
పెళ్లి చేయలేదని యువకుడి ఆత్మహత్య
వానవోలు(గోరంట్ల): పెళ్లి చేయలేదని మద్యం తాగొచ్చి, తల్లితో గొడవ పడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అనంతపురంజిల్లా గోరంట్ల మండలంలోని వానవోలు గ్రామంలో చోటుచేసుకొంది. వానవోలు గ్రామానికి చెందిన చాకలి రవి (25) తనకు పెళ్లి చేయమని సోమవారం రాత్రి తన తల్లితో గొడవపడ్డాడు. అయితే ‘‘తండ్రి లేడు, తాగుడుకు బానిసగా మారి జూలాయిగా తిరుగుతున్న నీకెవ్వరు బిడ్డను నిస్తారు.’’ అని తల్లి చెప్పింది. దీంతో తన తల్లి నిద్రపోయాక ఇంట్లో ఉన్న దూలానికి ఉరి వేసుకుని రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తెల్లారి లేచి చూసేసరికి కొడుకు శవం వేలాడుతుండడంతో గమనించిన తల్లి ఆంజినమ్మ స్థానికులకు తెలిపింది. స్థానిక ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శవపంచనామా నిమిత్తం శవాన్ని పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.