ఘాట్‌కో గండం | dangerous ghat | Sakshi
Sakshi News home page

ఘాట్‌కో గండం

Published Wed, Aug 3 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

ఘాట్‌కో గండం

ఘాట్‌కో గండం

కొల్లిపర :
 పుష్కరఘాట్ల వద్ద ప్రమాదకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. పిడపర్రు లాకుల వద్ద పుష్కరఘాట్‌కు వెళ్లే అప్రోచ్‌రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ రోడ్డు నిర్మాణంలో మట్టి, ఇసుక వాడారు. అప్రోచ్‌ రోడ్డు పక్కనే ఉన్న రేపల్లె బ్యాంకు కెనాల్‌ స్లూయిస్‌ బాగా పల్లంగా ఉండటంతో ఇది భయపెడుతోంది. అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం వెంట బారికేడ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది.
 మున్నంగి వద్ద అప్రోచ్‌ రోడ్డు 
మున్నంగి పుష్కర ఘాట్‌కు వెళ్లే అప్రోచ్‌రోడ్డు ప్రమాదకరంగా ఉంది. రోడ్డు నిర్మాణంలో భాగంగా మట్టి తవ్వారు. ఎక్కువ లోతుగా తవ్వకాలు జరపటంతో రోడ్డు వెంట పల్లంగా మారింది. ఒక వేళ పట్టుజారిందా గోతిలో పడాల్సిందే. ఇక్కడ అప్రోచ్‌రోడ్డు వెంట సైడ్‌ వాల్స్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. 
 వల్లభాపురం ఘాట్‌కు బారికేడ్లు తప్పనిసరి?
భక్తులు స్నానాలు చేసే చోట తప్పనిసరిగా బారికేడ్లు ఏర్పాటు చేయాలి. వల్లభాపురం తిరుపతమ్మ గుడి వద్ద భక్తుల స్నానాల కోసం అక్కడ ఉన్న ర్యాంప్‌ వద్ద రెండు పుష్కర ఘాట్‌లను నిర్మిస్తున్నారు. ఒక ఘాట్‌ ర్యాంపునకు ఎదురుగా, మరో ఘాట్‌ ర్యాంపునకు ఎడమవైపు ఉంది. ఆ రెండింటి మధ్య ఎక్కువ ఖాళీ స్థలం ఉంది. రెండు ఘాట్‌ల వద్ద రెండున్నర అడుగుల మేర మాత్రమే సైడ్‌ వాల్స్‌ నిర్మిస్తున్నారు. ఇక్కడ ఖాళీ స్థలంలో భక్తులు స్నానమాచరిస్తారు. కావున బారికేడ్లు తప్పనిసరి.  
 వల్లభాపురం శ్మశాన వాటిక వద్ద గుండం
వల్లభాపురం శ్మశాన వాటిక వద్ద ఉన్న ఘాట్‌కు సమీపంలో గుండం ఉంది. అక్కడ అధికారులు నిర్దేశించిన ఘాట్‌ ప్రాంతంలోనే స్నానం చేయడం మంచిది. గుండం వద్దకు భక్తులు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇక్కడ కచ్చితంగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి.
 జారుడు బల్లగా పుష్కర ‡ఘాట్‌
వల్లభాపురం శ్మశాన వాటిక వద్ద ఉన్న పుష్కరఘాట్‌ జారుడు బల్లగా కనిపిస్తుంది. పుష్కరాల సమయంలో వర్షం వస్తే భక్తులకు ఇబ్బందే. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే భద్రతా పరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  
సీతానగరంలో..
సీతానగరం(తాడేపల్లి రూరల్‌): స్థానిక కృష్ణా రివర్‌ బెడ్‌లో ఉన్న రిటైనింగ్‌ వాల్, పుష్కరఘాట్ల వద్ద స్వాగతద్వారం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి పుష్కరఘాట్ల వరకు 800 మీటర్లపైన ఉన్న రిటైనింగ్‌ వాల్‌ ఇప్పటికే రెండుచోట్ల కూలింది. మరో నాలుగు చోట్ల కూలేందుకు సిద్ధంగా ఉంది. భారీ వర్షం కురిస్తే విజయకీలాద్రి పర్వతంపై నుంచి వచ్చే వర్షపునీరు ఈ వాల్‌లోకి ప్రవేశిస్తాయి. కూలడానికి సిద్ధంగా ఉన్న ఈ గోడల్లోకి నీరు చేరితే ప్రమాదమేనని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. పుష్కరఘాట్ల వద్ద గతంలో ఏర్పాటు చేసిన ఆంజనేయస్వామి స్వాగతద్వారం పూర్తిగా శిథిలావస్థకు చేరి పెచ్చులూడుతోంది. నాలుగో ఘాట్‌లో భక్తుల సేద తీర్చేందుకు గతంలో షెడ్డును ఏర్పాటు చేశారు. ఈ షెడ్డు పైకప్పు లేచి ప్రమాదభరితంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement