దేశ రాజధానికి తాడేపల్లిగూడెం, ఏలూరు నుంచి ఏసీ రైలులో ప్రయాణించే అవకాశం వచ్చింది. విశాఖ-ఢిల్లీ మధ్య ప్రయూణించే ఏపీ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కింది. బుధవారం ఉదయం విశాఖలో ప్రారంభమైన రైలు మధ్యాహ్నం 1.10 గంటలకు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌లో అడుగుపెట్టింది. ఈ రైలు బుధ, గురు, ఆదివారం రోజుల్లో ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. బుధ, శుక్ర, సోమవారాల్లో ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణమవుతుంది. తాడేపల్లిగూడెం, ఏలూరు రైల్వే స్టేషన్లలో దీనికి హాల్ట్ ఇచ్చారు. విశాఖలో ఉదయం 7.45కు బయలుదేరి ఉదయం 11.40 గంటలకు తాడేపల్లిగూడెం వస్తుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.12 గంటలకు తాడేపల్లిగూడెం చేరుకుంటుందని స్టేషన్ సూపరింటెండెంట్ కె.నాగభూషణం తెలిపారు.
తాడేపల్లిగూడెం : ఉదయం భోజనం చేసి.. హాయిగా రెలైక్కి.. శీతల గాలులను ఆస్వాదిస్తూ .. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని అందాలను వీక్షిస్తూ .. మరునాడు రాత్రికి ఢిల్లీలో వాలిపోవచ్చు. చాలాకాలంగా ఆశల పల్లకిలో ఊరేగిస్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ కల సాకారమైంది. విశాఖపట్నం-న్యూఢిల్లీ మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ (22415) బుధవారం మధ్యాహ్నం 1.10 గంట లకు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌కు వచ్చింది. కొత్త రైలుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జెండా ఊపి స్వాగ తం పలికారు.
కొత్త రైలు నేపథ్యమిదీ
ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరిట హైదరాబాద్-న్యూఢిల్లీ మధ్య తిరుగుతున్న రైలు రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మారనుంది. దీంతో విశాఖ నుంచి న్యూఢిల్లీ వరకు బుధవారం ప్రయోగాత్మకంగా ఈ రైలును ప్రారంభించారు. విశాఖపట్నం నుంచి సుమారు 36 గంటల పాటు ప్రయాణం చేసి ఢిల్లీ చేరుకోవచ్చు. 2,100 కిలోమీటర్ల దూరాన్ని గంటకు సరాసరి 58 కిలోమీటర్ల వేగంతో ఏపీ ఎక్స్‌ప్రెస్ చేరుకుంటుంది. ఈ రైలు విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, రామగుండం, సిర్పూ కాగజ్‌నగర్, బల్లార్షా, చంద్రపూర్, నాగపూర్, ఇటార్చి, భోపాల్, ఝూన్సీ, గ్వాలియర్, ఆగ్రా మీదుగా ఢిల్లీ చేరుకుటుంది.
అన్నీ ఏసీ బోగీలే
ఈ రైలులో ప్రస్తుతానికి 14 బోగీలుంటాయి. అన్నీ ఏసీ బోగీలే. ఏ-1 నుంచి ఫస్ట్‌క్లాస్, ఏ-1 నుంచి ఏ-5 వరకు సెకండ్ క్లాస్, బీ-1 నుంచి బీ-7 వరకు థర్డ్‌క్లాస్‌బోగీలు ఉంటాయి. వీటితోపాటు రైలుకు సంబంధించిన బోగీ ఒకటి ఉండే అవకాశం ఉంది. థర్డ్ ఏసీ బోగీలో 64 మంది ప్రయాణికులు, సెకండ్ క్లాస్ ఏసీ బోగీలో 52 మంది ప్రయాణం చేయవచ్చు. విశాఖ నుంచి న్యూఢిల్లీకి ఫస్ట్ క్లాస్ టికెట్ ధర రూ.5,070, సెకండ్ క్లాస్ చార్జీ రూ.2,935, థర్డ్ క్లాస్ చార్జీ రూ.2 వేలు. ఇవికాకుండా బెడ్ రోల్ చార్జీల కింద సీటుకు రూ.45 వసూలు చేస్తారు. తాడేపల్లిగూడెం నుంచి ఫస్ట్‌క్లాస్ చార్జీ రూ.4,710, సెకండ్ క్లాస్ రూ.2,730, థర్డ్ క్లాస్ చార్జీ రూ.1,870.
డైలీగా మారుతుంది
ప్రస్తుతానికి వారానికి మూడు రోజులు మాత్రమే తిరిగే ఈ రైలు రాబోయే రోజుల్లో డైలీ సర్వీస్‌గా మారుతుందని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. రైలుకు స్వాగతం పలికిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలో భాగంగా వాల్తేరు డివిజన్ ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందన్నారు. వాల్తేరు డివిజన్ ఏర్పా టైతే ప్రయాణికుల సమస్యలు తొలగడంతోపాటు, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. కాకినాడ-కోటిపల్లి, కోటిపల్లి-నరసాపురం, కొవ్వూరు-భద్రాచలం రైల్వే లైన్ల ఏర్పాటుతోపాటు విజయవాడ-గుడివాడ, భీమవరం-నిడదవోలు లైన్ల డబ్లింగ్ పనుల విషయమై త్వరలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కంచుమర్తి నాగేశ్వరరావు, యెగ్గిన నాగబాబు, కోట రాంబాబు, అయినపర్తి శ్రీదేవి, ఖండభట్టు శ్రీనివాసరాజు, కొండపల్లి నగేష్, పసుపులేటి నాగేశ్వరావు పాల్గొన్నారు.
ఏపీ బండి.. పట్టాలెక్కిందండి
Published Thu, Aug 13 2015 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 7:19 AM
Advertisement
Advertisement