కుమార్తెలను బావిలో తోసి తల్లి ఆత్మహత్య
తాగుబోతు భర్త వేధింపులే కారణం
పీలేరు : మద్యానికి బానిసైన వ్యక్తి భార్యను నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. దీంతో ఆమె జీవితంపై విరక్తి చెందింది. ఇద్దరు కుమార్తెలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన చిత్తూరు జిల్లా పీలేరు మండలం మిథులానగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. మృతుల బంధువులు, పోలీసుల కథనం మేరకు.. పీలేరు మండలం మిథులానగర్‌కు చెందిన ఎం.దేవేంద్ర, వెంకటరమణమ్మ దంపతుల కుమార్తె సునీత(32)ను నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన మునిశేఖర్‌కు ఇచ్చి తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేశారు.
వారి సంసారం రెండేళ్లు సాఫీగా సాగిం ది. వీరికి యశ్విని(7), నవ్య(5) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మద్యానికి బానిసైన మునిశేఖర్ తనకున్న నాలు గు ఎకరాల పొలం అమ్మేశాడు. దీంతో నాయుడుపేటలో బతుకుతెరువు లేకపోవడం, భర్త ప్రవర్తనలో మార్పు తీసుకురావాలన్న ఆశతో సునీత తన పుట్టినిల్లు అయిన మిథులానగర్‌కు వచ్చేసింది. వారితో పాటు మునిశేఖర్ కూడా ఇక్కడికే వచ్చేశారు. వారు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
మునిశేఖర్ రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యను చితకబాదేవాడు. ఐదేళ్లుగా భర్త పెట్టే నరకయాతనను బిడ్డల కోసం భరించింది. శనివారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన మునిశేఖర్ భార్య సునీత(32)ను తీవ్రంగా కొట్టాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె ఇద్దరు బిడ్డలతోపాటు ఆదివారం తెల్లవారుజామున ఊరు సమీపంలోని ఓ వ్యవసాయ బావి వద్దకు చేరుకుంది. తాను చనిపోతే బిడ్డలను చూసే దిక్కు ఉండదని భావించి పిల్లలను బావిలోకి తోసి తానూ దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సునీత ఇంటి నుంచి వెళ్లిపోయిన విషయం తెలుసుకున్న బంధువులు, తల్లిదండ్రులు తీవ్రంగా గాలించారు. ఆచూకీ తెలియలేదు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మిథులానగర్ సమీపంలోని బావిలో నవ్య మృతదేహం తేలింది.
దీన్ని గమనించిన గ్రామస్తులు పీలేరు సీఐ నాగరాజుకు సమాచారం అందించారు. ఆయన అక్కడికి చేరుకుని సునిత, యశ్విని, నవ్య మృతదేహాలను వెలికి తీయించి పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సునిత భర్త మునిశేఖర్ పరారీలో ఉన్నాడు. తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడడంతో మిథులానగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.