ఆధార్ అనుసంధానం @: 99.9 శాతం
శ్రీకాకుళం పాతబస్టాండ్: రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం దాదాపు పూర్తయింది. నెల రోజుల పాటు ఈ ప్రక్రియ నిర్విరామంగా సాగింది. రేషన్ కార్డులలోని యూనిట్‌దారులందరికీ..ఆధార్ అనుసంధానం చేయాలని అధికారులు సివిల్ సప్లై అధికారులు, డీలర్లపై ఒత్తిడి చేశారు. ఒక దశలో సిబ్బందిపై కూడా చర్యలు తీసుకునేందుకు వెనుకాడలేదు. వందశాతం ఫలితాలు సాధించేందుకు అన్ని విధాలా ప్రయత్నించారు. ఆధార్ నంబర్ లేనివారు, ఎన్‌రోల్‌మెంట్ నంబర్ లేని వారి యూనిట్లను కార్డుల నుంచి తొలగించేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,36,199 యూనిట్లు రద్దయ్యాయి. ఆధార్ క్రమ సంఖ్య లేనివారిలో నిరుపేదలు, వృద్ధులు, వికలాంగులు ఉన్నారని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
వందశాతం నమోదు పూర్తి చేసుకున్న మండలాలు
రాజాం, ఎచ్చెర్ల, సీతంపేట, కొత్తూరు, సరుబుజ్జిలి, పాతపట్నం, మెళియాపుట్టి, టెక్కలి మండలాల్లో వందశాతం ఆధార్ అనుసంధానం పూర్తయింది.
అత్యల్పంగా నమోదు చేసుకున్న మండలాలు
వజ్రపుకొత్తూరు (99.26 శాతం), సంతకవిటి (99.31 శాతం), జలుమూరు (99.56), వంగర (99.61), బూర్జ (99.61) శాతాల్లో ఉన్నాయి. జిల్లా సగటున 99.9 శాతం ఈ ఆధార్ అనుసంధానం పూర్తయింది.
ఇదీ పరిస్థితి
జిల్లా వ్యాప్తంగా 7,36,485 రేషన్‌కార్డులున్నాయి. వీటిలో 25,17,998 యూనిట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్‌రోల్‌మెంట్ నంబర్ ద్వారా 1,87,208 యూనిట్లను అనుసంధానం చేశారు. ఆధార్ ఐడీ నంబ రు ద్వారా 19,92,337 యూనిట్లకు అనుసంధానం చేశారు. ఇప్పటి వరకు మొత్తం 21,79,545 యూనిట్ల అనుసంధానం పూర్తయింది. మిగిలిన వాటిలో అన్‌సీడెడ్ యూని ట్లుగా 1,173, పెండింగ్ యూనిట్లుగా 1081 నమోదయ్యాయి. 3,36,199 యూనిట్లను తొలగించారు. తొలగించిన యూనిట్లను మినహాయించడంతో ఆధార్ అనుసంధానం 99.9శాతానికి చేరింది. అనుసంధానం పూర్తయ్యేసరికి పేదలకు మిగిలింది అన్యాయమే.