అప్పుల బాధ తాళలేక వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఇద్దరు రైతులు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ జిల్లా శాయంపేట గ్రామానికి చెందిన చౌడరపు సుమన్(29) రెండేళ్లుగా పత్తి సాగు చేస్తున్నాడు. వర్షాభావ పరిస్థితులతో పంటల దిగుబడి సరిగా రాలేదు. ఇటీవల ఓ వివాహానికి వెళ్లగా అక్కడ అర తులం బంగారు ఉంగరం పోగొట్టుకున్నాడు. మనస్తాపానికి గురైన సుమన్ శుక్రవారం బాత్‌రూంలో పురుగుల మందు తాగాడు.ఎంతకూ బయటకు రాకపోవడంతో భార్య అనూష తలుపు తీసి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. పరకాల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. సుమన్‌కు ఏడాదిన్నర క్రితమే వివాహమైంది.
కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన మహిళా రైతు చల్లా స్వరూప(38) భర్త శ్రీనివాస్‌తో కలసి తమ ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. దిగుబడి లేక చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోయారు. ఇదే క్రమంలో గురువారం తమ పత్తి చేనులో కలుపు తీస్తుండగా మేడిగడ్డ బ్యారేజీ సర్వే అధికారులు వచ్చి మీ భూమి మొత్తం పోతుందని తెలిపారు. ఇప్పటికే రూ. 5 లక్షల అప్పు ఉన్నామని, భూమి కూడా పోతే ఎలా బతకాలని మనస్తాపం చెందిన స్వరూప ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి పురుగుల మందు తాగింది. కుమార్తె మానస వికలాంగురాలు కావడంతో ఆమెపై మనోవేదనకు గురైనట్లు బంధువులు తెలిపారు.