మీ సేవా కేంద్రాల్లో ఆధార్ నమోదు
Published Sat, Nov 30 2013 3:12 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM
కాకినాడ సిటీ, న్యూస్‌లైన్:జిల్లా వ్యాప్తంగా మీసేవా కేంద్రాలలో ఆధార్ నమోదు చేపట్టనున్నారు. తొలిదశగా 18 అర్బన్ కేంద్రాల్లో ఈ సేవలను ప్రారంభించే చర్యలు తీసుకున్నారు. కాకినాడ గాంధీనగర్‌లోని మీసేవా కేంద్రంలో అందుబాటులోకి తీసుకువచ్చిన ఆధార్ నమోదు సేవలను శుక్రవారం కలెక్టర్ నీతూ ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 70 మీసేవా కేంద్రాల్లో ఆధార్ నమోదుకు చర్యలు తీసుకున్నామన్నారు. వీటిలో 18 అర్బన్ కేంద్రాలకు శిక్షణ పొందిన సిబ్బందితో సహా సేవలు ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసినట్టు తెలిపారు. త్వరలోనే అన్ని మండల కేంద్రాల్లో మీసేవా ద్వారా ఆధార్ నమోదు చేపడతామన్నారు. కొత్తగా అందుబాటులోకి తెచ్చిన మీసేవా కేంద్రాల్లో ఆధార్ నమోదు సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, డీఎస్‌ఓ వి.రవికిరణ్, సివిల్ సప్లయి కార్పొరేషన్ జిల్లా మేనేజర్ టీవీఎస్ గంగాధర్‌కుమార్, మీసేవా డిప్యూటీ కలెక్టర్ ప్రమీలా గాంధీ పాల్గొన్నారు.
గ్యాస్ ఆధారిత ఆధార్ మరింత పెంచాలి
సాక్షి, కాకినాడ : జిల్లాలో గ్యాస్ ఆధారిత బ్యాంకు అకౌంట్లతో కూడిన ఆధార్ నమోదు శాతం బాగుందని మరి కాస్త దృష్టిపెడితే పూర్తి నమోదుకు అవకాశం ఏర్పడి జిల్లా ఉన్నత స్థానంలో ఉంటుందని కలెక్టర్ నీతూ ప్రసాద్ పేర్కొన్నారు. గ్యాస్ డీలర్లు.గ్యాస్ ఏజన్సీలు, బ్యాంకు,పౌరసరఫరాల శాఖ అధికార్లతో కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. జాయింటు కలెక్టర్ ముత్యాల రాజు,లీడ్ బ్యాంకు మేనేజర్ జగన్నాధరాజు సివిల్ సప్లయిస్ డీఎం గంగాధర కుమార్,డీఎస్‌ఓ రవికిరణ్ పాల్గొన్నారు.
ఇంతవరకూ బ్యాంకుల ద్వారా ఎల్‌పీజీ,ఆధార్ మొత్తంగా 91 శాతం నమోదయిందని కలెక్టర్ తెలిపారు. పేరు మార్పు పేరిట దరఖాస్తు చేసుకున్న వారిలో ఒకటికి మించి ఎక్కువ కనెక్షన్లు కలిగివున్న వినియోగదారులున్నారని వీటిని అంగీకరించే పరిస్ధితి లేనందున ఉన్నత స్ధాయిలో దాదాపు 11 వేల పైబడి బ్లాక్ చేశారని అధికారులు వివరించారు. అలాగే దీపం క నెక్షన్లకు సంబంధించి వాస్తవ,లీగల్‌హైర్, థర్‌డ పార్టీలకు సంబంధించి 16 వేలు పైబడి ఉన్నాయని, వీటిలో అతి తక్కువ శాతం మాత్రమే పరిశీలన పూర్తయిందని అధికార్లు తెలుపగా వీటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి నమోదు శాతం పెంచాలని కలెక్టర్ సూచించారు.
Advertisement
Advertisement