వారంతా లోకం తెలియని పసి పిల్లలు. నైర్మల్యానికి ప్రతీకలు. అందరిలా వయసుతోపాటు వచ్చే శారీరక మార్పులే తమపై జరుగుతున్న అరాచకాలకు కారణమని వాళ్లకు తెలియదు. ఆలోచించేంత లోకజ్ఞానం కూడా లేదు. కానీ కంటికి రెప్పలా కాపాడుకునే తమ బిడ్డలపై కసాయిల చూపులు పడుతున్నాయి. లైంగిక దాడులు పెరుగుతున్నాయి. తమ కంటిపాపలను పాపాలభైరవులు గాయపరుస్తున్నారు. కళ్లు మూసుకుపోయి కామవాంఛ తీర్చుకుంటున్నారు. గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువడిన రోజే విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మూడు లైంగిక దాడి కేసులు నమోదయ్యాయి. పీఎంపాలెంలో టీడీపీ నేత నరేంద్ర బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లా కుమ్మరాపల్లి గ్రామంలో బాలికపై ఇదే గ్రామానికి చెందిన వృద్ధుడు శారీరక వేధింపులకు పాల్పడి అసభ్యకరంగా ప్రవర్తించడంపై పోక్సో కేసు నమోదు చేశారు. మరో ఘటనలో.. తనకు కాబోయే భార్య (మైనర్)ను గర్భవతిని చేసి మొహం చాటేశాడో ప్రబుద్ధుడు. అతనిపై కూడా పెందుర్తి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇలా అభం శుభం తెలియని పసిమనసులను గాయం చేస్తున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కామాంధులకు ఉరే సరైన శిక్ష అని బాధితులు స్పష్టం చేస్తున్నారు.
సాక్షి విశాఖపట్నం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష పడడం చారిత్రకమైన తీర్పు అని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్డు తీర్పును స్వాగతిస్తున్నామని...ఈ హత్య కేసులో పోలీసుల పనితీరు బావుందని పేర్కొన్నారు. శుక్రవారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
గతేడాది ఆగస్టు 15వ తేదీన గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్యని కత్తితో పొడిచి అతికిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈకేసులో పోలీసులు కేవలం హత్య జరిగిన 10 గంటల వ్యవధిలోనే నిందితుడ్ని అరెస్ట్ చేశారన్నారు. సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డ్ అయ్యాయని, వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపితే కేవలం రెండు రోజుల్లోనే నివేదిక ఇచ్చారన్నారు. అంతేకాకుండా హత్య జరిగిన 24 గంటల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశామన్నారు. కేవలంలో ఏడాదిలోపే ప్రత్యేక న్యాయస్థానం నింధితుడికి సరైన శిక్ష విధించిందన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే మృగాలకు ఈశిక్షతో వణుకుపుట్టాలన్నారు.
దిశ చట్టం స్ఫూర్తితో కేసు దర్యాప్తు
మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ చట్టాన్ని రూపొందించి, కేంద్రానికి పంపామమన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో దిశ పొలీస్ స్టేషన్లు, ఫోరెన్సిక్ ల్యాబ్‌లు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు, అన్ని చోట్లా తగిన సిబ్బందిని కూడా నియమించామన్నారు. ఆడపిల్లలకు పూర్తి రక్షణ కల్పించే విధంగా ఈచర్యలన్నీ సీఎం వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్నారన్నారు.
ఒక దిశ యాప్ ద్వారానే ఆపద సమయంలో దాదాపు 900 మంది అమ్మాయిలను రక్షించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.24 కోట్ల మంది దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారన్నారు. రమ్య కేసు పూర్తిగా దిశ చట్టం స్ఫూర్తితోనే జరిగిందన్నారు. ఈ తీర్పు ఇప్పుడు దిశ చట్టం అవసరాన్ని మరింత గుర్తు చేస్తోందన్నారు.
గతంలో దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో, సుదీర్ఘంగా ఏడేళ్ల పాటు విచారణ తర్వాత కానీ నిందితుడికి శిక్ష పడలేదన్నారు. కానీ ఇక్కడ దిశ చట్టం స్పూర్తితో ఫాస్ట్‌ట్రాక్ కోర్డులో చాలా వేగంగా విచారణ పూర్తయిందన్నారు. కేవలం 8 గంటల్లోనే హంతకుడికి శిక్ష పడిందన్నారు.
రమ్య కుటుంబాన్ని అండగా సీఎం
ఇదేస్ఫూర్తితో ఇక ముందు కూడా కేసుల విచారణ జరుగుతోందన్నారు. రమ్యకుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుందని హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. వారికి రూ.1.60 కోట్లతో భూమి(దాదాపు ఐదెకరాలు) కొని ఇవ్వడంతో పాటు, రూ.10 లక్షల ఇచ్చామని తెలిపారు. అంతేకాకుండా రమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చి సీఎం వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నలా అండగా నిలిచారన్నారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సుభద్ర, సీపీ సీహెచ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా డ్రగ్స్ ప్రభావం మన రాష్ట్రంలో లేదని హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. ముందస్తుగా డ్రగ్స్ మూలాలను తెలుసుకునేందుకు పోలీసులంతా నిఘా పెడుతున్నారు. గంజాయి సాగు లేకుండా ఎస్‌ఈబీ పోలీసులు ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నారు. గంజాయి సాగు చేసే గిరిజన ప్రజలు ప్రభుత్వం ఇప్పటికే ఆల్ట్రర్‌నేటివ్ పంటలను పండించేందుకు ప్రోత్సాహం అందిస్తుంది. పోలీసులకు వారంతపు సెలవులు సిబ్బంది ఉన్నచోట అమలు చేస్తున్నాం. సిబ్బంది కొరత ఉన్న దగ్గర కొంత సమస్యగా ఉంది. త్వరలో స్టాఫ్ కొరత లేకుండా నియమాకాలు చేస్తామన్నారు.
ఘన స్వాగతం
అంతకుముందు ఎయిర్‌పోర్టులో హోంమంత్రి తానేటి వనితకు ఘనస్వాగతం లభించింది. పోలీస్, రెవెన్యూ అధికారులు, వైఎస్సార్ సీపీ నగర మహిళా నాయకురాలు పేడాడ రమణి కుమారి, డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్, రజక కార్పొరేషన్ డైరెక్టర్ యువశ్రీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చుక్క వరలక్ష్మి తదితరులు ఆమెకు స్వాగతం పలికారు.
(చదవండి: దివ్యాంగురాలిని పెళ్లాడిన యువకుడు)
Comments
Please login to add a commentAdd a comment