పెళ్లయిన రెండు రోజులకే.. | a man died with current shot | Sakshi
Sakshi News home page

పెళ్లయిన రెండు రోజులకే..

Published Sun, Mar 26 2017 4:04 PM | Last Updated on Tue, Sep 5 2017 7:09 AM

పెళ్లయిన రెండు రోజులకే..

పెళ్లయిన రెండు రోజులకే..

ఆ యువకుడు కోరుకున్న యువతినే పెళ్లి చేసుకున్నాడు. జీవిత భాగస్వామితో జీవితాన్ని సంతోషంగా గడపాలని కలలుగన్నాడు. ఈడూజోడు చక్కగా ఉన్న ఆ జంటను చూసి అందరూ సంతోషించారు. ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. పసుపు దుస్తులు కూడా విప్పకుండానే మృత్యువు విద్యుత్‌ రూపంలో అతన్ని పొట్టన పెట్టుకుంది. కాళ్లపారాణి ఆరకనే, ఇంటిముందు వేసిన పందిరి తీయకనే వైధవ్యానికి గురికావడంతో ఆ యువతి చేస్తున్న రోదనలు అన్నీ ఇన్నీ కావు. నీతోపాటే నన్ను కూడా తీసుకుపోకూడదా సామీ.. అంటూ ఆమె ఆర్తనాదాలను చూసి స్థానికులు కంటతడి పెట్టారు. ఈ సంఘటన ములకలచెరువు మండలంలో శనివారం చోటుచేసుకుంది.
► మొబైల్‌ ఫోన్‌కు చార్జింగ్‌ పెడుతుండగా విద్యుత్‌ షాక్‌
► నవ వరుడు మృతి
► మృతుడు కర్ణాటక వాసి
► కనుగొండవారిపల్లెలో విషాదఛాయలు

ములకలచెరువు /మదనపల్లె క్రైం: మొబైల్‌ చార్జింగ్‌ పెడుతుండగా విద్యుత్‌ షాక్‌ గురై నవ వరుడు దుర్మరణం చెందిన సంఘటన ములకలచెరువు మండలంలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లె మండలం పరగోడుకు చెందిన మిద్ది నరసింహప్ప, నరసమ్మ దంపతుల కుమారుడు నరసింహులు(24) కర్ణాటక ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఈ నెల 23న ములకలచెరువు మండలం గూడుపల్లి పంచాయతీ కనుగొండవారిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన యాట వెంకటరమణ, రెడ్డెమ్మ దంపతుల కుమార్తె ప్రమీల(20)తో పెళ్లి జరిగింది.

శుక్రవారం నవ దంపతులు కనుగొండవారిపల్లెకు మరువులకు వచ్చారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇద్దరూ నిద్రించారు. శనివారం తెల్లవారుజామున నరసింహులు తన మొబైల్‌కు చార్జింగ్‌ పెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఓవర్‌లోడు రావడంతో షాక్‌కు గురయ్యాడు. నరసింహులు గట్టిగా కేకలు వేస్తూ కింద పడిపోయాడు.
వెంటనే నిద్ర నుంచి మేల్కొన్న ప్రమీల తీవ్రంగా గాయపడిన భర్తను కుటుంబ సభ్యుల సహకారంతో 108లో మదనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు. పెళ్లయి మూడు రోజులు కూడా కాకుండానే భర్త మృతిచెందడంతో  ప్రమీల గుండెలు పగిలేలా రోదించింది. ఇక నాకు దిక్కెవరు, నన్ను కూడా నీతోపాటు తీసుకెళ్లిపోరాదా అంటూ తలను నేలకేసి బాదుకుంది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.

నరసింహులు మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, వారి బంధువులు, ప్రమీల కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి పెద్ద సంఖ్యలో చేరుకుని బోరున విలపించారు. కనుగొండవారిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. ములకలచెరువు ఎస్‌ఐ ఈశ్వరయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.  
ట్రాన్స్ కో నిర్లక్ష్యమే ప్రాణాలు తీసిందా
కొత్తమీటర్లు బిగించేందుకు ట్రాన్స్ కో అధికారులు ఇటీవల కనుగొండవారిపల్లె దళితవాడకు విద్యుత్‌ పాత మీటర్ల ను తొలగించారు. వారు తిరిగి కొత్తమీటర్లు బిగించకపోగా ఇళ్లకు డైరెక్ట్‌గా కరెంట్‌ సర్వీసులు ఇచ్చి వెళ్లిపోయారు. 2 నెలలుగా అధికారులు మీటర్లు అమర్చకుండా కాలయాపన చేయడం వల్ల విద్యుత్‌ ఓవర్‌ లోడు వస్తోంది. గ్రామంలోని భాస్కర్, అనిల్‌ విద్యుత్‌ షాక్‌కు గురైనట్టు గ్రామస్తులు తెలిపారు. నరసింహులు చావుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement