గుండుగొలనులో హస్టల్‌లోని రికార్డులను పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు
భీమడోలు/పెదవేగి రూరల్:గుండుగొలనులోని సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహంలో గురువారం ఏలూరు ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ వి.గోపాలకృష్ణ నేతృత్వంలో సీఐ కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది వసతిగృహాన్ని తనిఖీ చేశారు. శిథిలమైన హాస్టల్ భవనాన్ని వారు పరిశీలించారు. అపరిశుభ్ర పరిసరాలను చూసి అసహనం వ్యక్తం చేశారు. హాస్టల్లో కొన్ని అవకతవకలను గుర్తించారు. మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని నిర్ధారించారు. ఇప్పటికే కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాల నుంచి బాలికలను ఖాళీ చేయించి గుండుగొలను జెడ్పీ ఉన్నత పాఠశాల తరగతి గదుల్లోకి మార్చారు. అయితే భోజనం, కాలకృత్యాలు తీర్చుకునేందుకు మాత్రం శిథిలమైన హాస్టల్‌నే వినియోగిస్తున్నారు.
ఈ భవనంలో మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడం, పెచ్చులూడిన శ్లాబులు, అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి వార్డెన్‌ను ప్రశ్నించారు. రికార్డులను పరిశీలించి నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని గుర్తించారు. బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణలోనూ అవకతవకలు గుర్తించి వసతి గృహం సంక్షేమ అధికారిణిని మందలించారు. బయోమెట్రిక్‌లో ఉన్న లోపాలను అనువుగా మార్చుకుని వాస్తవానికి ఉన్న బాలికల సంఖ్య కన్నా ఎక్కువ మంది ఉన్నట్టు రికార్డుల్లో చూపించడాన్ని గుర్తించారు. ఈ వసతి గృహంలో 8 నుంచి 10వ తరగతి వరకు 77 మంది బాలికలు ఉన్నారని రికార్డుల్లో పేర్కొన్నారు. అయితే 26 మంది టెన్త్ విద్యార్థినులు వెళ్లిపోవడంతో 51 మంది ఉండాల్సి ఉంది. వీరిలో అసలు ఏడుగురు బాలికలు లేరు. అయినా వీరి హాజరు నమోదు చేయడాన్ని డీఎస్పీ తప్పుబట్టారు. రెండు రోజులుగా సంక్షేమాధికారిణి బి.రాధాదేవి విద్యార్థుల హాజరు కూడా వేయకపోవడాన్ని గుర్తించారు.
దీనితోపాటు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి, క్రిస్మస్ పండుగ తరుణంలో అందించిన చంద్రన్న కానుకల కిట్లు 50 నుంచి 60 వసతిగృహంలో దర్శనమిచ్చాయి. ఈ సందర్భంగా డీఎస్పీ వి.గోపాలకృష్ణ మాట్లాడుతూ బాలికల సంఖ్య కన్నా 20 మంది వరకు ఎక్కువగా నమోదు చేసుకుంటున్నారని, వసతిగృహం నిర్వహణ, పరిసరాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, శిథిల భవనంలో నిర్వహించడం తగదని పేర్కొన్నారు. దీనిపై నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని పేర్కొన్నారు.
ఏలూరు బాలుర హాస్టల్లో..
ఏలూరు టౌన్ : ఏలూరు పవర్‌పేటలోని బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. సీఐ యూజే విల్సన్ ఆధ్వర్యంలో వసతిగృహంలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం, దుర్గంధం వెదజల్లడాన్ని గుర్తించారు. హాస్టల్లో ఉన్న రెండు మరుగుదొడ్లు 40మంది పిల్లలకు ఎలా సరిపోతాయని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డుల్లో 80మంది పిల్లలు ఉన్నట్లు చూపిస్తున్నారని, కానీ 40 మంది పిల్లలు మాత్రమే ఉన్నారని గుర్తించారు. మెనూలోనూ నాణ్యత పాటించడం లేదని తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment