ఎమ్మార్వో కార్యాలయాల్లో ఏసీబీ మెరుపు దాడులు | ACB Attack On MRO Offices | Sakshi
Sakshi News home page

ఎమ్మార్వో కార్యాలయాల్లో ఏసీబీ మెరుపు దాడులు

Published Sat, Jan 25 2020 4:02 AM | Last Updated on Sat, Jan 25 2020 4:02 AM

ACB Attack On MRO Offices - Sakshi

అనంతపురం జిల్లా ముదిగుబ్బ తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు

సాక్షి, అమరావతి: అవినీతిని సమూలంగా నిర్మూలించాలన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మండల రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక బృందాలు శుక్రవారం మెరుపుదాడులు నిర్వహించాయి. రాష్ట్రంలో 250 ఎమ్మార్వో కార్యాలయాలను ఎంపిక చేసుకున్న ఏసీబీ అప్పటికప్పుడు 20 తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఏక కాలంలో తనిఖీలు చేపట్టడం గమనార్హం. తహసీల్దార్‌ కార్యాలయాల్లో బీరువాలు, టేబుల్‌ సొరుగులు, సిబ్బంది బ్యాగులను ఏసీబీ అధికారులు క్షుణ్నంగా సోదాలు చేశారు. కంప్యూటర్లు, రికార్డులను పరిశీలించారు. ఎమ్మార్వో కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చిన ప్రజలను అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీసి వివరాలు సేకరించారు. 

రెవెన్యూ సేవలపై ఆరా..
చిత్తూరు జిల్లా వడమాలపేట, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి, కృష్ణా జిల్లా అవనిగడ్డ, తోట్లవల్లూరు, గుంటూరు జిల్లా నాదెండ్ల, భట్టిప్రోలు, మాచర్ల, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం, పెదపూడి, ప్రకాశం జిల్లా పొన్నలూరు, శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల, కొత్తూరు, విజయనగరం జిల్లా వేపాడ, విశాఖపట్నం జిల్లా భీమిలి, సబ్బవరం, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట, కావలి, వైఎస్సార్‌ జిల్లా బ్రహ్మంగారి మఠం, అనంతపురం జిల్లా ముదిగుబ్బ, కర్నూలు జిల్లా కల్లూరు ఎమ్మార్వో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు జరిగాయి. తనిఖీల్లో రెవెన్యూ సిబ్బంది వద్ద లెక్కల్లో చూపని రూ.4 లక్షలను ఏసీబీ అధికారులు గుర్తించారు. మీకోసం కార్యక్రమంలో వచ్చిన అర్జీలు, భూ రికార్డులు, పాస్‌ పుస్తకాలు ఎంతవరకు పరిష్కరించారు? పెండింగ్‌ ఫిర్యాదులను పరిష్కరించకపోవటానికి కారణాలు ఏమిటి? అనే వివరాలను ఏసీబీ అధికారులు సేకరించారు. రెవెన్యూ కార్యాలయాల్లో ప్రజలకు అందుతున్న సేవలు, పనులు ఎక్కడైనా లంచాలు డిమాండ్‌ చేస్తున్నారా? అనే అంశాలపై ఆరా తీశారు. 

విచారణ కొనసాగిస్తాం...
రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 20 చోట్ల తహసీల్దార్‌ కార్యాలయాల్లో సోదాలు జరిపి రూ.4 లక్షల మేర అనధికారిక సొమ్మును గుర్తించినట్లు ఏసీబీ డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు మీడియాకు తెలిపారు. ‘రైతులు టైటిల్‌ డీడ్, ఈ–పాస్‌బుక్‌ కోసం చేసుకున్న దరఖాస్తులను కారణం చూపకుండానే డిప్యూటీ తహసీల్దార్‌లు, వీఆర్‌వోలు పెండింగ్‌లో పెడుతున్నారు. పలుచోట్ల దరఖాస్తులను కారణాలు చూపకుండానే తిరస్కరిస్తున్నారు. ఎమ్మార్వో కార్యాలయాల్లో ఉద్యోగులకు సంబంధించి మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌ లాంటి రికార్డులను నిర్వహించడం లేదు. కొందరు తహసీల్దార్‌లు అధికారిక పనుల కోసం రెవెన్యూ శాఖకు సంబంధంలేని బయటి వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నారు. రెవెన్యూ శాఖలో అక్రమాలపై ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను కనీసం ప్రాథమికంగా విచారించకుండానే తహసీల్దార్‌ కార్యాలయాల్లో పెండింగ్‌లో పెడుతున్నారు. రికార్డులను స్వాధీనం చేసుకుని విచారణ కొనసాగిస్తాం’ అని ఏసీబీ డీజీ తెలిపారు.

సీఎం ఆదేశాలతో రంగంలోకి..
అవినీతిని నిర్మూలించాలని, ప్రజలకు సత్వర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల ఏసీబీపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ గట్టిగా సూచించారు. అవినీతిని అంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 14400 టోల్‌ఫ్రీ నెంబర్‌ను కూడా ఏర్పాటు చేయడం తెలిసిందే. ఏసీబీ డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అత్యధిక ఫిర్యాదులు అందుతున్న ప్రభుత్వ శాఖలను గుర్తించి దాడులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 10వతేదీన రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ పలు అక్రమాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించింది. తాజాగా ఎమ్మార్వో కార్యాలయాల్లో సోదాలు జరిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement