గుండె శస్త్ర చికిత్స ధరలపై ఆరోగ్యశ్రీ సీఈఓ హామీ | Aarogyasri CEO assurances on Heart surgery prices | Sakshi
Sakshi News home page

గుండె శస్త్ర చికిత్స ధరలపై ఆరోగ్యశ్రీ సీఈఓ హామీ

Published Thu, Aug 22 2013 5:02 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM

గుండె శస్త్ర చికిత్స ధరలపై ఆరోగ్యశ్రీ సీఈఓ హామీ

గుండె శస్త్ర చికిత్స ధరలపై ఆరోగ్యశ్రీ సీఈఓ హామీ

సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ పరిధిలో జరుగుతున్న గుండె శస్త్రచికిత్సల (యాంజియోప్లాస్టీ) ధరలపై పునఃపరిశీలన చేస్తామని ఆరోగ్యశ్రీ సీఈఓ ధనుంజయరెడ్డి ప్రకటించారు. గతంలో యాంజియోప్లాస్టీకి రూ. 60 వేలుగా ఉన్న ధరను జూన్ 28 నుంచి రూ. 40 వేలకు కుదించడంతో ఐదు రోజులుగా హృద్రోగ నిపుణులు గుండె శస్త్రచికిత్సలను నిలిపేసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా గుండె శస్త్రచికిత్సలు నిలిపేస్తున్నట్టు హృద్రోగ నిపుణులు ప్రకటించడంతో ఎట్టకేలకు ఆరోగ్యశ్రీ సీఈఓ స్పందించారు. బుధవారం ఆరోగ్యశ్రీ భవన్‌లో ఏపీ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (అప్నా), ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా), కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్‌ఐ) ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ సీఈఓ ధనుంజయరెడ్డి చర్చలు జరిపారు.
 
 చర్చల సందర్భంగా గుండె శస్త్రచికిత్సల ధరలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులతో కమిటీని ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీ ధరలపై పరిశీలన జరిపి సెప్టెంబర్ 20లోగా నివేదిక ఇస్తుందని ఆయన చెప్పారు. దీంతో అప్నా, ఆశా, సీఎస్‌ఐ వైద్యులు గుండె శస్త్రచికిత్సలను యాథావిధిగా కొనసాగించేందుకు అంగీకరించారు. 2013 జూన్ 28కి ముందు ఈ శస్త్రచికిత్సలకు రూ. 60వేలు ఉండేదని, ఈ ధరకు మరో 30 శాతం అధికంగా ఇవ్వాలని, అంటే రూ.78 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ సీఈఓ నుంచి హామీ వచ్చిన తర్వాతే గుండె శస్త్రచికిత్సలు కొనసాగించేందుకు అంగీకరించారు. సీఎస్‌ఐ అధ్యక్షుడు డా. కల్నల్ సీతారాం పేర్కొన్నారు. ఈ చర్చల్లో ఆశా సంఘం తరఫున డా. భాస్కరరావు, డా. గోవింద్ హరి, అప్నా సంఘం తరఫున డా. నర్సింగ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గురువారం నుంచి అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో యథావిధిగా గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్టు చర్చల అనంతరం మూడు సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. కమిటీ ఇచ్చే నివేదికలో ధరల్లో మార్పు లేకపోతే తదనుగుణంగా తాము నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
 
 వైద్యశాఖలో మరో ఆర్నెల్లు ‘ఎస్మా’ పొడిగింపు
 సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖలో ‘ఎస్మా’ కాలపరిమితిని ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జూనియర్ డాక్టర్లతోపాటు పీజీ వైద్యవిద్యార్థులు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, సీనియర్ వైద్యులు అందరూ ఎస్మా పరిధిలోనే ఉంటారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ‘ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్-1971’(ఎస్మా) ప్రకారం సమ్మెలను నిషేధించినట్లు తెలిపారు. ఈ నిషేధం గురువారం నుంచి ఆరు మాసాలపాటు అమల్లో ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement