గం, ఎంపీ, ఎమ్మెల్యేలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. నిందితునికి త్వరగా శిక్ష పడేలా చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు చర్యలను మరింత విస్తృతం చేస్తామని చెప్పారు.
బాధిత కుటుంబానికి రూ.8లక్షలు
బాధిత కుటుంబానికి రైస్‌మిల్లు యాజమాన్యం నుంచి రూ.5.50లక్షలు ఇప్పించాలని, ప్రభుత్వం ద్వారా మరో రూ.2.50లక్షలు పరిహారం అందించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. అదే విధంగా చిన్నారి తండ్రికి ఉద్యోగావకాశం కల్పించడంతో పాటు సొంతిల్లు మంజూరు చేసేలా వారి స్వస్థలం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌తో చర్చించామని ఆయన తెలిపారు. మంత్రుల వెంట కలెక్టర్ శ్రీహర్ష, రామగుండం సీపీ శ్రీనివాస్ ఉన్నారు.
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
తెలంగాణను డ్రగ్స్‌రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది కాట్నపల్లి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్ సరఫరా, విక్రయాలపై నిరంతర నిఘా పెంచి వాటిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. మంత్రులు పెద్దపల్లిలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, మత్తులో ఉండడంవల్లే సుల్తానాబాద్ రైస్‌మిల్లులో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య జరిగిందని భావిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment