ఆధార్... బేజార్! | Aadhaar ... bejar! | Sakshi
Sakshi News home page

ఆధార్... బేజార్!

Published Fri, Nov 6 2015 1:36 AM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM

ఆధార్... బేజార్!

ఆధార్... బేజార్!

గుంటూరు వెస్ట్ : ఆధార్ సీడింగ్ సక్రమంగా నమోదుకాకపోవడంతో అక్టోబర్ నెలకు సంబంధించి జిల్లాలో 6,649 మంది పింఛన్ల పంపిణీ నిలిచిపోయింది. వారందరికీ నగదు మంజూరు అయినప్పటికీ సరైన ఆధార్ సంఖ్య సీడింగ్ కాకపోవడంతో అధికారులు పంపిణీ నిలిపివేయాల్సి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా వారి సంఖ్య 1.23 లక్షలు ఉండడం గమనార్హం!

ఎన్‌టీఆర్ భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛన్ల పంపిణీకి ఆధార్ సీడింగ్ ఇబ్బందులను తెచ్చిపెడుతున్నది. జిల్లాలోని 411 మంది డూప్లికేట్ ఆధార్‌ను అందించారు. ఒకే ఆధార్ సంఖ్య ఇద్దరు, ముగ్గురికి నమోదుకావడంతో 1,900 మందికి పింఛన్ నిలిపివేశారు. అదేవిధంగా 4,348 మందికి ఆధార్ లేకపోవడంతో పింఛన్ నిలిచిపోయింది.
 
జిల్లావ్యాప్తంగా వృద్ధాప్య పింఛన్‌లు ఎన్‌ఓఏపీఎస్ స్కీమ్ కింద 81,899 మందికి రూ.8.18 కోట్లు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రబడ్జెట్‌లో 86,894 మందికి రూ.8.68 కోట్లు అందిస్తున్నారు. చేనేత కార్మికులు 6,588 మందికి రూ.65.88 లక్షలు, వితంతువులు 1,30,010 మందికి రూ.13 కోట్లు, అభయహస్తం కింద 23,238 మందికి రూ. 2.32 కోట్లు, 40 నుంచి 79 శాతం లోపు అంగవైకల్యం కలవారు 33,562 మంది ఉండగా వారికి రూ.3.35 కోట్లు, 80 శాతం పైబడి అంగవైకల్యం కలవారు 9,880 మంది ఉండగా వారికి రూ.1.48 కోట్లు, కల్లుగీత కార్మికులు 892 మందికి రూ. 8.92 లక్షలు పంపిణీచేస్తున్నారు. మొత్తంగా 3,72,963 మంది పింఛన్‌దారులకు రూ.37.79 కోట్లు అందజేస్తున్నారు. మూడు నెలలకొకసారి కొత్త పింఛన్‌లు మంజూరు చేస్తుండడంతో పింఛన్‌దారుల సంఖ్య పెరుగుతుంటుంది.
 
సెర్ప్ సీఈవో ఆదేశాలు
 రాష్ట్రవ్యాప్తంగా ఈనెల జరగాల్సిన పంపిణీలో 1.23 లక్షల మంది ఫించన్‌దారులకు సరైన ఆధార్ సీడింగ్ లేకపోవడంతో మేలుకున్న ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు. ఈమేరకు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ(సెర్ప్) రాష్ట్ర సీఈవో ఎస్.సాల్మన్‌అరోక్‌జరాజ్ జిల్లాలకు సమాచారం అందించారు. ఎంపీడీవోలు పోర్ట్ నుంచి ఆధార్ సీడింగ్‌లో జరిగిన లోపాలను సరిచేసి పింఛన్‌లు పంపిణీ జరిగేలా చూడాలని ఆయన ఆదేశాలు జారీచేశారు. అదేవిధంగా ఆధార్ లేనిపక్షంలో అర్హులైన వారికి పింఛన్‌లు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇక నుంచి వాయిస్ ఎస్‌ఎంఎస్‌లు
డిసెంబర్ నుంచి పింఛన్‌దారుల సెల్‌ఫోన్‌లకు వాయిస్ ఎస్‌ఎంఎస్‌లు పంపించేందుకు అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలోని పింఛన్‌దారుల నుంచి 50 శాతం మంది సెల్‌ఫోన్ నంబర్లను సేకరించారు. పింఛన్‌దారులకు ఒకవేళ నంబర్ లేకుంటే తమ సమీప బంధువులు, ఇంటిపక్క వారి నంబర్లు అందించాలని అధికారులు సూచిస్తున్నారు. పింఛన్‌లు పంపిణీకి ముందు సెల్‌ఫోన్‌లకు ఎస్‌ఎంఎస్‌లు వచ్చేవిధంగా అధికారులు చర్యలు చేపట్టారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement