జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న ఆశవర్కర్లు
శ్రీకాకుళం అర్బన్: ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని ఆశ వర్కర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశవర్కర్ల సంఘ నాయకులు చలో డీఎంహెచ్‌వో కార్యక్రమానికి సోమవారం పిలుపునిచ్చారు. ఈ పిలుపునందుకున్న వందలాది మంది జిల్లా కేంద్రానికి వచ్చేందుకు బయలుదేరగా మార్గమధ్యలో పోలీసులు అడ్డుకొని పలువురిని అరెస్టు చేశారు. అయితే కొంతమంది మాత్రం జిల్లా కేంద్రానికి చేరుకొని డీఎంహెచ్‌వో కార్యాలయాన్ని ముట్టడించి.. ధర్నా చేశారు. ఓ దశలో కార్యాలయం లోపలికి వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా భారీగా మోహరించి ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.ఆదిలక్ష్మి, కె.నాగమణిలు మాట్లాడుతూ..
చంద్రబాబు ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఆశవర్కర్లతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న ప్రభుత్వం పనికితగ్గ వేతనం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల విజయవాడలో ఆశవర్కర్లకు నెలకు రూ. 8,600 ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. అయితే అంత ఇవ్వకుండా అందులో కోతవిధిస్తూ జీవో జారీ చేసి మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవవేతనంలో కోతలేకుండా రూ.8,600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా ఆశ వర్కర్లను మోసగించాలని చూస్తే చంద్రబాబు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. తమ న్యాయమైన డిమాండ్ పరిష్కారం కోసం పోరాడుతుంటే జిల్లా వ్యాప్తంగా అనేకచోట్ల కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వారు ఖండించారు. ఇటువంటి అణచివేత చర్యలకు భయపడేదిలేదన్నారు. తమకు న్యాయం జరిగే వరకూ ఎంతటి పోరాటానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి చెంచయ్యను కూడా కలిసి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ డివిజనల్ కార్యదర్శి టి.తిరుపతిరావు, ఆశ సంఘ నాయకులు స్వప్న, కల్పన, దమయంతి, అమర, రాజ్యలక్ష్మి, గీత, కాంతమ్మ, సుధ, శ్రీదేవి, మహలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అరెస్టుల పర్వం
జిల్లా వ్యాప్తంగా అశ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఆమదాలవలస నియోజకవర్గంలో ఆశ కార్యకర్తలను శ్రీకాకుళం వెళ్లనీయకుండా వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పొందూరులో 20 మందిని, ఆమదాలవలసలో 35 మందిని అరెస్ట్ చేశారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు. నరసన్నపేటలో 27 మందిని, జలుమూరులో ఇద్దరు, సారవకోటలో 8 మందిని, వీరఘట్టం మండలంలో 11 మందిని అరెస్టు చేశారు. రాజాం మండలంలో ఆశ కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. తమ హక్కుల సాధన కోసం జిల్లా కేంద్రంలో నిరసన తెలిపేందుకు వెళ్తున్న వీరిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో యూనియన్ అధ్యక్షులు కె.తులసిరత్నంతోపాటు భాగ్యవతి, గౌరి, సీతారత్నం, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి సీహెచ్ రామ్మూర్తినాయుడు ఉన్నారు. టెక్కలి నియోజకవర్గంలోని టెక్కలిలో 18 మందితోపాటు సీపీఎంకు చెందిన నాయకులు నంబూరు షణ్ముఖరావు, పోలాకి ప్రసాదరావును పోలీసులు అరెస్టు చేశారు. అలాగే కంచిలిలో ఆరుగురు, సోంపేటలో 8 మందిని అరెస్టు చేశారు.
హామీ అమలు చేయాలి
ఆశ వర్కర్లకు రూ.3 వేలు వేతనం, రూ.5,600 వరకూ పారితోషకం ఇస్తామని చెప్పారు. పనికి తగ్గ వేతనం మాత్రం అందడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన జీవోనే అమలు చేయలేదు. ఒకచేతితో ఇచ్చి మరో చేతితో లాక్కున్నట్లుంది. ఇచ్చిన హామీ మేరకు వెంటనే పారితోషకాలు చెల్లించాలి. – కె.నాగమణి, ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment