student scholarships
-
ఆటా స్కాలర్ షిప్స్, మ్యాట్రిమోనియాల్ సర్వీసెస్
నార్త్ కరోలినా : అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా ) తెలుగువారి కోసం స్కాలర్ షిప్స్, మ్యాట్రిమోనియాల్ సర్వీసెస్ ప్రారంభించింది. నార్త్ కరోలినా లోని ర్యాలీలో ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీంరెడ్డి అధ్యక్షతన ఆటా బోర్డు మీటింగ్ జరిగింది. అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారి అవసరాలకి అనుగుణంగా ఆటా రూపొందించిన సేవా కార్యక్రమాలని ఈ సమావేశంలో వెల్లడించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా తెలుగువారికోసం మ్యాట్రిమోనియాల్ సైట్ (http://www.atamatrimony.com/) ని ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీంరెడ్డి ప్రారంభించారు. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ విధానాన్ని బోర్డు సభ్యులకి చూపించారు. తెలుగు యువతకు విద్యావసరాల కోసం స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్ని కూడా బోర్డు ఆమోదించింది. అమెరికాలో ఉన్న 10మంది తెలుగు వారి పిల్లలకు కాలేజీ అవసరాల కోసం ఒక్కొక్కరికి 1000 డాలర్ల చొప్పున అందిస్తామని పరమేష్ తెలిపారు. భువనేశ్ బుజాల (ప్రెసిడెంట్ ఎలెక్ట్) ని ఆటా వేడుకల చైర్‌గా ఆయన నియమించారు. అమెరికాలో ఉంటున్న తెలుగు వారికోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలంటే ఆటాలో తెలుగువారి సభ్యత్వం మరింత పెరగాలని, అందుకోసం ఇక్కడ ఉంటున్న తెలుగువారందరినీ ప్రోత్సహించి సభ్యత్వం చేయించాలని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆటా బోర్డు సమావేశానికి అమెరికాలోని వివిధ నగరాల నుంచి రీజనల్ కోఆర్డినేటర్స్ , రీజనల్ డైరెక్టర్స్ , రీజనల్ అడ్వయిర్స్, ఉమెన్స్ కమిటీ చైర్స్, కో చైర్స్, స్టాండింగ్ కమిటీ చైర్స్, కోచైర్స్, ఆటా సభ్యులు పాల్గొన్నారు. దాదాపు 150 మంది వరకు హాజరైన ఈ సమావేశానికి ఏర్పాట్లు చేసిన బోర్డు ఆఫ్ ట్రస్టీస్ మధు బొమ్మినేని, సాయి సుదిని, స్టాండింగ్ కమిటీ చైర్స్ పవన్ నోముల, వెంకట్ ఏటుకూరి , రీజనల్ కోఆర్డినేటర్స్ అజయ్ మద్ది, నిహారిక నవలగా కు బోర్డు కృతజ్ఞతలు తెలిపింది. -
విద్యార్థుల సొమ్ము.. రూ.2కోట్లు హాంఫట్
సీబీసీఐడీ విచారణకు ఆదేశించిన విద్యాశాఖమంత్రి కొత్తగూడెం: వేలు కాదు.. లక్షలు కాదు.. ఏకంగా రెండుకోట్ల రూపాయలను అక్రమార్కులు గుటకాయ స్వాహా చేశారు. కొత్తగూడెంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్(యూసీఈ) విద్యార్థుల ఉపకార వేతనాలు, మెస్, కాస్మొటిక్ బిల్లులకు సంబంధించిన ఈ డబ్బును అక్రమార్కులు గత ఐదేళ్లలో కాజేశారు. ఈ మొత్తం దాదాపు రెండుకోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇలా బయటపడింది.. ఈ స్వాహాపర్వాన్ని ఇక్కడి విద్యార్థులే బయట పెట్టారు. విద్యార్థులకు సంబంధించిన ఉపకా ర వేతనాలు, మెస్ బిల్లులు, లైబ్రరీ ఫీజులకు సంబంధించిన నిధులు నేరుగా కళాశాల ఖాతాలోకి వెళతాయి. బ్యాంక్ ఖాతా లేని విద్యార్థుల కు సంబంధించిన ఉపకార వేతనాలను కూడా ప్రిన్సిపాల్‌కు ఉన్న ప్రత్యేకాధికారాలతో వేరే అ కౌంట్‌లో జమ చేసే అవకాశముంది. ఇలా గత ఐదేళ్లుగా వస్తున్న డబ్బును స్వాహా అవుతున్నట్టుగా విద్యార్థులకు అనుమానం వచ్చింది. దీ నిపై వారు ఏడాది క్రితం కాకతీయ యూనివర్సిటీ అధికారులకు సమాచారమిచ్చారు. వారు స్పందించి కళాశాల ప్రిన్సిపాల్‌ను వివరణ కోరి నట్టు సమాచారం. ప్రిన్సిపాల్ ఏమి చెప్పారో ఏమోగానీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక లాభం లేదనుకున్న విద్యార్థులు.. గత ఆగస్టులో వారం రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. ఎస్పీ రంగనాథ్ వెంటనే స్పందించారు. ఈ కళాశాలను ఆయన సందర్శించి, పోలీసు శాఖ నుంచి ప్రాథమిక విచారణ జరిపించగా.. నిధుల స్వాహా నిజమేనని, ఈ మొత్తం దాదాపు రెండుకోట్ల రూపాయల వరకు ఉండవచ్చని తేలినట్టుగా సమాచారం. క్లర్కులే అక్రమార్కులా...?! యూసీఈకి సంబంధించిన జమాఖర్చులను క్లర్కులే చూస్తుంటారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌తోపాటు మెస్, కాస్మోటిక్స్ బిల్లులు కూడా వస్తుంటాయి. ఈ కళాశాలలో మొత్తం అన్ని బ్రాంచిలలో కలిపి సుమారు 300మంది విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు. వీరికి సంబంధించి గత ఐదేళ్లలో వచ్చిన కొందరి ఉపకార వేతనాలు, బిల్లులు దాదాపు రెండుకోట్ల రూపాయలను క్లర్కులే డ్రా చేసుకున్నట్టు తెలిసింది. సీబీ సీఐడీ విచారణకు మంత్రి ఆదేశం ఈ స్వాహాపర్వంపై కళాశాల విద్యార్థులు ఇటీవల విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని కలిసి వినతిపత్రమిచ్చారు. ఆయన స్పందించి, ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. స్వాహా నిజమేనని తెలీడంతో పూర్తిస్థాయి విచారణ కోసం సీబీసీఐడీని ఆదేశిస్తూ శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. -
ఏసీబీకి చిక్కిన అవినీతి చేప
డామిట్ కథ అడ్డం తిరిగింది... బదిలీ అయి రిలీవ్‌కు ముందురోజు లంచం రూ. లక్ష తీసుకు వెళ్లాలని ఆ ఉన్నతాధికారి వేసుకున్న పథకాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు భగ్నం చేశారు. విద్యార్థుల ఉపకార వేతనాలకు సంబంధించిన ఫైల్ విషయంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు హనుమంతనాయక్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం అధికార వర్గాల్లో కలకలరేపింది. పాత గుంటూరు విద్యార్థుల ఉపకార వేతనాల వివరాలను ఆన్లైన్ చేసేందుకు అనుమతి ఇచ్చే విషయంలో లంచం తీసుకుంటుండంగా జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు హనుమంతునాయక్‌ను సోమవారం రాత్రి ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ రాజారావు, బాధితుడు ప్రకాష్ కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి.. 3 గుంటూరు సంతోష్‌నగర్‌కు చెందిన ఇమ్మానియేలు ప్రకాష్‌కు ఫిరంగిపురంలో నర్సింగ్ కళాశాలతోపాటు మరో పాఠశాల ఉంది. 2011లో ప్రకాశం జిల్లా ఒంగోలు లో నర్సింగ్ కళాశాల నడిపి అనంతరం ఫిరంగిపురానికి బదిలీ చేయించుకున్నారు. పాఠశాలను మాత్రం అక్కడే నడుపుతున్నారు. 3 2012-13 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల ఉపకారవేతనాలను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించాల్సి వచ్చి గుంటూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు హనుమంతనాయక్‌ను కలిశారు. ప్రయోజనం లేకపోవడంతో అప్పటి సోషల్ వెల్ఫేర్ కమిషనర్‌కు ప్రకాష్ ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన కమిషనర్ వెంటనే సంబంధిత పత్రాలు తన కార్యాలయానికి పంపాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఆ కళాశాలకు వెళ్లి పరిశీలన చేసి హనుమంతునాయక్‌కు నివేదిక ఇచ్చారు. ప్రకాష్ తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారనే కోపంతో హనుమంతనాయక్ ఆ నివేదిక ఫైల్‌ను కమిషనర్ కార్యాలయానికి పంపకుండా పక్కన పడేశారు. 3 ఏడాదిన్నర అనంతరం ఈ నెల 13న రూ.లక్ష ఇస్తే ఫైల్ పంపిస్తానని హనుమంత్ నాయక్ డిమాండ్ చేశారు. దీంతో ప్రకాష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. 3 ఏసీబీ అధికారుల సూచన మేరకు ప్రకాష్ సోమవారం రాత్రి పట్టాభిపురంలోని హనుమంతనాయక్ ఇంటికి వెళ్లి లంచంగా అడిగిన రూ. లక్షను ఆయన చేతికందించారు. డీడీ తన వద్ద ఉన్న పెండింగ్ ఫైల్‌ను ప్రకాష్‌కు అందజేశారు. అప్పటికే ఆ ప్రాంతంలో మాటువేసిన ఏసీబీ అధికారులు దాడి చేయగా నాయక్ పారిపోయేందుకు విఫలయత్నం చేశారు. ఈ దశలో ఆయన కంటికి స్వల్ప గాయమైంది. బదిలీపై వెళ్లేందుకు సిద్ధమైన తరుణంలో.. ఇటీవల జరిగిన బదిలీల్లో ఉపసంచాలకులు హనుమంతనాయక్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ డిప్యూటీ సెక్రటరీగా హైదరాబాద్ బదిలీ అయ్యారు. మంగళవారం గుంటూరులో రిలీవ్ కావాల్సి ఉంది. రూ. లక్ష తీసుకుని పెండింగ్ ఫైల్‌కు మోక్షం కల్పించాలని ఆయన వేసుకున్న పథకాన్ని ఏసీబీ అధికారులు భగ్నం చేయడంతో హనుమంతనాయక్ కంగుతిన్నారు. ఏడాదిన్నరగా ఇబ్బందులు పెట్టారు... విద్యార్థుల ఉపకార వేతనాల ఫైల్‌ను కమిషనరేట్‌కు పంపించేందుకు హనుమంతునాయక్ ఏడాదిన్నరగా తీవ్ర ఇబ్బందులు పెట్టారు. చివరకు రూ. లక్ష ఇస్తే ఫైల్ పంపిస్తానని తేల్చి చెప్పారు. లంచం ఇవ్వడానికి ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాను. - బాధితుడు ఇమ్మానియేలు ప్రకాష్ డీడీపై కేసు నమోదు... సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు హనుమంతునాయక్‌పై అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ రాజారావు తెలిపారు. ఆయనను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్టు పేర్కొన్నారు. -
ఆన్లైన్ ద్వారా ఇక చెల్లింపులు
మూడు జిల్లాల ట్రెజరీ అధికారులకు శిక్షణ పూర్తి అవగాహనతో పనిచేయాలని ట్రెజరీస్ డెరైక్టర్ కనకవల్లి సూచన విశాఖపట్నం : రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగే అన్నిరకాల చెల్లింపులలో జాప్యాన్ని నివారిం చేందుకు త్వరలో ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు రాష్ట్ర ట్రెజరీస్ డెరైక్టర్ కె.కనకవల్లి తెలిపారు. ఆన్లైన్ చెల్లింపులపై అవగాహన కల్పించేందుకు శ్రీకాకుళం, విజయనరం, విశాఖపట్నం జిల్లాలకు చెంది న ట్రెజరీ అధికారులు, సిబ్బందికి ఆదివారం బుల్లయ్య కళాశాలలో ఏర్పాటైన శిక్షణ శిబి రంలో మాట్లాడారు. రాష్ట్రం లో 5 లక్షల మం ది వరకు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు, 3.5 లక్షల మంది పెన్షనర్లకు ఇకపై ప్రతినెలా చెల్లింపులు ఆన్లైన్ ద్వారానే జరుగుతాయన్నారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, థర్డ్ పార్టీ చెల్లింపులు కూడా ఆన్లైన్ ద్వారా నేరుగా వారివారి బ్యాంకు అకౌంట్లకు జమ అవుతాయన్నారు. ఆన్లై న్ విధానంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ట్రెజ రీస్ అదనపు సంచాలకు డు హనుమంతరావు, సంయుక్త సంచాలకుడు డాక్టర్ ఎ.శివప్రసాద్, అసిస్టెంట్ డెరైక్టర్లు ఎస్.వి.ఎన్.కల్యాణి, జి.అచ్చుతరామయ్య, విశాఖ జిల్లా ఖజానా ఉప సంచాలకులు ఎం.గీతాదేవి, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఎ.శ్రీనివాస్, కె.కేదార్, ఎస్బీఐ సీనియర్ మేనేజర్ వెంకట రావు, మూడు జిల్లాల డీడీలతో పాటు అధికారులు పాల్గొన్నారు. -
విద్యార్థుల స్కాలర్షిప్లు స్వాహా
చిన్నమంగళారం(మొయినాబాద్), న్యూస్‌లైన్ : మహిళా గ్రూపుల్లో సభ్యులుగా ఉండి అభయహస్తం, ఆమ్ఆద్మీ పథకాల్లో భాగస్వాములైన వారి పిల్లలకు అందివ్వాల్సిన స్కాలర్షిప్లను వీఓ(విలేజ్ ఆర్గనైజర్)లు స్వాహా చేశారు. ఒకరివి కాదు.. ఇద్దరివి కాదు... ఏకంగా 39మంది విద్యార్థులకు స్కాలర్షిప్ డబ్బులు ఇవ్వకుండా తమ సొంత అవసరాలకు వాడేసుకున్నారు. వాటితోపాటు అభయహస్తం ద్వారా 24 నెలలుగా ఇద్దరు వృద్ధురాళ్లకు పింఛన్లు సైతం ఇవ్వడంలేదు. డబ్బులు స్వాహా చేసి సంవత్సరం దాటినా ఇప్పటివరకు విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. చివరకు సామాజిక తనిఖీల్లో వారి బండారం బయటపడింది. 39మంది విద్యార్థులకు సంబంధించి రూ.46,800లు వారు స్వాహా చేసినట్లు తేలింది. ఈ ఉదంతం మండల పరిధిలోని చిన్నమంగళారంలో జరిగింది. చిన్నమంగళారం గ్రామంలో 48 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో అభయహస్తం, ఆమ్ ఆద్మీ పథకాల్లో ఉన్న సభ్యుల పిల్లలకు( 9, 10, ఇంటర్ చదువుతున్నవారికి) ప్రతి సంవత్సరం రూ.1200 చొప్పున స్కాలర్షిప్ వస్తుంది. 2011 - 12 విద్యా సంవత్సరానికిగాను 101 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరయ్యాయి. చిన్నమంగళారం వీఓలుగా ఉన్న స్వరూప, యూసుబ్బీలు విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేసేవారు. అయితే గ్రామంలో 39మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వకుండా డబ్బులను వీఓలు దిగమింగినట్లు సామాజిక తనిఖీ బృందం తేల్చింది. కాగా, పింఛన్లకు సంబంధించిన డబ్బులు ఎవరు స్వాహా చేశారనే విషయం మాత్రం తేలాల్సి ఉంది. సామాజిక తనిఖీతో వెలుగులోకి... చిన్నమంగళారంలో స్వయం సహాయక సంఘాల ద్వారా అందించే స్కాలర్షిప్లు, బీమా, పింఛన్లపై ఈ నెల 10 నుంచి 12 వరకు సామాజిక తనిఖీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో 39మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఇద్దరు వృద్ధురాళ్లకు అభయహస్తం పింఛన్లు అందనట్లు తేలింది. సామాజిక తనిఖీ అధికారులు బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించి స్కాలర్షిప్ అందనివారి, పింఛన్ అందని వారి పేర్లు చదివి వినిపించారు. గ్రామస్తుల ఆందోళన... స్కాలర్షిప్ డబ్బులు స్వాహా అయినట్లు బయటపడటంతో విద్యార్థులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వీఓలను పిలిపించి అడగాలని పట్టుపట్టారు. దీంతో సామాజిక తనిఖీ అధికారులు వీఓ స్వరూపను పిలిపించారు. యూసుబ్బీ అందుబాటులో లేరు. సర్పంచ్ బాలమణితో పాటు గ్రామస్తులంతా వీఓ స్వరూపను నిలదీశారు. డబ్బులు ఎందుకు వాడుకున్నావని ప్రశ్నించారు. విద్యార్థుల స్కాలర్షిప్లు చెల్లించాలని, వీఓలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. 13మందికి మాత్రమే ఇవ్వలేదు : స్వరూప, వీఓ 2011-12 సంవత్సరానికి సంబంధించిన స్కాలర్షిప్ డబ్బులు 88 మంది విద్యార్థులకు ఇద్దరం వీఓలం కలిసి అందజేశాము. వారు తీసుకున్నట్టు మా దగ్గర సంతకాలు ఉన్నాయి. కేవలం 13 మంది విద్యార్థులకు మాత్రమే స్కాలర్షిప్ డబ్బులు ఇవ్వలేదు. వాటిని అత్యవసర పరిస్థితుల్లో వాడుకున్నాము. వాటిని వెంటనే తిరిగి చెల్లిస్తాము. నివేదికను డీఆర్డీఏ పీడీకి అందజేస్తాం : వాసవచారి, సామాజిక తనిఖీ అధికారి చిన్నమంగళారంలో మూడు రోజులు సామాజిక తనిఖీ నిర్వహించాము. గ్రామంలో 39 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఇద్దరు వృద్ధురాళ్లకు అభయహస్తం పింఛన్ డబ్బులు అందలేదని తేలింది. అదే విషయాన్ని గ్రామసభలో గ్రామస్తులందరికీ చెప్పాం. తనిఖీ నివేదికను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్‌కు అందజేస్తాం.