అచ్చెన్నకే చాన్స్.. ప్రత్యర్థుల కళావరం! | Accennayudu in tdp Cabinet | Sakshi
Sakshi News home page

అచ్చెన్నకే చాన్స్.. ప్రత్యర్థుల కళావరం!

Published Mon, Jun 9 2014 2:21 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

అచ్చెన్నకే చాన్స్.. ప్రత్యర్థుల కళావరం! - Sakshi

అచ్చెన్నకే చాన్స్.. ప్రత్యర్థుల కళావరం!

      జిల్లా నుంచి మంత్రివర్గంలో ఒక్కరికే అవకాశం
     అధిష్టానం వద్ద పట్టు నిరూపించుకున్న కింజరాపు వర్గం
     తొలిసారి అచ్చెన్నాయుడుకు అమాత్యయోగం
     జిల్లా పార్టీలో వైరి వర్గంపై మరోమారు పైచేయి
     చివరి క్షణంలో అవకాశం చేజారడంతో కళా వర్గం ఆందోళన
     మరోవైపు అసంతృప్తితో రగిలిపోతున్న శివాజీ

 
 అచ్చెన్నాయుడు మంత్రి అయ్యారు. జిల్లా తెలుగుదేశంలోనూ.. అధిష్టానం వద్దా కింజరాపు వర్గానిదే ఆధిపత్యమని రుజువు చేశారు. జిల్లాలో మొదటి నుంచీ వర్గాలుగా ఉన్న కింజరాపు, కళా వర్గాలు సార్వత్రిక ఎన్నికల నుంచి జిల్లాపై పట్టు కోసం ఎత్తులు పై ఎత్తులు వేస్తూ వచ్చాయి. చివరికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కోసం ఈ ఇద్దరితోపాటు శివాజీ కూడా పోటీ పడి తుది కంటా ప్రయత్నాలు సాగించారు. కళా వెంకట్రావు పేరు మంత్రి లేదా స్పీకర్ పదవికి గట్టిగా వినిపించింది. చివరికి అచ్చెన్న ఆ చాన్స్ కొట్టేశారు. స్పీకర్ పదవైనా దక్కుతుందా?.. లేక మంత్రివర్గ విస్తరణలో అవకాశమిస్తారా??.. లేకపోతే మొత్తంగా మొండిచెయ్యి చూపిస్తారా???.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు కళా వర్గాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి.
 
 శ్రీకాకుళం, న్యూస్‌లైన్: కొత్త రాష్ట్రంలో.. కొత్త ప్రభుత్వంలో.. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కొత్త నేతను మంత్రి పదవి వరించింది. టీడీపీ మంత్రివర్గంలో జిల్లా నుంచి టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఒక్కరికే చోటు దక్కడంతో ఇన్నాళ్లు ఈ విషయంలో సాగుతున్న చతుర్ముఖ పోటీకి తెర పడింది. అమాత్య పదవి కొట్టేయడం ద్వారా అధిష్టానం వద్ద తమ పట్టును నిరూపించుకున్న కింజరాపు కుటుంబం.. అదే ఊపులో జిల్లా పార్టీపై అధిపత్యానికి మార్గం సుగమం చేసుకుంది. ఈ పరిణామం కింజరాపు వర్గంతో ఢీ అంటే ఢీ అంటున్న కళా వర్గానికి మింగుడు పడనిదే. మరోవైపు శివాజీ వర్గం కూడా తమ నేతకు పదవి దక్కకపోవడంపై గుర్రుగా ఉంది. ఈ పరిణామాలు జిల్లా టీడీపీలో బలాబలాల పునరేకీకరణకు దారి తీసే అవకాశం ఉంది.
 
 నాలుగుసార్లు ఎమ్మెల్యేగా.. తొలిసారి మంత్రిగా..
 నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అచ్చెన్నాయుడు మంత్రి పదవి సాధించడం ద్వారా జిల్లాలో కింజరాపు కుటుంబానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చారని ఆ వర్గీయులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దివంగత మాజీ ఎంపీ ఎర్రన్నాయడు సోదరుడైన అచ్చెన్న 1996లో జరిగిన ఉప ఎన్నికల ద్వారా ఎమ్మెల్యే అయ్యారు. అప్పటివరకు హరిశ్చంద్రపురం ఎమ్మెల్యేగా ఉన్న ఎర్రన్నాయుడు 1996 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో అచ్చెన్న ఉప ఎన్నికల్లో గెలుపొంది తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1999, 2004లలో కూడా ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన నియోజకవర్గాల పునర్వ్య వస్థీకరణ అనంతరం టెక్కలి నుంచి 2009 సాధారణ, ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. తాజాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  మళ్లీ టెక్కలి నుంచే పోటీ చేసి నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. రాజకీయ, సామాజిక వర్గాల కూర్పులో భాగంగా అచ్చెన్నకు మంత్రివర్గంలో స్థానం లభించిందని అంటున్నారు.
 
 కళా, గౌతులపై పైచేయి
 మంత్రి పదవి దక్కించుకోవడం ద్వారా జిల్లా టీడీపీ లో తమ ఆధిపత్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడని కళా, శివాజీ వర్గాలపై కింజరాపు వర్గం పైచేయి సాధించింది. ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు నుంచి పట్టు కోసం ఈ మూడు వర్గాలు తలపడిన విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా ఇచ్ఛాపురం, పాతపట్నం, నరసన్నపేటల్లో ఒకదాన్ని బీజేపీకి ఇవ్వాలని అధిష్టానం భావించగా..  కింజరాపు వర్గం తీవ్రస్థాయి లో ఒత్తిడి తెచ్చి నిర్ణయం మార్చుకునేలా చేసింది. అదే సమయంలో పాలకొండ డివిజన్‌లో తాను చెప్పిన వారికే సీటు ఇప్పించుకోవడంలో కళా వెంకట్రావు విఫలమయ్యారు. దీంతో ఆ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థుల ఓటమికి కళా వర్గం ప్రయత్నించిందన్న ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఇక మంత్రివర్గంలో చివరి క్షణం వరకు కళావెంకటరావు పేరు పరిశీలించిన చంద్రబాబు చివరికి అచ్చెన్నాయుడు వైపే మొగ్గు చూపారు.
 
 అదే సమయంలో కళాను చల్లబరిచేందుకుగానూ ఆయన మరదలు కిమిడి మృణాళినికి అవకాశం ఇచ్చారు. కాగా గౌతు శివాజీ వర్గాన్ని తొలి నుంచి అధిష్టానం పక్కన పెడుతూ వచ్చింది. తన టిక్కెట్టు కోసమే శివాజీ అధిష్టానంతో పెద్ద పోరాటం చేయాల్సి వచ్చింది. శివాజీ కుమార్తె శిరీషకు టిక్కెట్టు ఇవ్వాలని టీడీపీ భావించింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన శివాజీ చివరికి తన అభ్యర్ధిత్వాన్నే ఖరారు చేయించుకున్నారు. మంత్రి పదవి విషయంలోనూ అచ్చెన్నాయుడు కంటే సీనియర్‌నైన తనకే అవకాశం ఇవ్వాలని ఆశించిన, అదే వాదనతో గట్టిగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో  శివాజీ అసంతృప్తితో రగిలిపోతున్నారు. అధిష్టానంపై యుద్ధం చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే శ్రీకాకుళం నుంచి విజయం సాధించిన గుండ లక్ష్మీదేవి మహిళల కోటాలో తనకు అవకాశం ఉంటుందని ఆశపడ్డారు. అయితే ఉత్తరాంధ్ర నుంచి మృణాళినికి స్థానం కల్పించడంతో లక్ష్మీదేవి కాస్త డీలా పడ్డారు.
 
 స్పీకర్ పదవైనా దక్కేనా?
 మంత్రి పదవి ఆశించి భంగపడిన కళావెంకటరావుకు స్పీకర్ పదవైనా దక్కుతుందో లేదోనన్న  ఉత్కంఠ ఆయన వర్గీల్లో నెలకొంది. స్పీకర్ పదవి సైతం దక్కే అవకాశాలు తక్కువని ఆ వర్గం వారే చెబుతున్నారు. స్పీకర్ పదవికి సీనియర్లు పోటీపడుతున్నారు. అంతేకాకుండా కళావెంకటరావుకు అత్యంత సమీప బంధువైన మృణాళినికి మంత్రి పదవి ఇవ్వడంతో స్పీకర్ పదవి కళావెంకటరావుకు లేనట్లేనని దేశం వర్గాలు చెబుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement