వనరుల విధ్వంసం.. అసురుల అరాచకత్వం | Aamadalavalasa C/O Sand Mafia | Sakshi
Sakshi News home page

అందినకాడికి దండుకుంటున్నారు..!

Published Thu, Apr 4 2019 2:55 PM | Last Updated on Thu, Apr 4 2019 2:58 PM

Aamadalavalasa C/O Sand Mafia - Sakshi

కొత్తూరు మండలం మాతల ఇసుక ర్యాంపు నుంచి అక్రమంగా ఇసుకను తరలించిన లారీలను పట్టుకున్న పోలీసులు (ఫైల్‌)

సాక్షి, ఆమదాలవలస రూరల్‌ (శ్రీకాకుళం): ఆమదాలవలస మండలం ఇసుక మాఫియాకు కేరాఫ్‌గా నిలుస్తుంది. టీడీపీ పాలనలో సామాన్య ప్రజలకు తగు న్యాయం జరగకపోయినా, టీడీపీ కార్యకర్తలకు మాత్రం మంచి లాభాలు తెచ్చిపెట్టింది. గత పరిపాలనలో ఎన్నడూ లేని విధంగా ప్రకృతి సహజ వనరులను దోచుకుని అక్రమార్జనకు తెరలేపిన ఘనత టీడీపీ నాయకులకి దక్కుతుంది. మండలానికి రెండు వైపులా ఉన్న జీవనదులు వంశధార, నాగావళి నుంచి నిత్యం ఇసుక అక్రమ రవాణా చేస్తే కోట్లాది రూపాయల ఖజానాను కొల్లగొట్టారు. నిరుపేదలు వేలాది రూపాయలు వెచ్చించి ఇసుకను కొనుక్కుంటే గ్రామాల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలు వాటిని అక్రమంగా విశాఖపట్నానికి లారీల ద్వారా ఎగుమతులు చేసుకుని కోట్లు సంపాదించారు.

మండలంలో దూసి, కొత్తవలస, నిమ్మతొర్లాడ, కొరపాం, జీకేవలస, ముద్దాడపేట, తొగరాం, తోటాడ, చెవ్వాకులపేట తదితర ప్రాంతాల నుంచి నాలున్నరేళ్ల పాటు నిత్యం ఇసుక రవాణా చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా కూడా ప్రస్తుతం రాత్రి వేళ నదీతీర గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. దూసి గ్రామంలో ఐదేళ్ల టీడీపీ పరిపాలనలో డ్వాక్రా పేరుతో ఒకసారి ర్యాంపు, విశాఖ అవసరాల పేరుతో రెండు సార్లు ర్యాంపులు నిర్వహించి లారీల ద్వారా ఇతర జిల్లాలకు ఎగుమతి చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుక మాత్రమే కేటాయిస్తే ప్రభుత్వ విప్‌ రవికుమార్‌ అనుచరులు ఏకంగా లక్షల్లో  క్యూబిక్‌ మీటర్ల ఇసుకను దోచుకున్నారు. ఇదే తరహాలో నాగావళి నదీతీర ప్రాంతాల్లో ఉన్న అన్ని గ్రామాల్లో ఇసుక దోపిడీ కోట్ల రూపాయల్లో జరిగింది.

అక్రమ రవాణాతో రోడ్లు నాశనం
టీడీపీ పాలనలో ఇసుక దోపిడీ వల్ల విలువైన రోడ్లు నాశనమైపోయాయి. అనధికార ర్యాంపులు నిర్వహించి ప్రకృతి సంపదను దోచుకున్నారు. ఇసుక దోపిడీపై పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. వాల్టా చట్టానికి విరుద్ధంగా తవ్వకాలు చేసి నదీ గర్భాన్ని కొల్లగొట్టారు. 
– చిగురుపల్లి దశరథ, దూసిపేట, ఆమదాలవలస మండలం

సామాన్యులకు దక్కని ఉచితం
పాలకొండ: ప్రభుత్వ ప్రకటించిన ఉచిత ఇసుక విధానం అధికార పార్టీ నాయకులకు కాసులు కురిపిస్తుంటే సామాన్య, మధ్య తరగతి ప్రజలను అవస్థ పెడుతోంది. ఇసుక ర్యాంపులు ఉన్న సమయంలో రూ.వెయ్యికి దొరికే ట్రాక్టర్‌ ఇసుక ఇప్పుడు రూ.రెండు వేల నుంచి మూడు వేలు పలుకుతుంది. పూర్తిగా నదీ తీర ప్రాంతాలను తమ ఆధీనంలోనికి తీసుకున్న నాయకులు తమ ఇష్టాను రీతిలో ఇసుక ధరను నిర్ణయించి అమ్ముతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. పాలకొండ నియోజకవర్గంలో పాలకొండ, వీరఘట్టం మండలాల పరిధిలో నాగావళి నది, భామిని మండలంలోని వంశధార నది నుంచి నిత్యం ఇసుక అక్రమ రవాణా దర్జాగా సాగుతుంది.

మండలంలోని అంపిలి, గోపాలపురం, మంగళాపురం, యరకరాయపురం గ్రామాలు, వీరఘట్టం మండలంలోన తలవరం, నందివాడ, చిదిమి, కడకెల్ల. బామిని మండలంలోని సింగిడి, బత్తిలి ప్రాంతాల నుంచి నిత్యం ఇసుక రవాణా జరుతుంది. ప్రధానంగా జిల్లాకు చెందిన మంత్రి అండదండలతో అధికారపార్టీ నాయకులు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. నదిలో అక్రమంగా ఇసుక ర్యాంపులు వేసి ఇసుకను అమ్ముకుంటున్నారు. వాస్తవంగా అధికారికంగా ర్యాంపులు ఉంటే ఇసుక ట్రాక్టర్‌కు ర్యాంపులో రూ.400 చెల్లించి ట్రాక్టర్‌ యజమానులు స్థానికంగా రూ. వెయ్యికి అమ్మేవారు. ప్రస్తుతం ర్యాంపుల వద్ద ఇసుక ట్రాక్టర్‌ నుంచి రూ.వెయ్యి వసూళ్లు చేస్తున్నారు.

దీంతో ట్రాక్టర్‌ ఇసుక రూ.రెండు వేలు నుంచి మూడు వేలు వరకూ చెల్లించాల్సి వస్తోందని గృహనిర్మాణ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఇసుక తవ్వకాలు ఉండే చోట్ల ఇతర పనులకు కూలీలు దొరకడం లేదు. నియోజకవర్గం నుంచి ప్రతి రోజూ 150 నుంచి 200 ట్రాక్టర్లు, 20 నుంచి 30 లారీలు రోజూ ఇసుక తీసుకెళ్తుంటాయి. ఈ ప్రాంతానికి చెందిన మంత్రి అండతో ఇక్కడ ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఈ ఐదేళ్ల కాలంలో రూ.50 కోట్ల మేర విలువ చేసే ఇసుకను ఇక్కడ నుంచి తరలించి జేబులు నింపుకున్నారు.

సిమెంట్‌ ధరతో సమానం
ఇసుక ఉచితం అన్నారు. ఇక్కడ మాత్రం ఇసుక దొరకడమే కష్టంగా మారింది. సిమెంట్‌ ధరతో ఇసుక ధర పోటీ పడుతోంది. ట్రాక్టర్‌ ఇసుక మూడువేలు అవుతోంది. ఇంకా నిర్మాణాలు ఎలా సాధ్యమవుతాయి. సొంతంగా నది నుంచి నాటుబండితో ఇసుక తెచ్చుకోవాలన్నా డబ్బులు కట్టాల్సి వస్తుంది.
కె.ప్రసాదరావు, గృహ నిర్మాణ దారు, రుద్రిపేట

రేగిడి కేరాఫ్‌ ఇసుక దందా
రాజాం : రేగిడి అక్రమ ఇసుక రవాణాకు కేరాఫ్‌గా మారింది. గతంలో రీచ్‌లు మంజూరైనా ఇసుకాసురులు సొంత రీచ్‌లు కనుక్కుని వాటిలో తవ్వకాలు సాగిస్తూ ప్రజాధనం దోచుకుంటున్నారు. రాజాం పట్టణం కేంద్రంగా రేగిడి, వంగర మండలాల నుంచి నాగావళి నదీ తీరం నుంచి ఇసుక అక్రమ రవాణా అధికంగా జరుగుతోంది. రాష్ట్ర మంత్రి ఇలాకాలో ఇలా అక్రమ రవాణా జరగడంతో పలువురు అధికార పార్టీనేతలపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ప్రధానంగా రేగిడి మండలంలో రేగిడి, తునివాడ, బొడ్డవలస ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇసుక పోగులు వేశారు. వీటిని లారీలతో రాత్రి సమయాల్లో తరలించి కోట్లు దండుకున్నారు.

ఒక్కో లారీ ఇసుక ధర రూ. 25 వేలు దాటి పలుకుతోంది. వీటితో పాటు ఇసుక ట్రాక్టర్లతో రాజాం మీదుగా ఇతర ప్రాంతాలకు పట్టపగలే తరలిస్తుంటారు. ఇటీవల ఈ ఇసుక అక్రమ రవాణాతో పాటు నిల్వలపై మైన్స్, విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించి సీజ్‌ చేసినా ఇప్పటికీ ఇసుక అక్రమ రవాణా ఆగకపోవడం శోచనీయం. వంగర మండలంలో సువర్ణముఖి, వేగావతి నదులతో పాటు నాగావళి నదీ తీర ప్రాంతాల్లో కూడా ఇసుక అక్రమ రవాణా ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా ఆయా గ్రామాల్లో అధికార పార్టీ కార్యకర్తలు ఇసుక అక్రమ రవాణాకు అండగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సంతకవిటి మండలంలో మేడమర్తి, తమరాం, పోడలి సమీప ప్రాంతాల వద్ద నాగావళి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.

అక్రమ మార్గంలో..
నాగావళి తీరం నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అధికంగా రేగిడి మండలం నుంచి ఇక్కడకు వస్తుంది. ఒక్కో ట్రాక్టర్‌ ఇసుక ధర రూ. 2 వేలు పలుకుతుంది. గతంలో మా మండలంలో ఇసుకరీచ్‌ ఉండేది. ట్రాక్టర్‌ ఇసుకలోడ్‌ రూ. 600లకు వచ్చేది. ఇప్పుడు అమాంతంగా ధర పెరిగింది. ఇంటి నిర్మాణాలు చేయలేని పరిస్థి«తి ఉంది. 
– బురావెల్లి కృష్ణ, చింతలపేట, సంతకవిటి మండలం

కాసుల వేట
ఎల్‌.ఎన్‌.పేట, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం: పాతపట్నం నియోజకవర్గంలోని ఎల్‌ఎన్‌పేట, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం మండలాలు ఇసుక అక్రమ రవాణాదారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఎల్‌ఎన్‌ పేట మండలంలోని దబ్బపాడు, బసవరాజుపేట, స్కాట్‌పేట రేవుల్లో ఇసుక వ్యాపారం ఐదేళ్లు యథేచ్ఛగా సాగింది.  కొత్తూరు మండలంలోని కుంటిభద్ర, మాతలతో పాటు పలు గ్రామాల్లో పంట పొలాల్లో ఇసుక మేట్లు వేశాయి. అయితే పంట పొలాల్లో ఇసుక మేట్లు తొలగించేందుకు టీడీపీ నేతలు అధికారాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకు వచ్చారు.

అయితే పంట పొలాల్లో ఇసుక నాణ్యత లేకపోవడంతో పంట పొలాలకు ఆనుకొని ఉన్న మరో చోట నుంచి ఇసుక తవ్వకాలు చేస్తూ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యే స్వగ్రామం మాతలకు చెందిన రైతులు పంట పొలాల్లో ఇసుక మేట్లు తొలగించేందుకు అనుమతులు తీసుకువచ్చి నదిలో తీసుక తీసి రూ.కోట్లు దండుకున్నారు. పొన్నుటూరు, మదనాపురం, సోమరాజపురం, అంగూరు, ఆకులతంపర, బంకి లతో పాటు పలు గ్రామాల్లో ఆలయాలు నిర్మాణం  ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు.

ఉచితం ముసుగులో..
ఎచ్చెర్ల క్యాంపస్‌: ఎచ్చెర్ల నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. ఇక్కడ ఒక్క రీచ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదు. కానీ ఎచ్చెర్ల మండలంలోని తమ్మినాయుడుపేట, పొన్నాడ, బొంతలకోడూరు ప్రాంతాల్లో నాగావళి నదిలో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. తమ్మినాయుడుపేట, పొన్నాడ పంచాయతీ ముద్దాడపేట, పాతపొన్నాడ  వంటి రీచ్‌లపై 24 గంటలు పర్యవేక్షణ బృందాల నిఘా ఉంది. అయినా ఇసుక రవాణా ఆగడం లేదు. ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలించి జాతీయ రహదారికి ఆనుకొని చిలకపాలేం, అల్లినగరం, ఎస్‌ఎస్‌ఆర్‌ పురం, వంటి ప్రాంతాల్లో పోగులు వేస్తున్నారు.

వాటిని రాత్రిపూట విశాఖ తరలిస్తున్నారు. లావేరు మండలం బుడుమూరు ఊట గడ్డ నుంచి సైతం ఇసుక అక్రమంగా తరలిపోతోంది. రణస్థలం మండలంలోని కొచ్చర్ల, దోణుపేట, కొవ్వాడ, ఎచ్చెర్ల మండలం కుప్పిలి, బుడగుట్లపాలేం వంటి ప్రాంతాల్లో సముద్రపు ఇసుకతో ఇసుక కలిపి కల్తీ చేసి మరీ ఇసుక విక్రయిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండ లేకపోతే మరీ ఇంతగా బరితెగించడం సాధ్యం కాదని, వారి కనుసన్నల్లోనే ఈ తంతు జరుగుతోందని స్థానికులంటున్నారు.

ఉచితం ముసుగులో దోపిడీ 
ఉచితం ముసుగులో ఇసుక దోపిడీ జరుగుతోంది. ఇసుక కోసం పేదలు ఇబ్బంది పడుతున్నారు. ఇళ్ల నిర్మాణానికి రూ.వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. 
– కింతలి ఈశ్వరరావు, ఎస్‌ఎం పురం

కోట్లలో దోపిడీ
నరసన్నపేట: మండల పరిధిలోని వంశధార నది టీడీపీ నాయకులకు కాసులు కురిపిస్తోంది. అనుమతులు దాటి, నిబంధనలు ధిక్కరించి, ఉచిత ఇసుక విధానాన్ని వెక్కిరిస్తూ వీరి దోపిడీ సాగుతోంది. ఇక్కడ ఇసుక పేరుకే ఉచితం.. ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ట్రాక్టర్‌ ఇసుక రూ. 1500 పైమాటే. ఉచిత విధానాన్ని అడ్డు పెట్టుకొని వంశధార నది నుంచి లక్షల క్యూబిక్‌ మీటర్లు ఇసుకను దోచుకువెళ్లారు. విశాఖ, గుం టూరు, రాజమండ్రి ఇలా ఇతర ప్రాంతాలకు చెందిన టీడీపీ నాయకులతో స్థానిక నేతలు చేతులు కలిపి నాలుగేళ్లుగా పెద్ద ఎత్తున ఇసుక దందా నిర్వహించారు. దీంతో వంశధార తీరం బోసిపోతోంది.

మండల పరిదిలో గోపాలపెంట, బుచ్చిపేట, చేనులవలస, పోతయ్యవలస, లుకలాం, వెంకటాపురాల్లో ఇసుక దందా అధికంగా జరిగింది. ప్రధానంగా లుకలాం, మడపాం, గోపాలపెంట, బుచ్చిపేటలకు చెందిన టీడీపీ నాయకులు బాగా లాభపడ్డారు. అధికా రుల బలం చూసుకొని ఈ గ్రామాల్లో టీడీపీ నాయకులు పెద్ద లాబీయింగ్‌ చేసి ఇసుక పేరున బాగా వెనకేసుకున్నారు. వీరికి నియోజకవర్గ టీడీపీ పెద్దలు కూడా వత్తాసు పలకడంతో వీరి ఇసుక దోపిడీకి అడ్డే లేకుండా పోయింది. 

జిల్లా కేంద్రానికి సమీపంలో..
శ్రీకాకుళం రూరల్‌: జిల్లా కేంద్రానికి సమీపంలో నూ ఈ దందా జోరుగా సాగుతోంది. ఆటు ఆమదాలవలస, ఇటు నరసన్నపేట నియోజకవర్గా ల సరిహద్దుల్లో ఇసుకను ఇష్టానుసారంగా రవాణా చేస్తున్నా రు. ఇక జన్మభూమి కమిటీ సభ్యులు ఉచిత ఇసుక పేరిట ఇష్టానుసారంగా ఒక్కో లారీ నుంచి రూ.15 నుంచి 20 వేలు లోపు వసూళ్లకు పాల్పడుతున్నారు. మండలంలోని ఎక్కడా ఉచిత ఇసుక ఇచ్చే దాఖలాలు మాత్రం కనిపించడం లేదు.

తట్టెడు ఇసుక తీయలేదు
వంశధార వరదల కారణంగా పదేళ్ల కిందట కుంటిభద్రకు చెందిన పొలాల్లో ఇసుక మేట్లు వేశాయి. ఈ మేట్లను తొలగించేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే గ్రామానికి చెందిన ఓ నేత ఈ మేట్లను రికార్డుల్లో చూపిస్తూ నదిలో నుంచి అక్రమంగా తీసుక తీసుకెళ్తున్నారు. నాకు చెందిన సుమారు 4 ఎకరాల్లో ఇసుక మేట్లు వేశాయి. ఈ పొలాల్లో నుంచి ఒక తట్టెడు ఇసుక తీయలేదు.             – - అగతమూడి నాగేశ్వరరావు, రైతు, కుంటిభద్ర 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

రేగిడి మండలం తునివాడ వద్ద నాగావళి నదిలో అక్రమంగా తవ్వుతున్న ఇసుక

2
2/4

కొత్తూరు: వంశధార నది నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక

3
3/4

తమ్మినాయుడుపేట రీచ్‌ నుంచి అక్రమ ఇసుక రవాణా

4
4/4

అంపిలి సమీపంలో అక్రమంగా ఏర్పాటు చేసిన ఇసుక ర్యాంపు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement