సాక్షి, ఆదిలాబాద్: సమత అత్యాచారం, హత్య కేసు నిందితులను ఆదిలాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు షేక్ బాబు సహా మరో ఇద్దరు నిందితులు షేక్ శాబొద్దీన్, షేక్ ముఖ్దూమ్‌లను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ ఘటనలో 44 మంది సాక్షులతో కూడిన చార్జిషీట్‌ను అసిఫాబాద్ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి శనివారం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం నుంచి విచారణ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా రోజుకు ఐదుగురు సాక్షుల చొప్పున విచారించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా బాధితురాలు దళిత మహిళ కావడంతో అత్యాచారం, హత్య కేసులతో పాటుగా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నట్లు అభిప్రాయపడుతున్నారు.
కాగా చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ.. నవంబరు 24న కుమురం భీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో అత్యాచారం, హత్యకు గురై న విషయం తెలిసిందే. బాధితురాలిని చిత్రహింసలకు గురిచేసి అత్యంత పాశవికంగా హతమార్చిన నిందితులను అదే నెల27న పోలీసులు అరెస్టు చేశారు.
ఈ క్రమంలో బాధితురాలి పేరును ‘సమత’గా మార్చిన పోలీసులు.. నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాక.. గొంతుకోసి చంపారని కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఈ విషయం తేలిందన్నారు. అలాగే బాధితురాలి శరీరంలో నిందితుల డీఎన్‌ఏ లభించిన నివేదికను కోర్టుకు సమర్పించారు. ఇక దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ ఘటనకు మూడు రోజుల ముందు ఈ దారుణం జరిగింది. అయితే దిశ తరహాలో మొదట ప్రాధాన్యత దక్కకపోవడంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. తర్వాత ప్రభుత్వం స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిందితులు ఏ1గా షేక్‌బాబా, ఏ2 షేక్ షాబొద్దీన్, ఏ3 షేక్ ముఖ్దూమ్‌లకు ఉరిశిక్ష విధించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment