ఏసీబీకి చిక్కిన అవినీతి చేప
ఏసీబీకి చిక్కిన అవినీతి చేప
Published Wed, Sep 17 2014 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM
డామిట్ కథ అడ్డం తిరిగింది... బదిలీ అయి రిలీవ్‌కు ముందురోజు లంచం రూ. లక్ష తీసుకు వెళ్లాలని ఆ ఉన్నతాధికారి వేసుకున్న పథకాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు భగ్నం చేశారు. విద్యార్థుల ఉపకార వేతనాలకు సంబంధించిన ఫైల్ విషయంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు హనుమంతనాయక్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం అధికార వర్గాల్లో కలకలరేపింది.
పాత గుంటూరు
విద్యార్థుల ఉపకార వేతనాల వివరాలను ఆన్‌లైన్ చేసేందుకు అనుమతి ఇచ్చే విషయంలో లంచం తీసుకుంటుండంగా జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు హనుమంతునాయక్‌ను సోమవారం రాత్రి ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ రాజారావు, బాధితుడు ప్రకాష్ కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి..
3 గుంటూరు సంతోష్‌నగర్‌కు చెందిన ఇమ్మానియేలు ప్రకాష్‌కు ఫిరంగిపురంలో నర్సింగ్ కళాశాలతోపాటు మరో పాఠశాల ఉంది. 2011లో ప్రకాశం జిల్లా ఒంగోలు లో నర్సింగ్ కళాశాల నడిపి అనంతరం ఫిరంగిపురానికి బదిలీ చేయించుకున్నారు. పాఠశాలను మాత్రం అక్కడే నడుపుతున్నారు.
3 2012-13 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల ఉపకారవేతనాలను ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయించాల్సి వచ్చి గుంటూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు హనుమంతనాయక్‌ను కలిశారు. ప్రయోజనం లేకపోవడంతో అప్పటి సోషల్ వెల్ఫేర్ కమిషనర్‌కు ప్రకాష్ ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన కమిషనర్ వెంటనే సంబంధిత పత్రాలు తన కార్యాలయానికి పంపాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఆ కళాశాలకు వెళ్లి పరిశీలన చేసి హనుమంతునాయక్‌కు నివేదిక ఇచ్చారు. ప్రకాష్ తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారనే కోపంతో హనుమంతనాయక్ ఆ నివేదిక ఫైల్‌ను కమిషనర్ కార్యాలయానికి పంపకుండా పక్కన పడేశారు.
3 ఏడాదిన్నర అనంతరం ఈ నెల 13న రూ.లక్ష ఇస్తే ఫైల్ పంపిస్తానని హనుమంత్ నాయక్ డిమాండ్ చేశారు. దీంతో ప్రకాష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
3 ఏసీబీ అధికారుల సూచన మేరకు ప్రకాష్ సోమవారం రాత్రి పట్టాభిపురంలోని హనుమంతనాయక్ ఇంటికి వెళ్లి లంచంగా అడిగిన రూ. లక్షను ఆయన చేతికందించారు. డీడీ తన వద్ద ఉన్న పెండింగ్ ఫైల్‌ను ప్రకాష్‌కు అందజేశారు. అప్పటికే ఆ ప్రాంతంలో మాటువేసిన ఏసీబీ అధికారులు దాడి చేయగా నాయక్ పారిపోయేందుకు విఫలయత్నం చేశారు. ఈ దశలో ఆయన కంటికి స్వల్ప గాయమైంది.
బదిలీపై వెళ్లేందుకు సిద్ధమైన తరుణంలో..
ఇటీవల జరిగిన బదిలీల్లో ఉపసంచాలకులు హనుమంతనాయక్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ డిప్యూటీ సెక్రటరీగా హైదరాబాద్ బదిలీ అయ్యారు. మంగళవారం గుంటూరులో రిలీవ్ కావాల్సి ఉంది. రూ. లక్ష తీసుకుని పెండింగ్ ఫైల్‌కు మోక్షం కల్పించాలని ఆయన వేసుకున్న పథకాన్ని ఏసీబీ అధికారులు భగ్నం చేయడంతో హనుమంతనాయక్ కంగుతిన్నారు.
ఏడాదిన్నరగా ఇబ్బందులు పెట్టారు...
విద్యార్థుల ఉపకార వేతనాల ఫైల్‌ను కమిషనరేట్‌కు పంపించేందుకు హనుమంతునాయక్ ఏడాదిన్నరగా తీవ్ర ఇబ్బందులు పెట్టారు. చివరకు రూ. లక్ష ఇస్తే ఫైల్ పంపిస్తానని తేల్చి చెప్పారు. లంచం ఇవ్వడానికి ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాను.
- బాధితుడు ఇమ్మానియేలు ప్రకాష్
డీడీపై కేసు నమోదు...
సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు హనుమంతునాయక్‌పై అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ రాజారావు తెలిపారు. ఆయనను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్టు పేర్కొన్నారు.
Advertisement
Advertisement