సాక్షి, గుంటూరు: పట్టణ ప్రణాళిక విభాగంలో అవినీతి అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. అక్రమంగా మింగిన సొమ్మును వెనక్కి ఇచ్చినా శిక్ష తప్పదనే భయం మొదలయ్యింది. మరో నెల రోజుల్లో కేసు దర్యాప్తును పూర్తి చేసి ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు నివేదికను సమర్పించనున్నారు. ఈ తరుణంలో కేసు చర్చనీయాంశంగా మారింది.
పట్టణ ప్రణాళికా విభాగంలో భారీ స్థాయి అవినీతి జరుగుతుందనేది బహిరంగ రహస్యమే. అయితే ఈ అవినీతిని అరికట్టడంలో గత ప్రభుత్వం, నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు విఫలమయ్యారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 2012–2016లో 14 ఫైల్స్‌కు టీడీఆర్ బాండ్ (ట్రాన్సఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్ బాండ్స్)లో భారీ స్థాయి అవినీతి జరిగిందంటూ అప్పట్లో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు అవకతవకల విషయాన్ని నిర్ధారించారు.
ఏసీబీ దర్యాప్తు..
ఈ వ్యవహారంపై గత ఏడాది ఏసీబీ అధికారులకు సైతం ఫిర్యాదులు అందడంతో పూర్తి విచారణ జరిపిన అధికారులు టీడీఆర్ బాండ్లలో సుమారు రూ.1.60 కోట్లు అవినీతి జరిగిందని తేల్చారు. దీనిపై కమిషనర్, కార్పొరేషన్ ప్రత్యేకాధికారి జిల్లా కలెక్టర్, డీఎంఈలు సైతం దర్యాప్తు జరిపి ప్రిన్సిపల్ సెక్రటరీకి అప్పట్లో నివేదికలు పంపారు. టీడీఆర్ బాండ్‌లలో అక్రమాలకు పాల్పడిన 12 మంది అధికారులు(మినిస్టీరియల్ స్టాఫ్), తొమ్మిది మంది బిల్డర్లు సహా 32 మందిపై 13/1ఏ, 13/2, 420, 409, 467, 471 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టీడీఆర్ బాండ్ అంటే..!
ప్రజా ప్రయోజనం కోసం భూసేకరణ జరిపితే పరిహారం చెల్లిస్తారు. స్థానిక సంస్థలు తాము చేపట్టే అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ సొంతంగా చేసుకోవాల్సి ఉంది. దీనికి పరిహారం చెల్లించే స్తోమత స్థానిక సంస్థలకు ఉండదు. దీంతో వీటికి టీడీఆర్ బాండ్లు జారీ చేస్తారు. బాండ్లను బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ స్థలం విలువ పెరిగితే బాండ్ల విలువ పెరుగుతుంది. ఇలాంటి బాండ్లను అదే సంస్థలో రుసుముల చెల్లింపులకు ఉపయోగించవచ్చు. సాధారణంగా రహదారుల విస్తరణకు భూసేకరణ జరుపుతారు. 2012–2016 మధ్య గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో జరిగిన రోడ్ల విస్తరణలో స్థలాలు, భవనాలు కోల్పోయిన వారికి కార్పొరేషన్ టీడీఆర్ బాండ్లు మంజూరు చేసింది. ఈ ప్రక్రియలో అప్పట్లో టౌన్ ప్లానింగ్ అధికారులు కొందరు బిల్డర్లతో కుమ్మక్కై చేతివాటం ప్రదర్శించారు.
మొత్తం ముట్టజెప్పారు..
ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రారంభించి కేసు నమోదు చేసేలోపే కొంతరు అధికారులు, బిల్డర్లు తాము నొక్కేసిన సొమ్ములో రూ.28 లక్షలు వెనక్కి ఇచ్చేవారు. అయితే ఇదంతా గత డిసెంబర్‌లో కేసు నమోదుకాక ముందు జరిగింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితులందరికి నోటీసులు జారీ చేసిన వెంటనే మిగిలిన 1.32కోట్లు కూడా వచ్చేశాయి. అయితే అవినీతికి పాల్పడిన సొమ్మును వెనక్కు ఇచ్చినప్పటికీ తప్పు చేసినవారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.
మాజీ ఎమ్మెల్యేల బినామీలు..
నగరపాలక సంస్థలో జరిగిన భారీ కుంభకోణంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ముఖ్య నాయకులబినామీలు, ముఖ్య అనుచరులైన బిల్డర్లు ఉన్నారు. అందువల్లే గత ప్రభుత్వ హయాంలో కేసు ముందుకుసాగకుండా అడ్డకున్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దర్యాప్తు వేగవంతమైనట్లు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు నివేదిక ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment