అందివస్తారనుకొంటే...కడతేరారు ! | three students died went to swimming | Sakshi
Sakshi News home page

అందివస్తారనుకొంటే...కడతేరారు !

Published Sat, Jan 18 2014 2:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM

three students died went to swimming

తెనాలిరూరల్/కొల్లిపర, న్యూస్‌లైన్: విద్యార్థుల ఈత సరదా మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. చేతికి అంది వస్తున్నారనుకున్న కుమారులను నది రూపంలో మృత్యువు కబళించడంతో తల్లిదండ్రులు పుత్రశోకంతో తల్లడిల్లుతున్నారు. పేద కుటుంబాలకు చెందిన బాధిత తల్లిదండ్రులు కష్ట నష్టాల కోర్చి పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. మరి కొద్ది సంవత్సరాల్లో ఉన్నత స్థితికి చేరుకుని కుటుంబాలకు అండగా నిలుస్తారని ఆశపడుతున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది.

 కొల్లిపర-మున్నంగి గ్రామ పరిధిలో వున్న కృష్ణానది రేవులో శుక్రవారం ఈత కొట్టడానికి దిగిన విద్యార్థులు మురళీధరరెడ్డి, జస్వంత్, అవినాష్‌లు కొద్ది నిమిషాల వ్యవధిలోనే మృత్యు ఒడికి చేరడం ఆయా కుటుంబసభ్యులను, తోటి విద్యార్థులను కలచివేసింది. మృతుల్లో ఒకరైన మున్నంగి గ్రామానికి చెందిన ఔతు మురళీధరరెడ్డి(17) వ్యవసాయ కుటుంబానికి చెందిన వాడు. తండ్రి వేణు మాధవ రెడ్డి వ్యవసాయం చేస్తూ భారమైనా కుమారుడు, కుమార్తెను ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివిస్తున్నాడు. తల్లి మాధవి గృహిణి.

 మురళీ విజయవాడలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివి, రెండో సంవత్సరం తెనాలిలో చదువుతానంటే కాదనకుండా చేర్పించారు. మరొకరు కమ్మ అవినాష్ చౌదరి(17). తెనాలికి చెందిన ప్లంబింగ్ కార్మికుడు కమ్మ వెంకటేశ్వర్లు కుమారుడు. పెద్దవాడైన అవినాష్‌చౌదరిని తన ఆర్థికస్థితి సహకరించకున్నా ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. పదో తరగతి వరకు తెనాలిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివించి, ప్రస్తుతం హైదరాబాద్‌లోని నెట్టూరు టెక్నికల్ ట్రైనింగ్ ఫౌండేషన్‌లో ఎలక్ట్రానిక్స్ విభాగంలో శిక్షణ ఇప్పిస్తున్నాడు.

అవినాష్ తల్లి సుధారాణి గృహిణి.మరో మృతుడు కొండూరు జస్వంత్ అఖిల్(17) తండ్రి వెంకటేశ్వరరావు పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. 2011 వరకు తెనాలి వన్ టౌన్ స్టేషన్‌లో చేసిన ఆయన ఆ తరువాత రేపల్లెకు బదిలీ అయ్యారు.
 కుటుంబంతో ఇక్కడి కొత్తపేటలోని పోలీస్ క్వార్టర్స్‌లో నివసిస్తూ ప్రతి రోజు డ్యూటీకి వెళ్లి వస్తుంటారు. ఆయనకు ఇరువురు కుమారుల్లో  అఖిల్ పెద్దవాడు, భార్య నాగమల్లేశ్వరి గృహిణి. రెండో కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు.

 పాఠశాల నుంచి మంచి మిత్రులు
  మురళీధర్‌రెడ్డి, అఖిల్, అవినాష్ ముగ్గురూ పదోతరగతి వరకు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. అప్పటి నుంచి వారి స్నేహం కొనసాగుతోంది. ముగ్గురూ తమ ఇతర మిత్రులతో కలసి సంక్రాంతి సెలవులను ఉల్లాసంగా గడుపుతున్నారు. అఖిల్ అమ్మమ్మ ఊరు మున్నంగి కావడంతో స్నేహితులు మురళీధర్‌రెడ్డి, అవినాష్‌లు కలసి మరో ఐదుగురి మిత్రులను గ్రామానికి ఆహ్వానించారు. సాయంత్రం వరకు గ్రామ పరిసరాల్లో గడిపి, రేవులో ఈతకు దిగారు.

 మురళీ, జస్వంత్, అవినాష్‌ల ముందు రేవులో గుంత వుండడంతో మునిగిపోయారు. తోటి మిత్రులు బయటకు లాగేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు మృత్యువు పాలయ్యారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున తెనాలి జిల్లా వైద్యశాల మార్చురీకి తరలివచ్చారు. వైద్యశాల ఆవరణలో వారి రోదనలు మిన్నంటాయి. మృతులు ముగ్గురూ మూడు కుంటుంబాల్లోనూ ప్రథమ సంతానం కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement