కరీంనగర్ క్రైం : భూమి సర్వే చేసిన నివేదిక ఇచ్చేందుకు రైతు నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడో రెవెన్యూ సర్వేయర్. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ కథనం ప్రకారం... జిల్లాకేంద్రంలోని భగత్‌నగర్‌లోని వెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్న గబ్బు జాదవ్ మానకొండూర్ మండల సర్వేయర్‌గా 2012 నుంచి పనిచేస్తున్నాడు.
ఈదులగట్టెపల్లికి చెందిన తీర్థాల కుమార్ అనే రైతుకు గ్రామశివారులోని 542, 543 సర్వనంబర్లలో వ్యవసాయ భూమి ఉంది. తన భూమిని సర్వే చేయమని మార్చిలో రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. నిబంధనల ప్రకారం రుసుము కూడా చెల్లించాడు. సదరు భూమిని 15 రోజుల క్రితమే సర్వే చేసిన జాదవ్... నివేదిక ఇచ్చేందుకు రూ.5 వేలు డిమాండ్ చేశాడు. తాను పేదవాడినని డబ్బులు ఇచ్చుకోలేనని కుమార్ పలుమార్లు విన్నవించినా పట్టించుకోకుండా డబ్బులు ఇస్తేనే నివేదిక ఇస్తానని తేల్చిచెప్పాడు.
వేధింపులు భరించలేని కుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి పథకం ప్రకారం మంగళవారం ఉదయం జాదవ్‌కు రైతు ఫోన్ చేయగా కరీంనగర్‌లోని ఇంటికి రమ్మని చెప్పాడు. జాదవ్ ఇంటి వద్ద కుమార్‌నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.5 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ సీఐ విజయ్‌కుమార్ మానకొండూర్ తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి బాధితుడి భూ వివరాల దరఖాస్తు, పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని బుధవారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని డీఎస్పీ తెలిపారు.
అయినా మారలేదు
మానకొండూర్ మండల తహశీల్దార్ రాంబాబు సెప్టెంబర్ 24న ఓ రైతు నుంచి డబ్బులు తీసుకుంటూ తిమ్మాపూర్ మండలం అల్గునూర్ వద్ద ఏసీబీకి చిక్కాడు. తహశీల్దార్ పట్టుబడిన సమయంలో మానకొండూర్ మండల వాసులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అదే మండలంలో సర్వేయర్‌గా చేస్తున్న జాదవ్... ఉన్నతాధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నా తన ధోరణిలో మార్పుతెచ్చుకోలేదని మండలవాసులు పేర్కొంటున్నారు.
ఏసీబీకి చిక్కిన సర్వేయర్
Published Wed, Dec 17 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM
Advertisement
Advertisement