kollipara
-
నిధి రాత
-
గుప్తనిధుల వేటకు వెళ్లిన కెనరా బ్యాంక్ ఉద్యోగి మృతి
సాక్షి, ఒంగోలు: వారు ముగ్గురు స్నేహితులు. వీరికి సులువుగా డబ్బు సంపాదించుకోవాలనే ఆశ కలిగింది. గుప్తనిధుల వేటలో పడ్డారు. అందుకు అవసరమైన సామగ్రితో పాటు మంచినీరు, ఆహారం, మజ్జిగ తీసుకుని బయల్దేరారు. ఇంకే ముంది ఎవరు చెప్పారో ఏమో ముగ్గురు కలిసి తర్లుపాడు మండలం తాడివారిపల్లె సమీపంలోని వెలిగొండ అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. గత ఆదివారం రాత్రి అడవిలోకి వెళ్లిన వీరు తిరిగి వచ్చేందుకు రహదారి కనుగొనలేక ముగ్గురూ మూడు దారుల్లో వెళ్లారు. ఒకరు దాహార్తికి తట్టుకోలేక మృత్యువాత పడగా మరొకరు చెట్టు, పుట్టను పట్టుకుని రోడ్డుకెక్కారు. ఇంకొకరి కోసం పోలీసులు అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. వివరాలు.. గుంటూరు జిల్లా కొల్లిపరకు చెందిన కృష్ణనాయక్, హనుమంత నాయక్, హైదరాబాద్‌లో కెనరా బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న కట్టా శివకుమార్‌లు తాడివారిపల్లె వెలిగొండ అడవిలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఒక రాత్రంతా అడవిలోనే గడిపారు. తిరిగి రెండో రోజు కూడా కొండ నుంచి కిందకు దిగేందుకు బయల్దేరారు. వీరిలో కృష్ణానాయక్ మాత్రమే సోమవారం మధ్యాహ్నానికి తీవ్ర దాహంతో కర్నూలు–ఒంగోలు రోడ్డుకు చేరుకున్నాడు. సమీపంలోని గుడి వద్దకు వెళ్లి దాహం తీర్చుకున్నాడు. మరో ఇద్దరు అటవీ ప్రాంతాన్ని దాటలేకపోయారు. బయటకు వచ్చిన కృష్ణానాయక్ అదృశ్యమైన హనుమంతనాయక్, శివకుమార్ బంధువులకు చెప్పాడు. అటవీ ప్రాంతానికి చేరుకున్న శివకుమార్ బంధువులతో పాటు కృష్ణానాయక్ మంగళవారం, బుధవారం అదృశ్యమైన ఇద్దరి కోసం తీవ్రంగా గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో తాడివారిపల్లె పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పొదిలి సీఐ చిన్న మీరా సాహెబ్ నేతృత్వంలో 15 మంది ప్రత్యేక బలగాలు, పోలీసులు, ఫారెస్ట్ ఉద్యోగి నాగరాజు గాలించేందుకు అడవిలోకి వెళ్లారు. ఉదయం 8 నుంచి తీవ్రంగా శ్రమించగా ఒంటి గంట ప్రాంతంలో శివకుమార్ మృతదేహాన్ని గుర్తించారు. మరో వ్యక్తి కోసం ఇంకా అడవిలోనే గాలిస్తున్నారు. తాగేందుకు నీరు లేకపోవడంతోనే ఆయన మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేయసి భర్తను హత్య చేసిన ప్రియుడు
కొల్లిపర : ప్రేయసి మీద వ్యామోహంతో ఆమె భర్తను గొంతు కోసి చంపిన సంఘటన కొల్లిపర ఎస్సీ కాలనీలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...కొల్లిపరకు చెందిన నూతక్కి దీనప్రసాద్ (30)కు అమర్తలూరుకు చెందిన సౌజన్యతో 10 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. వివాహం కాకముందే సౌజన్యకు అమర్తలూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సజ్జా నాగరాజుతో వివాహేతర సంబంధం ఉంది. వివాహమైన తర్వాత కూడా ఆ సంబంధం కొనసాగుతూ ఉంది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని తలచి అతనిని అంతమొందించాలని సౌజన్య, నాగరాజు భావించారు. దీనిలో భాగంగా బుధవారం రాత్రి సౌజన్య ఇంటికి నాగరాజు వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న సౌజన్య భర్త దీనప్రసాద్ నాగరాజుతో ఘర్షణకు దిగాడు. ఇదే అదునుగా నాగరాజు కత్తితో దీనప్రసాద్‌ను గొంతుకోసి పారిపోయాడు. దీనప్రసాద్ అక్కడకక్కడే మృతి చెందాడు. సౌజన్య గురువారం ఉదయం నారాకోడూరులో ఉంటున్న అత్త నాగమ్మకు ఫోన్ చేసి మీ అబ్బాయి మద్యం మత్తులో గొంతుకోసుకుని చనిపోయాడని చెప్పింది. వెంటనే కొల్లిపర వచ్చిన ఆమె ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. తన కుమారుడిని ఎవరోచంపి ఉంటారని ఫిర్యాదులో పేర్కొం ది. దీంతో సౌజన్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా జరిగిన వాస్తవం తెలిపినట్టు సమాచారం. మరో నిందితుడు నాగరాజు పరారీలో ఉన్నాడు. సంఘటన స్ధలాన్ని తెనాలి డీఎస్పీ రమణమూర్తి, సీఐ చినమల్లయ్య, దుగ్గిరాల ఎస్ఐ మురళి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం జిల్లా వైద్యశాలకు తరలించారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. నిందితుని కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ చెప్పారు. -
కృష్ణమ్మ సాక్షిగా..
కొల్లిపర: అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను కృష్ణమ్మ సాక్షిగా గురువారం నిర్వహించారు. కృష్ణాపుష్కరాలు జరుగుతున్న నదీ పరివాహక ప్రాంతాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం చెలెళ్లు అన్నలకు రాఖీలు కట్టారు. మండల కేంద్రంలోని తిరుపతమ్మగుడికి సమీపంలో ఉన్న కృష్ణానది వద్ద పలువురు చెలెళ్లు అన్నలకు రాఖీలు కడుతూ కనిపించారు. పొట్టిదిబ్బలంకకు చెందిన ముగ్గురు చెలెళ్లు అన్నకు కృష్ణమ్మ సాక్షిగా రాఖీ కట్టారు. -
ఘాట్‌కో గండం
కొల్లిపర : పుష్కరఘాట్ల వద్ద ప్రమాదకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. పిడపర్రు లాకుల వద్ద పుష్కరఘాట్‌కు వెళ్లే అప్రోచ్‌రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ రోడ్డు నిర్మాణంలో మట్టి, ఇసుక వాడారు. అప్రోచ్ రోడ్డు పక్కనే ఉన్న రేపల్లె బ్యాంకు కెనాల్ స్లూయిస్ బాగా పల్లంగా ఉండటంతో ఇది భయపెడుతోంది. అప్రోచ్ రోడ్డు నిర్మాణం వెంట బారికేడ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. మున్నంగి వద్ద అప్రోచ్ రోడ్డు మున్నంగి పుష్కర ఘాట్‌కు వెళ్లే అప్రోచ్‌రోడ్డు ప్రమాదకరంగా ఉంది. రోడ్డు నిర్మాణంలో భాగంగా మట్టి తవ్వారు. ఎక్కువ లోతుగా తవ్వకాలు జరపటంతో రోడ్డు వెంట పల్లంగా మారింది. ఒక వేళ పట్టుజారిందా గోతిలో పడాల్సిందే. ఇక్కడ అప్రోచ్‌రోడ్డు వెంట సైడ్ వాల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. వల్లభాపురం ఘాట్‌కు బారికేడ్లు తప్పనిసరి? భక్తులు స్నానాలు చేసే చోట తప్పనిసరిగా బారికేడ్లు ఏర్పాటు చేయాలి. వల్లభాపురం తిరుపతమ్మ గుడి వద్ద భక్తుల స్నానాల కోసం అక్కడ ఉన్న ర్యాంప్ వద్ద రెండు పుష్కర ఘాట్లను నిర్మిస్తున్నారు. ఒక ఘాట్ ర్యాంపునకు ఎదురుగా, మరో ఘాట్ ర్యాంపునకు ఎడమవైపు ఉంది. ఆ రెండింటి మధ్య ఎక్కువ ఖాళీ స్థలం ఉంది. రెండు ఘాట్ల వద్ద రెండున్నర అడుగుల మేర మాత్రమే సైడ్ వాల్స్ నిర్మిస్తున్నారు. ఇక్కడ ఖాళీ స్థలంలో భక్తులు స్నానమాచరిస్తారు. కావున బారికేడ్లు తప్పనిసరి. వల్లభాపురం శ్మశాన వాటిక వద్ద గుండం వల్లభాపురం శ్మశాన వాటిక వద్ద ఉన్న ఘాట్‌కు సమీపంలో గుండం ఉంది. అక్కడ అధికారులు నిర్దేశించిన ఘాట్ ప్రాంతంలోనే స్నానం చేయడం మంచిది. గుండం వద్దకు భక్తులు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇక్కడ కచ్చితంగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి. జారుడు బల్లగా పుష్కర ‡ఘాట్ వల్లభాపురం శ్మశాన వాటిక వద్ద ఉన్న పుష్కరఘాట్ జారుడు బల్లగా కనిపిస్తుంది. పుష్కరాల సమయంలో వర్షం వస్తే భక్తులకు ఇబ్బందే. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే భద్రతా పరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సీతానగరంలో.. సీతానగరం(తాడేపల్లి రూరల్): స్థానిక కృష్ణా రివర్ బెడ్లో ఉన్న రిటైనింగ్ వాల్, పుష్కరఘాట్ల వద్ద స్వాగతద్వారం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి పుష్కరఘాట్ల వరకు 800 మీటర్లపైన ఉన్న రిటైనింగ్ వాల్ ఇప్పటికే రెండుచోట్ల కూలింది. మరో నాలుగు చోట్ల కూలేందుకు సిద్ధంగా ఉంది. భారీ వర్షం కురిస్తే విజయకీలాద్రి పర్వతంపై నుంచి వచ్చే వర్షపునీరు ఈ వాల్లోకి ప్రవేశిస్తాయి. కూలడానికి సిద్ధంగా ఉన్న ఈ గోడల్లోకి నీరు చేరితే ప్రమాదమేనని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. పుష్కరఘాట్ల వద్ద గతంలో ఏర్పాటు చేసిన ఆంజనేయస్వామి స్వాగతద్వారం పూర్తిగా శిథిలావస్థకు చేరి పెచ్చులూడుతోంది. నాలుగో ఘాట్‌లో భక్తుల సేద తీర్చేందుకు గతంలో షెడ్డును ఏర్పాటు చేశారు. ఈ షెడ్డు పైకప్పు లేచి ప్రమాదభరితంగా మారింది. -
అందివస్తారనుకొంటే...కడతేరారు !
తెనాలిరూరల్/కొల్లిపర, న్యూస్‌లైన్: విద్యార్థుల ఈత సరదా మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. చేతికి అంది వస్తున్నారనుకున్న కుమారులను నది రూపంలో మృత్యువు కబళించడంతో తల్లిదండ్రులు పుత్రశోకంతో తల్లడిల్లుతున్నారు. పేద కుటుంబాలకు చెందిన బాధిత తల్లిదండ్రులు కష్ట నష్టాల కోర్చి పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. మరి కొద్ది సంవత్సరాల్లో ఉన్నత స్థితికి చేరుకుని కుటుంబాలకు అండగా నిలుస్తారని ఆశపడుతున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. కొల్లిపర-మున్నంగి గ్రామ పరిధిలో వున్న కృష్ణానది రేవులో శుక్రవారం ఈత కొట్టడానికి దిగిన విద్యార్థులు మురళీధరరెడ్డి, జస్వంత్, అవినాష్‌లు కొద్ది నిమిషాల వ్యవధిలోనే మృత్యు ఒడికి చేరడం ఆయా కుటుంబసభ్యులను, తోటి విద్యార్థులను కలచివేసింది. మృతుల్లో ఒకరైన మున్నంగి గ్రామానికి చెందిన ఔతు మురళీధరరెడ్డి(17) వ్యవసాయ కుటుంబానికి చెందిన వాడు. తండ్రి వేణు మాధవ రెడ్డి వ్యవసాయం చేస్తూ భారమైనా కుమారుడు, కుమార్తెను ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివిస్తున్నాడు. తల్లి మాధవి గృహిణి. మురళీ విజయవాడలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివి, రెండో సంవత్సరం తెనాలిలో చదువుతానంటే కాదనకుండా చేర్పించారు. మరొకరు కమ్మ అవినాష్ చౌదరి(17). తెనాలికి చెందిన ప్లంబింగ్ కార్మికుడు కమ్మ వెంకటేశ్వర్లు కుమారుడు. పెద్దవాడైన అవినాష్‌చౌదరిని తన ఆర్థికస్థితి సహకరించకున్నా ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. పదో తరగతి వరకు తెనాలిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివించి, ప్రస్తుతం హైదరాబాద్‌లోని నెట్టూరు టెక్నికల్ ట్రైనింగ్ ఫౌండేషన్‌లో ఎలక్ట్రానిక్స్ విభాగంలో శిక్షణ ఇప్పిస్తున్నాడు. అవినాష్ తల్లి సుధారాణి గృహిణి.మరో మృతుడు కొండూరు జస్వంత్ అఖిల్(17) తండ్రి వెంకటేశ్వరరావు పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. 2011 వరకు తెనాలి వన్ టౌన్ స్టేషన్లో చేసిన ఆయన ఆ తరువాత రేపల్లెకు బదిలీ అయ్యారు. కుటుంబంతో ఇక్కడి కొత్తపేటలోని పోలీస్ క్వార్టర్స్‌లో నివసిస్తూ ప్రతి రోజు డ్యూటీకి వెళ్లి వస్తుంటారు. ఆయనకు ఇరువురు కుమారుల్లో అఖిల్ పెద్దవాడు, భార్య నాగమల్లేశ్వరి గృహిణి. రెండో కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు. పాఠశాల నుంచి మంచి మిత్రులు మురళీధర్‌రెడ్డి, అఖిల్, అవినాష్ ముగ్గురూ పదోతరగతి వరకు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. అప్పటి నుంచి వారి స్నేహం కొనసాగుతోంది. ముగ్గురూ తమ ఇతర మిత్రులతో కలసి సంక్రాంతి సెలవులను ఉల్లాసంగా గడుపుతున్నారు. అఖిల్ అమ్మమ్మ ఊరు మున్నంగి కావడంతో స్నేహితులు మురళీధర్‌రెడ్డి, అవినాష్‌లు కలసి మరో ఐదుగురి మిత్రులను గ్రామానికి ఆహ్వానించారు. సాయంత్రం వరకు గ్రామ పరిసరాల్లో గడిపి, రేవులో ఈతకు దిగారు. మురళీ, జస్వంత్, అవినాష్‌ల ముందు రేవులో గుంత వుండడంతో మునిగిపోయారు. తోటి మిత్రులు బయటకు లాగేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు మృత్యువు పాలయ్యారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున తెనాలి జిల్లా వైద్యశాల మార్చురీకి తరలివచ్చారు. వైద్యశాల ఆవరణలో వారి రోదనలు మిన్నంటాయి. మృతులు ముగ్గురూ మూడు కుంటుంబాల్లోనూ ప్రథమ సంతానం కావడం గమనార్హం.