
సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని కోట్లకు పడగలెత్తిన మాజీ అధికారి ఆయన. అవినీతికి పాల్పడ్డి పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు వెనకేసున్నారనే సమచారంతో ఏసీబీ అధికారులు... సదరు మాజీ అధికారి ఇంటిపై దాడులు నిర్వహించాలని వచ్చారు. అయితే ఆ దాడులను అడ్డుకునేందుకు అ మాజీ అధికారి ఏకంగా తన పెంపుడు కుక్కను ఏసీబీ అధికారులపై వదిలాడు. యజమాని తిండితిన్న కుక్క విశ్వాసం చూపిస్తూ... ఏసీబీ అధికారులపై దాడి చేసింది. దీంతో ఏసీబీ అధికారులు భయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. అనంతరం స్థానిక పోలీసుల సాయంతో మాజీ అధికారి ఇంటి తలుపులు పగులగొట్టి సోదాలు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లాలో సర్వే విభాగంలో సర్వేయర్‌గా పని చేసిన గేదెల లక్ష్మీ గణేశ్వరరావు నివాసంపై ఏసీబీ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ దాడులు నిర్వహించడానికి ముందు గణేశ్వరరావు ఏసీబీ అధికారులపై పెంపుడు కుక్కను ఉసికొల్పారు. దీంతో అధికారులు పరుగు లంకించుకున్నారు. అనంతరం ఆయనగారు మాత్రం ఇంటికి తాళం వేసుకుని దర్జాగా లోపల కూర్చున్నారు. దీంతో ఏసీబీ అధికారులు స్థానిక పోలీసుల సహాయంతో తలుపులు పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించారు.
ఆదాయానికి మించి ఆస్తులున్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మీ గణేశ్వరరావుకు సంబంధించి...17 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్, విశాఖ పట్నం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. కాగా లక్ష్మీ గణేశ్వరరావుపై ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనను ఉన్నతాధికారులు విధుల నుంచి తప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment