Ramya case
-
రోజుల్లోనే దర్యాప్తు.. నెలల్లోనే శిక్షలు
సాక్షి, అమరావతి: మహిళలపై నేరాల కేసుల్లో పోలీసుశాఖ దూకుడు నేరస్తులను బెంబేలెత్తిస్తోంది. నేరం చేసినా ఏం ఫర్వాలేదు.. విచారణ ఏళ్లపాటు సాగుతుందిలే అనే నేరస్తుల ధీమాకు కాలం చెల్లింది. రోజుల్లోనే దర్యాప్తు పూర్తిచేసి నెలల్లోనే విచారణ ప్రక్రియ ముగించి కోర్టుల ద్వారా శిక్షలు ఖరారు చేస్తుండటం నేరస్తులను హడలెత్తిస్తోంది. ఇటీవల గుంటూరు జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య హత్యకేసులో దోషికి 257 రోజుల్లోనే ఉరిశిక్ష పడగా.. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విదేశీ మహిళపై అత్యాచారయత్నం కేసులో 13 రోజుల్లోనే దర్యాప్తు పూర్తిచేసి 57 రోజుల్లోనే శిక్ష విధించారు. మహిళలపై నేరాల కేసులను ఏమాత్రం ఉపేక్షించవద్దని, దోషులకు సత్వరం శిక్షలు పడేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ పోలీసు శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో దోషులకు శిక్షలుపడేలా పోలీసు శాఖ జిల్లాల వారీగా కార్యాచరణను అమలు చేస్తోంది. దేశంలోనే రికార్డు వేగంతో శిక్ష ఖరారు నెల్లూరు జిల్లాలో లిథువేనియాకు చెందిన మహిళపై అత్యాచారయత్నం కేసులో దోషులకు దేశంలోనే రికార్డు వేగంతో శిక్షలు విధించారు. బాధితురాలు విదేశీ మహిళ కావడంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆమె తమ దేశానికి వెళ్లాల్సి ఉంది. ఆమె స్వదేశానికి వెళ్లిపోతే ఇక్కడ దర్యాప్తు పూర్తిస్థాయిలో నిర్వహించలేమని, విచారణ ప్రక్రియ దీర్ఘకాలం కొనసాగితే నిందితులకు అనుకూలంగా మారవచ్చని పోలీసులు గుర్తించారు. దీంతో అత్యంత వేగంగా దర్యాప్తు కొనసాగించారు. ► తనపై జరిగిన అత్యాచారయత్నంపై మార్చి 8న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. 8 గంటల్లోనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసును దిశ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ► ఏడురోజుల్లోనే అంటే మార్చి 16న కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ► అనంతరం ఆరు రోజుల్లోనే విచారణ ప్రక్రియ పూర్తిచేశారు. 21 మంది సాక్షులను మార్చి 29 నుంచి ఏప్రిల్ 1లోగా రోజుకు ఏడుగురు చొప్పున విచారించారు. ఏప్రిల్ 4న సాక్ష్యాల పరిశీలన పూర్తి చేశారు. ► తరువాత రెండురోజుల్లోనే అంటే ఏప్రిల్ 6, 7 తేదీల్లో ఇరువైపుల వాదనలు పూర్తయ్యాయి. ► తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం మే 5న తీర్పు వెలువరించింది. మొత్తంమీద ఘటన జరిగిన 57 రోజుల్లోనే దోషులకు శిక్షలు విధించడం ద్వారా దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది. జిల్లాల వారీగా కార్యాచరణ మహిళలపై దాడులకు పాల్పడే కేసుల్లో దోషులకు సత్వరం శిక్షలు విధించేలా చేయడం కోసం పోలీసు శాఖ జిల్లాల వారీగా కార్యాచరణ చేపట్టింది. జిల్లాలో సున్నితమైన 25 కేసులను ఎంపికచేసి వాటి దర్యాప్తు, విచారణపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. సమగ్ర ఆధారాల సేకరణ, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా సాక్షుల విచారణ, సమగ్రంగా వాదనలు వినిపించి నేరనిరూపణ జరిగేలా చొరవ చూపుతున్నారు. నేర నిరూపణకు అవసరమైన మౌలిక వసతులను ప్రభుత్వం ఇప్పటికే పటిష్టపరచడంతో దర్యాప్తు ప్రక్రియ వేగవంతం చేసేందుకు ఉపకరిస్తోంది. దిశ పోలీసు స్టేషన్లు, ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటు, దిశ కేసుల దర్యాప్తునకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం, మహిళలపై దాడుల కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు తదితర చర్యలతో దర్యాప్తు, న్యాయవిచారణ వ్యవస్థ బలోపేతమయ్యాయి. పోలీసు, న్యాయశాఖల సమన్వయంతో దోషులను గుర్తించి సత్వరం శిక్షలు విధించడం సాధ్యపడుతోంది. అందుకు తాజా ఉదాహరణలు.. ► హిందూపురంలో ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో 34 రోజుల్లోనే దర్యాప్తు, న్యాయవిచారణను పూర్తిచేశారు. దోషికి న్యాయస్థానం పదేళ్ల జైలుశిక్ష విధించింది. ► రాజమహేంద్రవరంలో ఒక అత్యాచారం కేసులో కూడా అత్యంత వేగంగా దర్యాప్తు చేసి న్యాయవిచారణ ప్రక్రియ ముగించడంతో దోషికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది. ► గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థిని రమ్య హత్యకేసును కూడా అత్యంత వేగంతో దర్యాప్తు చేసి దోషి శశికృష్ణకు 257 రోజుల్లోనే న్యాయస్థానం ద్వారా ఉరిశిక్ష విధించేలా చేశారు. 2021 ఆగస్టు 15న రమ్య హత్యకు గురికాగా.. కేవలం 10 గంటల్లోనే నిందితుడు శశికృష్ణను అరెస్టు చేశారు. ఫోరెన్సిక్, డీఎన్ఏ పరీక్షలను 48 గంటల్లోనే పూర్తిచేసి నివేదికలు తెప్పించారు. వారం రోజుల్లోనే చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్రమం తప్పకుండా విచారణకు హాజరై వాదనలు వినిపించడంతో ఘటన జరిగిన 257 రోజుల్లోనే న్యాయస్థానం హంతకుడికి ఉరిశిక్ష విధించింది. నేరస్తులకు ఇదే హెచ్చరిక మహిళలపై నేరాల కేసుల దర్యాప్తు, విచారణను రికార్డు వేగంతో పూర్తిచేస్తున్నాం. శాస్త్రీయ ఆధారాలతో నేరాన్ని నిరూపించి సత్వర శిక్షలు విధిస్తుండటం నేరస్తులకు హెచ్చరిక వంటిది. నేరాలకు పాల్పడితే తప్పించుకోవచ్చనో, విచారణ పేరిట కాలయాపన చేయవచ్చనుకునే పరిస్థితులు లేవు. మహిళలపై నేరాలకు పాల్పడితే కచ్చితంగా శిక్ష పడుతుందని నిరూపిస్తున్నాం. – కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ ఏపీ పోలీసులకు కృతజ్ఞతలు తనపై అత్యాచారయత్నం కేసును సత్వరం విచారించి దోషులకు శిక్షలు పడేలా చేసిన రాష్ట్ర పోలీసులకు లిథువేనియా మహిళ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసులో పోలీసుల స్పందనను ప్రశంసిస్తూ ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. – లిథువేనియా మహిళ -
ఉన్మాదికి ఉరి.. సరైన తీర్పు
వారంతా లోకం తెలియని పసి పిల్లలు. నైర్మల్యానికి ప్రతీకలు. అందరిలా వయసుతోపాటు వచ్చే శారీరక మార్పులే తమపై జరుగుతున్న అరాచకాలకు కారణమని వాళ్లకు తెలియదు. ఆలోచించేంత లోకజ్ఞానం కూడా లేదు. కానీ కంటికి రెప్పలా కాపాడుకునే తమ బిడ్డలపై కసాయిల చూపులు పడుతున్నాయి. లైంగిక దాడులు పెరుగుతున్నాయి. తమ కంటిపాపలను పాపాలభైరవులు గాయపరుస్తున్నారు. కళ్లు మూసుకుపోయి కామవాంఛ తీర్చుకుంటున్నారు. గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువడిన రోజే విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మూడు లైంగిక దాడి కేసులు నమోదయ్యాయి. పీఎంపాలెంలో టీడీపీ నేత నరేంద్ర బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లా కుమ్మరాపల్లి గ్రామంలో బాలికపై ఇదే గ్రామానికి చెందిన వృద్ధుడు శారీరక వేధింపులకు పాల్పడి అసభ్యకరంగా ప్రవర్తించడంపై పోక్సో కేసు నమోదు చేశారు. మరో ఘటనలో.. తనకు కాబోయే భార్య (మైనర్)ను గర్భవతిని చేసి మొహం చాటేశాడో ప్రబుద్ధుడు. అతనిపై కూడా పెందుర్తి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇలా అభం శుభం తెలియని పసిమనసులను గాయం చేస్తున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కామాంధులకు ఉరే సరైన శిక్ష అని బాధితులు స్పష్టం చేస్తున్నారు. సాక్షి విశాఖపట్నం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష పడడం చారిత్రకమైన తీర్పు అని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్డు తీర్పును స్వాగతిస్తున్నామని...ఈ హత్య కేసులో పోలీసుల పనితీరు బావుందని పేర్కొన్నారు. శుక్రవారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గతేడాది ఆగస్టు 15వ తేదీన గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్యని కత్తితో పొడిచి అతికిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈకేసులో పోలీసులు కేవలం హత్య జరిగిన 10 గంటల వ్యవధిలోనే నిందితుడ్ని అరెస్ట్ చేశారన్నారు. సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డ్ అయ్యాయని, వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపితే కేవలం రెండు రోజుల్లోనే నివేదిక ఇచ్చారన్నారు. అంతేకాకుండా హత్య జరిగిన 24 గంటల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశామన్నారు. కేవలంలో ఏడాదిలోపే ప్రత్యేక న్యాయస్థానం నింధితుడికి సరైన శిక్ష విధించిందన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే మృగాలకు ఈశిక్షతో వణుకుపుట్టాలన్నారు. దిశ చట్టం స్ఫూర్తితో కేసు దర్యాప్తు మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ చట్టాన్ని రూపొందించి, కేంద్రానికి పంపామమన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో దిశ పొలీస్ స్టేషన్లు, ఫోరెన్సిక్ ల్యాబ్‌లు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు, అన్ని చోట్లా తగిన సిబ్బందిని కూడా నియమించామన్నారు. ఆడపిల్లలకు పూర్తి రక్షణ కల్పించే విధంగా ఈచర్యలన్నీ సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్నారన్నారు. ఒక దిశ యాప్ ద్వారానే ఆపద సమయంలో దాదాపు 900 మంది అమ్మాయిలను రక్షించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.24 కోట్ల మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. రమ్య కేసు పూర్తిగా దిశ చట్టం స్ఫూర్తితోనే జరిగిందన్నారు. ఈ తీర్పు ఇప్పుడు దిశ చట్టం అవసరాన్ని మరింత గుర్తు చేస్తోందన్నారు. గతంలో దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో, సుదీర్ఘంగా ఏడేళ్ల పాటు విచారణ తర్వాత కానీ నిందితుడికి శిక్ష పడలేదన్నారు. కానీ ఇక్కడ దిశ చట్టం స్పూర్తితో ఫాస్ట్‌ట్రాక్ కోర్డులో చాలా వేగంగా విచారణ పూర్తయిందన్నారు. కేవలం 8 గంటల్లోనే హంతకుడికి శిక్ష పడిందన్నారు. రమ్య కుటుంబాన్ని అండగా సీఎం ఇదేస్ఫూర్తితో ఇక ముందు కూడా కేసుల విచారణ జరుగుతోందన్నారు. రమ్యకుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుందని హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. వారికి రూ.1.60 కోట్లతో భూమి(దాదాపు ఐదెకరాలు) కొని ఇవ్వడంతో పాటు, రూ.10 లక్షల ఇచ్చామని తెలిపారు. అంతేకాకుండా రమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చి సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి అన్నలా అండగా నిలిచారన్నారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర, సీపీ సీహెచ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా డ్రగ్స్ ప్రభావం మన రాష్ట్రంలో లేదని హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. ముందస్తుగా డ్రగ్స్ మూలాలను తెలుసుకునేందుకు పోలీసులంతా నిఘా పెడుతున్నారు. గంజాయి సాగు లేకుండా ఎస్ఈబీ పోలీసులు ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నారు. గంజాయి సాగు చేసే గిరిజన ప్రజలు ప్రభుత్వం ఇప్పటికే ఆల్ట్రర్నేటివ్ పంటలను పండించేందుకు ప్రోత్సాహం అందిస్తుంది. పోలీసులకు వారంతపు సెలవులు సిబ్బంది ఉన్నచోట అమలు చేస్తున్నాం. సిబ్బంది కొరత ఉన్న దగ్గర కొంత సమస్యగా ఉంది. త్వరలో స్టాఫ్ కొరత లేకుండా నియమాకాలు చేస్తామన్నారు. ఘన స్వాగతం అంతకుముందు ఎయిర్‌పోర్టులో హోంమంత్రి తానేటి వనితకు ఘనస్వాగతం లభించింది. పోలీస్, రెవెన్యూ అధికారులు, వైఎస్సార్ సీపీ నగర మహిళా నాయకురాలు పేడాడ రమణి కుమారి, డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్, రజక కార్పొరేషన్ డైరెక్టర్ యువశ్రీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చుక్క వరలక్ష్మి తదితరులు ఆమెకు స్వాగతం పలికారు. (చదవండి: దివ్యాంగురాలిని పెళ్లాడిన యువకుడు) -
రమ్య హత్య కేసులో సంచలన తీర్పు.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య హత్య కేసులో గుంటూరు కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘దిశ’ స్ఫూర్తితో ఈ కేసు దర్యాప్తులో సమర్థవంతంగా వ్యవహరించిన పోలీసులను, ప్రాసిక్యూషన్ న్యాయవాదిని ఆయన అభినందించారు. మహిళల రక్షణ, భద్రత పట్ల ప్రభుత్వ సంకల్పాన్ని ఈ కేసు చాటి చెప్పిందన్నారు. చదవండి: బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు మహిళలు, యువతులు, బాలికలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఈ తీర్పు గట్టి సందేశాన్ని పంపిందని వ్యాఖ్యానించారు. నేరాల నిరోధంలో, దురదృష్టవశాత్తూ జరిగే నేరాల దర్యాప్తులో పోలీసులు ఇదే స్ఫూర్తితో పని చేసి మహిళల భద్రత, రక్షణకు పెద్దపీట వేయాలన్నారు. ఈ తరహా కేసుల సత్వర పరిష్కారం కోసం ఇదే చిత్తశుద్ధితో పనిచేసి, దోషులకు కఠినంగా శిక్షలు పడేలా కృషి చేయాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన వెలువరించింది. కాగా, ఇదే విషయమై పోలీసు శాఖకు అభినందనలు అంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు. చదవండి: రమ్య హత్య కేసులో సంచలన తీర్పు: కుటుంబ సభ్యులు ఏమన్నారంటే.. విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నాను. ఈ కేసు విషయంలో వేగంగా దర్యాప్తు పూర్తిచేసి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ శాఖకు అభినందనలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2022 -
ఏపీ తక్షణ స్పందన అందరికీ ఆదర్శం
సాక్షి, అమరావతి: ప్రేమోన్మాది చేతిలో పది రోజుల క్రితం గుంటూరులో ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య దారుణ హత్యకు గురైన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించిన తీరు అభినందనీయమని జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దార్ పేర్కొన్నారు. ఎస్సీ విద్యార్థిని హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరుకు నూటికి 200 మార్కులు వేయవచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీలు ముఖ్యంగా మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. రమ్య హత్యోదంతం ఘటన అనంతరం ఏపీ ప్రభుత్వం వేగంగా వ్యవహరించిన తీరును దేశమంతా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర కేసుల్లోనూ ఇలాగే స్పందించాలని కమిషన్ కోరుకుంటోందని తెలిపారు. ఘటన పూర్వాపరాలను పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ బృందం మంగళవారం గుంటూరు చేరుకుని బాధిత కుటుంబాన్ని కలుసుకుని పరామర్శించి వివరాలు సేకరించింది. వెలగపూడిలోని సచివాలయం మొదటి బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులతో సమావేశం అనంతరం కమిషన్ సభ్యులు అంజుబాలా, సుభాష్పార్థిలతో కలసి అరుణ్ హల్దార్ మీడియాతో మాట్లాడారు. అత్యాచార నిరోధక చట్టాన్ని వేగంగా అమలు చేయడం, నిందితుడిని వెంటనే అరెస్టు చేయడం, చార్జ్‌షీట్ వేగంగా ఫైల్ చేయడం, పరిహారాన్ని వెంటనే చెల్లించడం ద్వారా ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. శభాష్ పోలీస్.. అవార్డులకు సిఫార్సు డీఐజీ నేతృత్వంలో గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలతో పాటు ప్రభుత్వ యంత్రాంగం పనితీరు ఎంతో బాగుందని అరుణ్ హల్దార్ అభినందించారు. ఈ కేసును వేగవంతంగా పరిష్కరించేలా కృషి చేసిన అధికారులకు అవార్డులు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని చెప్పారు. ఎస్సీల వినతులు సత్వర పరిష్కారం కోసం జాతీయ కమిషన్ తరఫున ఒక ప్రత్యేక సెల్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, భద్రతకు ప్రత్యేక చర్యలు: సీఎస్ ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమం, భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. గుంటూరు ఘటనలో ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలిచిందని చెప్పారు. బాధితురాలి తల్లికి ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నిబంధనల ప్రకారం రూ.8.25 లక్షల పరిహారాన్ని అందించడంతోపాటు అదనంగా మరో రూ.10 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధి కింద చెల్లించినట్లు తెలిపారు. ఇంటిపట్టాను కూడా మంజూరు చేసి సొంత ఇంటి నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేలా గత ఫిబ్రవరిలో రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన స్టేట్ లెవెల్ హైపవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగిందని, జిల్లాల్లో కలెక్టర్ల అధ్యక్షతన క్రమం తప్పకుండా సమావేశాలు జరుగుతున్నాయని వివరించారు. త్వరలో ప్రత్యేకంగా వెబ్సైట్ కూడా అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు, ఆయా సంఘాల ప్రతినిధులతో సంప్రదించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు: డీజీపీ సవాంగ్ ఘటన జరిగిన వెంటనే పోలీస్ యంత్రాంగం యుధ్ధ ప్రాతిపదికన దర్యాప్తు చేపట్టి ఆధారాలు సేకరించి చార్జ్‌షీట్ ఫైల్ చేసిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మహిళల భద్రత కోసం దిశ యాప్‌ను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేయడంతో రాష్ట్రానికి ఐదు జాతీయ అవార్డులు లభించాయని చెప్పారు. పోలీస్ సేవా యాప్ ద్వారా గత 10 నెలల వ్యవధిలో 7 లక్షల మందికిపైగా ఎఫ్ఐఆర్లను డౌన్లోడ్ చేసుకున్నట్లు వెల్లడించారు. పోలీస్ శాఖ ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న నేపథ్యంలోగత ఏడాదిన్నర కాలంలో 34 వేల కేసులు రిజిస్టర్ అయ్యాయని, వీటిలో 52 శాతం ఫిర్యాదులు మహిళలకు సంబంధించినవేనని తెలిపారు. సమావేశంలో డీఐజీలు రాజకుమారి, పాలరాజు, గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలు పాల్గొన్నారు. దిశ యాప్‌తో దేశానికే ఆదర్శంగా నిలిచారు మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ఎస్సీ కమిషన్ సభ్యులు అంజుబాలా ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి దిశ యాప్ ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. వీటిని సమర్థంగా నిర్వహిస్తూ ఏపీ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కమిషన్ బృందం వెంట సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ హర్షవర్థన్ తదితరులున్నారు. మేం అడగకుండానే ప్రభుత్వం ఆదుకుంది ఇటీవల గుంటూరులో ఇంజనీరింగ్ విద్యార్థిని ఎన్.రమ్య దారుణ హత్యకు గురైన ఘటనలో నిందితుడికి కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబం కూడా అదే కోరుతోందని జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దార్ పేర్కొన్నారు. తాము వచ్చి అడగక ముందే బాధిత కుటుంబాన్ని వెంటనే ఆదుకుని చట్టపరంగా రావాల్సిన అన్ని సదుపాయాలను అందచేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బాధిత కుటుంబం పట్ల ఏపీ ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందించిందన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ బృందం మంగళవారం గుంటూరులో పర్యటించింది. బాధితురాలు రమ్య ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించింది. సంఘటనా స్థలానికి వెళ్లి హత్య జరిగిన తీరుపై వివరాలు సేకరించింది. అనంతరం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో వివిధ పక్షాల నుంచి వినతిపత్రాలు స్వీకరించింది. ఈ సందర్భంగా హల్దార్ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి చార్జిషీట్ దాఖలు చేశారని చెప్పారు. కేంద్ర సాయం అందించేలా చర్యలు.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బాధితురాలి కుటుంబానికి సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హల్దార్ తెలిపారు. అధైర్యం చెందవద్దని, బాధితులకు ఎస్సీ కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎస్సీల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ కమిషన్ రక్షణ కల్పిస్తుందన్నారు. వివిధ పక్షాలు అందచేసిన వినతిపత్రాలను పరిశీలించి తగిన న్యాయం చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, విడదల రజని, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్‌రావు, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మద్య విమోచన కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డితోపాటు పలు పార్టీల నేతలు కమిషన్‌ను కలిశారు. -
ఏపీ ప్రభుత్వ పనితీరును అభినందిస్తున్నాం: జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ ఛైర్మన్
సాక్షి, గుంటూరు: ఇటీవల గుంటూరు నగరంలో జరిగిన బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్ స్పాట్ విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఈ బృందం మంగళవారం గుంటూరులో పర్యటించింది. ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ ఛైర్మన్ అరుణ్ హల్డర్ మాట్లాడుతూ.. ఈ ఘటన చాలా బాధ కలిగించిందని అన్నారు. అతి తక్కువ సమయంలోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు. నిందితుడిపై త్వరగా ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని కోరామని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరును అరుణ్ హల్డర్ ప్రశంసించారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం కూడా ఏపీ ప్రభుత్వం వెంటనే అందించిందని ఆయన గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వ దృక్పథం చాలా పాజిటివ్‌గా ఉందని ఆయన వివరించారు. దేశం మొత్తం ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును పరిగణనలోకి తీసుకోవాలని వైస్ ఛైర్మన్ అన్నారు. గుంటూరు రూరల్, అర్బన్ పోలీస్ అధికారులు బాగా పని చేశారు. వారందరికీ అవార్డులు ఇవ్వాలని సిఫార్సు చేస్తామని వైస్ ఛైర్మన్ అరుణ్ హల్డర్ తెలిపారు. చదవండి: AFG Vs Pak: అఫ్గన్- పాకిస్తాన్ వన్డే సిరీస్ నిరవధిక వాయిదా -
ప్రేమించాలని వేధించి.. కాదంటే చంపేశాడు
నగరంపాలెం (గుంటూరు ఈస్ట్): మెకానిక్‌గా పనిచేసిన శశికృష్ణ తనను ప్రేమించాలని నల్లపు రమ్య వెంటపడ్డాడని, ఆమె తిరస్కరించడంతో హత్యచేశాడని ఏపీలోని గుంటూరు రేంజ్ ఇన్చార్జి డీఐజీ రాజశేఖర్‌బాబు వెల్లడించారు. ఆ ప్రేమోన్మాదిని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశామన్నారు. ఆదివారం ఉదయం గుంటూరులో నడిరోడ్డుపైనే ఈ హత్య జరిగిన విషయం తెలిసిందే. పోలీసులు సోమవారం ఈ ఘటన వివరాలు వెల్లడించారు. హంతకుడు కుంచాల శశికృష్ణతో రమ్యకు ఆరునెలల కిందట ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయమైందని తెలిపారు. గతంలో మెకానిక్‌గా పనిచేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న శశికృష్ణ.. కొద్దిరోజులుగా తనను ప్రేమించాలని రమ్య వెంటపడ్డాడని, దీంతో ఆమె మాట్లాడటం మానేయడంతో కక్ష పెంచుకున్నాడని వివరించారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఆమె వెంటపడ్డాడని, ఆమె అభ్యంతరం చెప్పడంతో.. తన వెంట తెచ్చుకున్న కత్తితో పొట్ట, మెడపై ఆరుచోట్ల పొడిచాడని తెలిపారు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న రమ్యను ఆమె అక్క మౌనిక గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లిందని.. అప్పటికే రమ్య మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారని వెల్లడించారు. మృతురాలి తండ్రి వెంకటరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఆదివారం రాత్రి 8 గంటలకు నరసరావుపేట పరిధిలోని ములకలూరు గ్రామపొలాల్లో ఉన్న శశికృష్ణను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. హత్యకు వాడిన కత్తిని స్వాధీనం చేసుకుని, నిందితుడిని కోర్టులో హాజరుపరిచామని వివరించారు. రమ్య హత్య కేసుకు సంబంధించి పోలీసులపై పలు రాజకీయపక్షాలు చేస్తున్న ఆరోపణలు సరికాదని స్పష్టం చేశారు. రమ్య కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు అందజేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళల భద్రత విషయంలో ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. ప్రేమోన్మాది దాడిలో మరణించిన రమ్య కుటుంబానికి ఆమె రూ.10లక్షల సాయం చెక్కును సోమవారం అందజేశారు. రమ్య కుటుంబానికి అండగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ సూచించారని చెప్పారు. టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు. -
రమ్య కేసులో శ్రావిల్‌కు చుక్కెదురు
బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: మద్యం సేవించి నిర్లక్ష్యంగా కారు నడిపి చిన్నారి రమ్యతో పాటు ముగ్గురి మృతికి కారణమైన విద్యార్థి ఆర్.శ్రావిల్‌కు హైకోర్టులోనూ చుక్కెదురైంది. బెయిల్ కోసం అతను దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ తీర్పు వెలువరించారు. బెయిల్ కోసం శ్రావిల్ రెండు సందర్భాల్లో పిటిషన్లు దాఖలు చేయగా, నాంపల్లి కోర్టు వాటిని కొట్టేసింది. దీంతో అతను హైకోర్టులో ఇటీవల బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ విచారణ జరిపారు. 304 పార్ట్ 2 కింద కేసు మార్చడం సబబే... పిటిషనర్ తరఫు న్యాయవాది సురేందర్‌రావు వాదనలు వినిపిస్తూ... పోలీసులు నమోదు చేసిన కేసులన్నీ బెయిలబుల్ నేరాలేనన్నారు. మొదట నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు 304ఎ కింద పోలీసులు కేసు నమోదు చేసి ఆ తరువాత దానిని 304 పార్ట్ 2 కింద మార్చారన్నారు. ఇది పిటిషనర్లకు వర్తించదన్నారు. ఈ వాదనలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్‌రెడ్డి, అదనపు పీపీ రామిరెడ్డి తోసిపుచ్చారు. శ్రావిల్‌వల్ల ముగ్గురు మరణించారని, ఘటన తీవ్రతను దృష్టిలో పెట్టుకుని 304 పార్ట్ 2 కింద కేసు పెట్టారన్నారు. పిటిషనర్, అతని మిత్రులు మద్యం తాగినట్లు సాక్ష్యాలున్నాయన్నారు. అంతేకాక పిటిషనర్‌కు తగిన లెసైన్స్ కూడా లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మంగళవారం తీర్పు వెలువరించారు. అధిక వేగంతో నిర్లక్ష్యంగా, అది కూడా మద్యం మత్తులో కారు నడిపి వేరొకరి మృతికి కారణమైనప్పుడు అతనిపై సెక్షన్ 304 పార్ట్ 2 కింద కేసు పెట్టవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. కాబట్టి పిటిషనర్‌పై 304 పార్ట్ 2 కింద కేసు పెట్టడం చెల్లదన్న వాదన సరికాదని తేల్చి చెప్పారు. 304ఎను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలన్న వాదనలను ఈ దశలో ఆమోదించలేమన్నారు. దర్యాప్తు ఇంకా పెండింగ్‌లో ఉం దని, అందువల్ల ఈ దశలో బెయిల్ మం జూరు చేయడం సాధ్యం కాదంటూ, శ్రావిల్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు పేర్కొన్నారు.