సాక్షి, అమరావతి: మహిళలపై నేరాల కేసుల్లో పోలీసుశాఖ దూకుడు నేరస్తులను బెంబేలెత్తిస్తోంది. నేరం చేసినా ఏం ఫర్వాలేదు.. విచారణ ఏళ్లపాటు సాగుతుందిలే అనే నేరస్తుల ధీమాకు కాలం చెల్లింది. రోజుల్లోనే దర్యాప్తు పూర్తిచేసి నెలల్లోనే విచారణ ప్రక్రియ ముగించి కోర్టుల ద్వారా శిక్షలు ఖరారు చేస్తుండటం నేరస్తులను హడలెత్తిస్తోంది. ఇటీవల గుంటూరు జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య హత్యకేసులో దోషికి 257 రోజుల్లోనే ఉరిశిక్ష పడగా.. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విదేశీ మహిళపై అత్యాచారయత్నం కేసులో 13 రోజుల్లోనే దర్యాప్తు పూర్తిచేసి 57 రోజుల్లోనే శిక్ష విధించారు. మహిళలపై నేరాల కేసులను ఏమాత్రం ఉపేక్షించవద్దని, దోషులకు సత్వరం శిక్షలు పడేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ పోలీసు శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో దోషులకు శిక్షలుపడేలా పోలీసు శాఖ జిల్లాల వారీగా కార్యాచరణను అమలు చేస్తోంది.
దేశంలోనే రికార్డు వేగంతో శిక్ష ఖరారు
నెల్లూరు జిల్లాలో లిథువేనియాకు చెందిన మహిళపై అత్యాచారయత్నం కేసులో దోషులకు దేశంలోనే రికార్డు వేగంతో శిక్షలు విధించారు. బాధితురాలు విదేశీ మహిళ కావడంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆమె తమ దేశానికి వెళ్లాల్సి ఉంది. ఆమె స్వదేశానికి వెళ్లిపోతే ఇక్కడ దర్యాప్తు పూర్తిస్థాయిలో నిర్వహించలేమని, విచారణ ప్రక్రియ దీర్ఘకాలం కొనసాగితే నిందితులకు అనుకూలంగా మారవచ్చని పోలీసులు గుర్తించారు. దీంతో అత్యంత వేగంగా దర్యాప్తు కొనసాగించారు.
► తనపై జరిగిన అత్యాచారయత్నంపై మార్చి 8న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. 8 గంటల్లోనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసును దిశ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
► ఏడురోజుల్లోనే అంటే మార్చి 16న కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
► అనంతరం ఆరు రోజుల్లోనే విచారణ ప్రక్రియ పూర్తిచేశారు. 21 మంది సాక్షులను మార్చి 29 నుంచి ఏప్రిల్ 1లోగా రోజుకు ఏడుగురు చొప్పున విచారించారు. ఏప్రిల్ 4న సాక్ష్యాల పరిశీలన పూర్తి చేశారు.
► తరువాత రెండురోజుల్లోనే అంటే ఏప్రిల్ 6, 7 తేదీల్లో ఇరువైపుల వాదనలు పూర్తయ్యాయి.
► తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం మే 5న తీర్పు వెలువరించింది. మొత్తంమీద ఘటన జరిగిన 57 రోజుల్లోనే దోషులకు శిక్షలు విధించడం ద్వారా దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది.
జిల్లాల వారీగా కార్యాచరణ
మహిళలపై దాడులకు పాల్పడే కేసుల్లో దోషులకు సత్వరం శిక్షలు విధించేలా చేయడం కోసం పోలీసు శాఖ జిల్లాల వారీగా కార్యాచరణ చేపట్టింది. జిల్లాలో సున్నితమైన 25 కేసులను ఎంపికచేసి వాటి దర్యాప్తు, విచారణపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. సమగ్ర ఆధారాల సేకరణ, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా సాక్షుల విచారణ, సమగ్రంగా వాదనలు వినిపించి నేరనిరూపణ జరిగేలా చొరవ చూపుతున్నారు.
నేర నిరూపణకు అవసరమైన మౌలిక వసతులను ప్రభుత్వం ఇప్పటికే పటిష్టపరచడంతో దర్యాప్తు ప్రక్రియ వేగవంతం చేసేందుకు ఉపకరిస్తోంది. దిశ పోలీసు స్టేషన్లు, ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటు, దిశ కేసుల దర్యాప్తునకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం, మహిళలపై దాడుల కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు తదితర చర్యలతో దర్యాప్తు, న్యాయవిచారణ వ్యవస్థ బలోపేతమయ్యాయి. పోలీసు, న్యాయశాఖల సమన్వయంతో దోషులను గుర్తించి సత్వరం శిక్షలు విధించడం సాధ్యపడుతోంది. అందుకు తాజా ఉదాహరణలు..
► హిందూపురంలో ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో 34 రోజుల్లోనే దర్యాప్తు, న్యాయవిచారణను పూర్తిచేశారు. దోషికి న్యాయస్థానం పదేళ్ల జైలుశిక్ష విధించింది.
► రాజమహేంద్రవరంలో ఒక అత్యాచారం కేసులో కూడా అత్యంత వేగంగా దర్యాప్తు చేసి న్యాయవిచారణ ప్రక్రియ ముగించడంతో దోషికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది.
► గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థిని రమ్య హత్యకేసును కూడా అత్యంత వేగంతో దర్యాప్తు చేసి దోషి శశికృష్ణకు 257 రోజుల్లోనే న్యాయస్థానం ద్వారా ఉరిశిక్ష విధించేలా చేశారు. 2021 ఆగస్టు 15న రమ్య హత్యకు గురికాగా.. కేవలం 10 గంటల్లోనే నిందితుడు శశికృష్ణను అరెస్టు చేశారు. ఫోరెన్సిక్, డీఎన్‌ఏ పరీక్షలను 48 గంటల్లోనే పూర్తిచేసి నివేదికలు తెప్పించారు. వారం రోజుల్లోనే చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్రమం తప్పకుండా విచారణకు హాజరై వాదనలు వినిపించడంతో ఘటన జరిగిన 257 రోజుల్లోనే న్యాయస్థానం హంతకుడికి ఉరిశిక్ష విధించింది.
నేరస్తులకు ఇదే హెచ్చరిక
మహిళలపై నేరాల కేసుల దర్యాప్తు, విచారణను రికార్డు వేగంతో పూర్తిచేస్తున్నాం. శాస్త్రీయ ఆధారాలతో నేరాన్ని నిరూపించి సత్వర శిక్షలు విధిస్తుండటం నేరస్తులకు హెచ్చరిక వంటిది. నేరాలకు పాల్పడితే తప్పించుకోవచ్చనో, విచారణ పేరిట కాలయాపన చేయవచ్చనుకునే పరిస్థితులు లేవు. మహిళలపై నేరాలకు పాల్పడితే కచ్చితంగా శిక్ష పడుతుందని నిరూపిస్తున్నాం.
– కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ
ఏపీ పోలీసులకు కృతజ్ఞతలు
తనపై అత్యాచారయత్నం కేసును సత్వరం విచారించి దోషులకు శిక్షలు పడేలా చేసిన రాష్ట్ర పోలీసులకు లిథువేనియా మహిళ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసులో పోలీసుల స్పందనను ప్రశంసిస్తూ ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
– లిథువేనియా మహిళ
Comments
Please login to add a commentAdd a comment