సొంత యూనియన్ ఏర్పాటుకి టీడీపీ పన్నాగం
పార్టీ సానుభూతి పరులతో పావులు కదుపుతున్న ప్రభుత్వం
బెదిరింపులతో దారికి తెచ్చుకునే ప్రయత్నం
కొవ్వూరు :టీడీపీ అనుబంధ ట్రేడ్ యూనియన్‌ను బలోపేతం చేసుకునేందుకు అంగన్‌వాడీల యూనియన్‌ను చీల్చేందుకు సర్కారు కొత్త ఎత్తుగడ వేసింది. దీనిలో భాగంగా జిల్లాలో బలంగా ఉన్న సీఐటీయూ యూనియన్‌ని విచ్ఛిన్నం చేయాలని చూస్తోంది. ఇందుకోసం విజయవాడ ఆందోళనలో పాల్గొన్న అంగన్‌వాడీలను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తామని బెదిరింపులకు పాల్పడుతోంది. ఇప్పటికే జిల్లాలో ఆయా ప్రాజెక్టుల పరిధిలో ఆందోళనలో పాల్గొన్న వారి వివరాలను సీడీపీవోలు జిల్లా ప్రాజెక్టు అధికారికి నివేదికలు పంపించారు.
జిల్లా వ్యాప్తంగా 3,889 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో వేలమంది కార్యకర్తలు, ఆయాలు పనిచేస్తున్నారు. వీరిలో సుమారు 2 వేల మందికి పైగా ఆందోళన కార్యక్రమానికి తరలివెళ్లినట్టు చెబుతున్నారు. వీరందరికి నోటీసులు ఇవ్వడం ద్వారా భయపెట్టేందుకు రంగం సిద్ధమైనట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. అయితే యూనియన్ ఏర్పాటుకి ఎక్కడా స్పందన కనిపించడం లేదు. జిల్లాలో 18 ప్రాజెక్టులున్నప్పటికీ ఒక్కో ప్రాజెక్టు పరిధిలో పది నుంచి 20 మందికి మించి మద్దతుదారులు ముందుకు రాలేదని చెబుతున్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో అంగన్‌వాడీలు, సీడీపీవోలపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొవ్వూరు, దెందులూరు నియోజవర్గాల్లో ఈ ప్రక్రియకి శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు. ఇటీవల జిల్లాలో ఆరవై ఏళ్లు పైబడిన 60 మంది కార్యకర్తలు, 377 మంది ఆయాలను తొలగించారు. వీరి స్థానంలో వచ్చే కొత్తవారిని కూడా తమకి అనుకూలంగా మలుచుకునేందుకు సర్కారు యోచిస్తోందని చెబుతున్నారు
మహిళా సంఘం నేతకు ఉభయ గోదావరి బాధ్యత
జిల్లాలో కొయ్యలగూడేనికి చెందిన టీడీపీ మహిళా విభాగం నేతకి ఉభయ గోదావరి జిల్లాల అంగన్‌వాడీ కార్యకర్తల సమన్వయ కర్త బాధ్యత అప్పగించారు. యూనియన్ ఏర్పాటులో భాగంగా ఇప్పటివరకు రెండుసార్లు ఆమె కొయ్యలగూడెంలో అంగన్‌వాడీలతో సమావేశం నిర్వహించినా ఆశించిన స్థాయి స్పందన లభించలేదు. దీంతో జీతాల పెంపు జీవో ఇప్పిస్తామని ఆశపెడుతున్నట్టు చెబుతున్నారు. అదీ కుదరని పక్షంలో అంగన్‌వాడీ కేంద్రాలపై అధికారులతో దాడులు చేయించి దారిలోకి తెచ్చుకునే యత్నం చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
అంగన్‌వాడీలను చీల్చే కుట్ర..?
Published Thu, Dec 31 2015 12:51 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement