జిన్నారం, న్యూస్‌లైన్: భారీ పేలుడుతో మండలంలోని బొల్లారం పారి శ్రామికవాడ ఉలిక్కిపడింది. శుక్రవారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ప్రగతి ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో కార్మికులు ఒక్కసారి గా ఆందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. ఈ పరిశ్రమ ఐదేళ్ల క్రితమే మూతపడింది. మరో యజమాని దీన్ని రెండేళ్ల క్రితం స్వాధీనం చేసుకుని నడుపుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో పరిశ్రమలోని ప్రొడక్షన్ బ్లాక్-3లో సుమారు పదిమంది కార్మికులు రియాక్టర్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు.
రియాక్టర్‌లో 4-సీఏఎంఎస్ (క్లోరోఎసిటైల్ మిథేన్ సల్ఫోనానిలైడ్) అనే ఇంటర్మీడియట్ రసాయన పదార్థాన్ని ప్రాసెస్ చేస్తున్నారు. 50-70 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఈ రసాయన పదార్థాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంది. కానీ ఒక్కసారిగా ఉష్ణోగ్రత వంద డిగ్రీల సెల్సియస్‌కు పెరిగినట్టు సమాచారం. ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో పేలుతుందని భావించిన కార్మికులు పరుగులు తీశారని అదే సమయంలో పేలుడు సంభవించినట్టు సమాచారం. ఈ ఘటనలో దేవేందర్‌బాల్, రాజేష్‌మాలిక్ అనే ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కూకట్‌పల్లిలోని రెమెడీ ఆసుపత్రికి తరలించారు.
దీని పక్కనే ఉన్న సుమారు 10 రియాక్టర్లు కిందపడిపోయాయి. భవనం పైభాగం పూర్తిగా ధ్వంసమైంది. పక్కనే ఉన్న భవనం కూడా బీటలు వారగా, అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
రియాక్టర్‌లో 500 కిలోల 4-సీఎఎంఎస్ రసాయన ం ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు పరిశ్రమ ఎండీ వెంకటరమణ తెలిపారు. విషయం తెలుసుకున్న ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ గంగాధర్, అధికారి రాధాకృష్ణ, రామచంద్రాపురం సీఐ శ్రీని వాస్, వైఎస్సార్ సీపీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు, పరిశ్రమ కార్మిక యూనియన్ అధ్యక్షుడు నర్రా భిక్షపతి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు బాల్‌రెడ్డి తదితరులు సంఘట నా స్థలాన్ని సందర్శించి, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. స్థానిక వీఆర్‌ఓ రుక్మొద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు బొల్లారం ఎస్‌ఐ ప్రశాంత్ తెలిపారు.
దద్దరిల్లిన బొల్లారం
Published Sun, Feb 9 2014 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM
Advertisement
Advertisement