మైలవరం (కృష్ణా), భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: కృష్ణా జిల్లాలోని మైలవరం పట్టణ శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో భద్రాచలానికి చెందిన ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రంగా, ముగ్గురికి స్వల్పంగా గాయాలయ్యాయి. పదిమంది శివ స్వాములు భద్రాచలం నుంచి క్వాలిస్ వాహనంలో శ్రీశైలం వెళుతున్నారు. మైలవరం శివారులోని దర్గా సమీపంలో ఈ వాహనం వెనుక టైర్ పేలిపోయింది. దీంతో వాహనం అదుపు తప్పి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన నీరు లేని పంట కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో భద్రాచలం మండలంలోని తుమ్మల నగర్ గ్రామానికి చెందిన అపకా రామారావు(30) మృతిచెందారు. సిహెచ్.శోభన్‌బాబు, డి.దేవదాస్, డి.వినోద్, ఎం.విశ్వనాథ్, డి.మల్లేశ్వరమ్మ, పి.అన్నపూర్ణకు బలమైన గాయాలయ్యాయి. కె.అక్కయ్య, డి.శ్రీకాంత్, కె.మురళి స్వల్పంగా గాయపడ్డారు. వీరిని 108 సిబ్బంది స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన శోభన్‌బాబు, దేవదాస్, వినోద్, విశ్వనాథ్, మల్లేశ్వరమ్మ, అన్నపూర్ణను ప్రాథమిక చికిత్స అనంతరం 108 లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వాహనాన్ని డ్రైవర్ అతి వేగంగా నడిపినందునే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
శివయ్య దర్శనానికి వెళ్లొస్తానని... కానరాని లోకాలకు...
‘శ్రీశైలం శివయ్య దర్శనానికి వెళ్లొస్తా..’నంటూ ఇంట్లో చెప్పి బయల్దేరిన కొద్ది గంటల్లోనే అపకా రామారావును రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. శివమాల వేసుకుని శ్రీశైలం బయలుదేరేముందు జరిగిన ఇరుముడి కార్యక్రమంలో అతనితో గడిపిన క్షణాలే ఆ కుటుంబానికి చివరి జ్ఞాపకాలయ్యాయి. రామారావు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతని స్వగ్రామం గొమ్ముకొత్తగూడెం. డిగ్రీ అనంతరం కొత్తనారాయణపురం గ్రామానికి చెందిన నాగమణితో వివాహమైంది.
ఆ ఊరు పక్కనున్న తుమ్మల నగర్‌లో పూరి గుడిసెలో భార్య, ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శివమాల వేసుకోవడంతో... తాను కూడా శివమాల ధరించి నిష్టగా మాలధారణ పూర్తిచేశాడు. శ్రీశైలం వెళ్లేందుకుగాను ఇరుముడి కార్యక్రమం శుక్రవారం తెల్లవారుజామున స్థానిక శివాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రామారావు తన భార్యాపిల్లలతో, బంధువులతో ఆనందంగా గడిపాడు. ‘శివయ్య వద్దకు వెళ్లొస్తా..’నని బయల్దేరాడు. ప్రమాదం జరిగిందని మిగిలిన స్వాముల నుంచి ఫోన్ రావడంతో రామారావు కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. రామారావు తండ్రి, భార్య, బావమరిది కలిసి మైలవరం వెళ్లారు. రామారావు ఇంటి వద్ద అమాయకంగా చూస్తున్న అతని పిల్లలు తేజ(8), సాయిరాం(6) చూసి బంధువులు రోదిస్తున్నారు. రెక్కల కష్టం మినహా మరెలాంటి ఆదరువూ లేని తమ్ముడి కుటుంబానికి దిక్కెవరంటూ అతని అక్క, బంధువులు రోదిస్తున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శోభన్‌కు టెంట్ హౌస్ ఉంది. దేవదాసు టైలర్‌గా పనిచేస్తున్నాడు.
శివ స్వాముల వాహనం బోల్తా
Published Sat, Dec 14 2013 6:33 AM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM
Advertisement
Advertisement