పట్టాలెక్కేనా..!
ఏలూరు :రైల్వే బడ్జెట్‌లో ప్రతి ఏటా జిల్లాకు మొండి చేయి చూపిస్తున్నారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాకు ఈ బడ్జెట్‌లో ఎంత వరకు న్యాయం చేస్తారో.. రైల్వే బడ్జెట్‌కు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఫిబ్రవరిలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో జిల్లా ఎంపీల ప్రతిపాదనలను కేంద్రం కోరింది. ఇప్పటి వరకు జిల్లాలో ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు ఊసే లేదు. వచ్చే ఏడాది జూలై 14 నుంచి గోదావరి పుష్కరాలకు కోట్లాది మంది యాత్రీకులు రానున్నారు. దీంతో వడివడిగా రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ చేయడంతో పాటు, ప్రత్యేక రైళ్లను పెద్ద ఎత్తున నడపాల్సి ఉంది. జిల్లా అభివృద్ధికి ఉపకరించే ప్రతిపాదలను ఎంపీలు ఐక్యంగా చేయాల్సిన అవసరం ఉంది. ఏలూరు ఎంపీ మాగంటిబాబు, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు మాత్రం ఇంకా ప్రతిపాదనలు చేయలేదు. రాజ్యసభ్య సభ్యురాలు తోట సీతారామలక్ష్మి కొద్ది నెలల క్రితం అప్పటి రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ్‌కు ప్రతిపాదనలు ఇచ్చారు. ఇప్పడు వాటినే అటుఇటుగా మార్చి పంపాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ ప్రతిపాదనలు పంపినట్టు తెల్సింది. ఇందులో గోదావరి స్టేషన్ ఆధునికీకరణ ఉంది. పెద్ద ఎత్తున రైళ్లను నడపడటంతోపాటు అన్ని పుణ్యక్షేత్రాలను కలుపుతూ రైళ్లు వేయాలని ఆయన ప్రతిపాదించినట్టు సమాచారం.
ఆదాయం ఉన్నా సౌకర్యాలు లేవు
ప్రతి ఏటా ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌పై జిల్లా ప్రజలు పెదవి విరుపులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఏటా ప్రయాణికుల రాకపోకలు, సరుకుల రవాణా కింద జిల్లా నుంచి భారీగానే రైల్వేలకు ఆదాయం వస్తున్నా, సౌకర్యాల గురించి పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, నిడదవోలు, తణుకు, నరసాపురం, కొవ్వూరు స్టేషన్ల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఏ స్టేషన్ చూసినా ప్రయాణికుల సహనాన్ని పరీక్షించేలా ఉంటాయి. కొత్త రైల్వే లైన్లపై జిల్లా ప్రజలకు పాలకులు ఇచ్చిన హామీలు నీటిపై రాతల్లా మిగిలిపోయాయి. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో ప్రజాప్రతినిధులు విఫలమవుతూనే ఉన్నారన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించాల్సిన అవసరం ఉంది.
ప్రతిపాదనలకే పరిమితం
కొవ్వూరు- భద్రాచలం రైల్వే లైను నిర్మాణ వ్యయం గత రైల్వే బడ్జెట్ నాటికి రూ.745 కోట్లకు చేరింది. ఈ రైల్వే లైను పూర్తయితే కొత్తగూడెం, సింగరేణి, మణుగూరు బొగ్గు గనుల నుంచి విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్,, సింహాద్రి థర్మల్ పవర్‌స్టేషన్‌కు బొగ్గు తరలింపునకు ఉపయుక్తంగా ఉంటుంది.
నరసాపురం-కోటిపల్లి రైల్వే లైనుకు బ్రిడ్జి నిర్మాణం ప్రతిపాదన స్థాయిలోనే ఉంది.
గుడివాడ-మచిలీపట్నం, గుడివాడ-నరసాపురం డబ్లింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
ఏలూరు రైల్వేస్టేషన్‌లో కోరమాండల్, గౌహతి, కరియ-యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్ డిమాండ్‌కు అతీగతీ లేదు.
ఏలూరు ఒకటో నంబరు ప్లాట్‌ఫారంకు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచేలా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నా ప్రయోజనం శూన్యం. దీనికి ప్రత్యామ్నాయంగా ఎస్కలేటర్లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌నూ పట్టించుకోవట్లేదు.
తాడేపల్లిగూడెం స్టేషన్‌లోని 1, 2 ప్లాట్‌ఫారాలకు లిఫ్టు సౌకర్యం కల్పించాలని ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా అరణ్య రోదనగా మిగిలిపోయింది.రసాపురం నుంచి రోజుకు 23 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నా ఒక్క ప్లాట్‌ఫారం ఉండటంతో పెద్ద ఇబ్బంది. ఈ స్టేషన్ చివరి హాల్ట్ అయినా ఒకటే ఫిట్‌లైన్ ఉండటంతో స్టేషన్‌కు వచ్చి నిలిచిపోయే ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిర్వహణ కోసం మచిలీపట్నం పంపించాల్సి వస్తోంది.
ఏలూరు స్టేషన్లో సౌకర్యాల కల్పన: ఎంపీ మాగంటి బాబు
ఏలూరు పెద్ద రైల్వేస్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్‌ఫారంపై విశాఖపట్నం వైపు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని ఎన్నో ఏళ్లుగా ప్రజలు కోరుతున్నారు. దీనికి చర్యలు తీసుకుంటాను. ఇక్కడ ఎస్కలేటర్ ఏర్పాటు, ఇతర సౌకర్యాల కల్పనపై రైల్వే మంత్రితో మాట్లాడతా.
పుష్కరాల సౌకర్యాల కల్పన :ఎంపీ తోట సీతారామలక్ష్మి
జిల్లాలో రైల్వే స్టేషన్లలో సమస్యలను పరిష్కరించడంతో పాటు కొవ్వూరు- భద్రాచలం రైల్వే లైను అభివృద్ధి, ఆంధ్రాలోని పలు ప్రాంతాలను కలుపుతూ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రానికి నివేదిస్తాను. గోదావరి పుష్కరాల దృష్ట్యా అన్ని రైల్వేస్టేషన్లు ఆధునీకరించి, యాత్రీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని త్వరలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభును కోరతా.
ఇంకా సమయం ఉంది : ఎంపీ గోకరాజు గంగరాజు
రైల్వే ప్రతిపాదనలను పంపాలని కేంద్రం కోరింది. వాటిని పంపించేందుకు ఇంకా సమయం ఉంది. మెరుగైన ప్రతిపాదనలను తయారు చేయిస్తాను. గుడివాడ-కైకలూరు డబ్లింగ్ పనులు, భీమవరం, పాలకొల్లు రైల్వేగేట్ల వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తాం.