చిన్నమంగళారం(మొయినాబాద్), న్యూస్‌లైన్ : మహిళా గ్రూపుల్లో సభ్యులుగా ఉండి అభయహస్తం, ఆమ్‌ఆద్మీ పథకాల్లో భాగస్వాములైన వారి పిల్లలకు అందివ్వాల్సిన స్కాలర్‌షిప్‌లను వీఓ(విలేజ్ ఆర్గనైజర్)లు స్వాహా చేశారు. ఒకరివి కాదు.. ఇద్దరివి కాదు... ఏకంగా 39మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్ డబ్బులు ఇవ్వకుండా తమ సొంత అవసరాలకు వాడేసుకున్నారు. వాటితోపాటు అభయహస్తం ద్వారా 24 నెలలుగా ఇద్దరు వృద్ధురాళ్లకు పింఛన్లు సైతం ఇవ్వడంలేదు. డబ్బులు స్వాహా చేసి సంవత్సరం దాటినా ఇప్పటివరకు విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. చివరకు సామాజిక తనిఖీల్లో వారి బండారం బయటపడింది. 39మంది విద్యార్థులకు సంబంధించి రూ.46,800లు వారు స్వాహా చేసినట్లు తేలింది.
ఈ ఉదంతం మండల పరిధిలోని చిన్నమంగళారంలో జరిగింది. చిన్నమంగళారం గ్రామంలో 48 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో అభయహస్తం, ఆమ్ ఆద్మీ పథకాల్లో ఉన్న సభ్యుల పిల్లలకు( 9, 10, ఇంటర్ చదువుతున్నవారికి) ప్రతి సంవత్సరం రూ.1200 చొప్పున స్కాలర్‌షిప్ వస్తుంది. 2011 - 12 విద్యా సంవత్సరానికిగాను 101 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు మంజూరయ్యాయి. చిన్నమంగళారం వీఓలుగా ఉన్న స్వరూప, యూసుబ్‌బీలు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేసేవారు. అయితే గ్రామంలో 39మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వకుండా డబ్బులను వీఓలు దిగమింగినట్లు సామాజిక తనిఖీ బృందం తేల్చింది. కాగా, పింఛన్లకు సంబంధించిన డబ్బులు ఎవరు స్వాహా చేశారనే విషయం మాత్రం తేలాల్సి ఉంది.
సామాజిక తనిఖీతో వెలుగులోకి...
చిన్నమంగళారంలో స్వయం సహాయక సంఘాల ద్వారా అందించే స్కాలర్‌షిప్‌లు, బీమా, పింఛన్లపై ఈ నెల 10 నుంచి 12 వరకు సామాజిక తనిఖీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో 39మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఇద్దరు వృద్ధురాళ్లకు అభయహస్తం పింఛన్లు అందనట్లు తేలింది. సామాజిక తనిఖీ అధికారులు బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించి స్కాలర్‌షిప్ అందనివారి, పింఛన్ అందని వారి పేర్లు చదివి వినిపించారు.
గ్రామస్తుల ఆందోళన...
స్కాలర్‌షిప్ డబ్బులు స్వాహా అయినట్లు బయటపడటంతో విద్యార్థులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వీఓలను పిలిపించి అడగాలని పట్టుపట్టారు. దీంతో సామాజిక తనిఖీ అధికారులు వీఓ స్వరూపను పిలిపించారు. యూసుబ్‌బీ అందుబాటులో లేరు. సర్పంచ్ బాలమణితో పాటు గ్రామస్తులంతా వీఓ స్వరూపను నిలదీశారు. డబ్బులు ఎందుకు వాడుకున్నావని ప్రశ్నించారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు చెల్లించాలని, వీఓలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
13మందికి మాత్రమే ఇవ్వలేదు : స్వరూప, వీఓ
2011-12 సంవత్సరానికి సంబంధించిన స్కాలర్‌షిప్ డబ్బులు 88 మంది విద్యార్థులకు ఇద్దరం వీఓలం కలిసి అందజేశాము. వారు తీసుకున్నట్టు మా దగ్గర సంతకాలు ఉన్నాయి. కేవలం 13 మంది విద్యార్థులకు మాత్రమే స్కాలర్‌షిప్ డబ్బులు ఇవ్వలేదు. వాటిని అత్యవసర పరిస్థితుల్లో వాడుకున్నాము. వాటిని వెంటనే తిరిగి చెల్లిస్తాము.
నివేదికను డీఆర్‌డీఏ పీడీకి అందజేస్తాం : వాసవచారి, సామాజిక తనిఖీ అధికారి
చిన్నమంగళారంలో మూడు రోజులు సామాజిక తనిఖీ నిర్వహించాము. గ్రామంలో 39 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఇద్దరు వృద్ధురాళ్లకు అభయహస్తం పింఛన్ డబ్బులు అందలేదని తేలింది. అదే విషయాన్ని గ్రామసభలో గ్రామస్తులందరికీ చెప్పాం. తనిఖీ నివేదికను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్‌కు అందజేస్తాం.
విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు స్వాహా
Published Thu, Nov 14 2013 12:36 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement