ఏసీబీ వలలో టీటీడీ డీఈఈ
- రూ.30 వేలతో పట్టించిన కాంట్రాక్టర్
రాజమండ్రి: ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఐదు జిల్లాల అధికారి) రామకృష్ణారావు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు బుధవారం చిక్కారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ రామచంద్రరరావు విలేకరులకు వెల్లడించారు. ఆయ న కథనం ప్రకారం..టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 8న శ్రీకాకుళం జిల్లా మర్రిపాడు గ్రామం, ఈ నెల 16న విజయనగరం జిల్లా కూనేరు గ్రామంలో శ్రీనివాస కల్యాణాలు జరిగాయి. ఈ కల్యాణాల పనులను విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం రేవిడి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ బి.పృథ్వీరాజ్ టెండర్ ద్వారా దక్కించుకున్నారు. ఆ రెండు కల్యాణాల పనులకు పృథ్వీరాజ్‌కు రూ.3.93 లక్షలు ఖర్చయింది. టీటీడీ(రాజమండ్రి) ఏఈ ఆ మొత్తం
బిల్లుకు ఎం బుక్ తయారు చేసి రాజమండ్రి కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్డీఈఈ) రామకృష్ణారావుకు పంపారు.
రూ. 30 వేలకు బేరం
కాంట్రాక్టర్ బిల్లు మంజూరు చేయాలంటే డీఈఈ ఎం బుక్‌ను విజయవాడలోని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వద్దకు పంపాలి. అయితే బిల్లు మంజూరుకు తనకు రూ.40 వేలు సమర్పించుకోవాలని డీఈఈ రామకృష్ణారావు కాంట్రాక్టర్ పృథ్వీరాజ్‌ను డిమాండ్ చేశారు. దీంతో పృథ్వీరాజ్ రూ.30 వేలకు బేరం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ రాజమండ్రి రేంజ్ డీఎస్పీ రామచంద్రరావు పథకం ప్రకారం వల వేసి బుధవారం సాయంత్రం రెడ్ హ్యాండెడ్‌గా డీఈఈ రామకృష్ణారావును పట్టుకున్నారు. కెమికల్స్‌తో కూడిన రంగును నోట్లకు పూసి పృథ్వీరాజ్‌కు ఇచ్చి పంపారు.
ఆ తర్వాత పది నిముషాలకు ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తన సిబ్బందితో కలిసి రామకృష్ణారావు చాంబర్‌కు వెళ్లి ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు డీఈఈ చాంబర్‌లో పలు పత్రాలను పరిశీలించారు. అదుపులోకి తీసుకున్న రామకృష్ణారావును గురువారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు. సీఐ రాజశేఖర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.