Accennayudu
-
టీడీపీ నాయకులకు దళితులంటే అలుసా!
దళితులపై తమకు ఉన్న చిన్నచూపును టీడీపీ నేతలు పదేపదే బయటపెడుతున్నారు. నలుగురిలోనూ వారిని దూషిస్తూ, హేళనగా మాట్లాడుతూ చులకన చేస్తున్నారు. దళితులు దేవుడి దగ్గరకు వస్తే దేవుడు మైలపడతాడంటూ ఎమ్మెల్యే శ్రీదేవిని ఇటీవల అడ్డుకున్నారు. రెండు రోజుల క్రితం దళితుల వల్లే ఈ దరిద్రం అంటూ దళిత మహిళా ఎస్ఐని మహిళా చైర్‌పర్సన్‌గా పనిచేసిన నన్నపనేని రాజకుమారి దూషించారు. ఇలా దళితులను కులం పేరుతో దూషించడం టీడీపీ నాయకులకు పరిపాటిగా మారింది. సాక్షి, గుంటూరు : ‘దళితులు దేవుడి దగ్గరకు వస్తే దేవుడు మైలపడతాడు.. దళితులు దరిద్రులు..’ ఇవీ టీడీపీ శ్రేణులకు దళితులపై ఉన్న అభిప్రాయాలు ఇవి. అధికారులంటే వారికి చులకన.. దళితులంటే చిన్న చూపు. ఆధునిక సమాజంలో బతుకుతున్నామన్న కనీస జ్ఞానాన్ని కూడా టీడీపీ నాయకులు విస్మరిస్తున్నారు. నేటికీ కులం పేరుతో ఎస్సీ, ఎస్టీలను దూషిస్తుండటమే కాకుండా వారిని కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు. నలుగురికీ ఆదర్శంగా ఉండాల్సిన హోదాలో ఉన్నామన్న ఇంగితాన్ని మరిచి అధికారులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. టీడీపీ బుధవారం చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమానికి అనుమతులు లేవని పోలీసులు అడ్డుకున్న సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఐపీఎస్ అధికారి విక్రాంత్ పాటిల్‌పై దౌర్జన్యానికి పాల్పడి, యూజ్లెస్ ఫెలో అని దూషించారు. బందోబస్తు విధులు నిర్వహిస్తున్న గుంటూరు అర్బన్ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ కోటయ్యపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు దౌర్జన్యానికి పాల్పడ్డారు. విక్రాంత్ పాటిల్, ఎస్ఐ కోటయ్యతో పాటు పలువురు పోలీసులను దూషించారు. ‘ఎవర్రా మీకు పోలీస్ ఉద్యోగాలు ఇచ్చింది’ అంటూ విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంపై ఎస్ఐ కోటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి పట్టణ పోలీసులు అచ్చెన్నాయుడుపై కేసు నమోదు చేశారు. దళితులంటే దరిద్రులా.. టీడీపీ మహిళా నేత, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మహిళా ఎస్ఐ అనురాధను కులం పేరుతో దూషించారు. ‘దళితులు దరిద్రులు.. మీ వల్లే మాకు ఈ పరిస్థితి పట్టింది’ అని కించపరిచారు. సాటి మహిళ అని కూడా చూడకుండా ఎస్ఐ అనురాధను నన్నపనేని రాజకుమారి కులం పేరుతో దూషించడంపై మహిళా, దళిత, ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని టీడీపీ నాయకులు కులం పేరుతో దూషించి ఘోరంగా అవమానించిన ఘటన చోటు చేసుకున్న వారం రోజులకే మరో దళిత మహిళా అధికారిపై టీడీపీ నాయకులు అగ్రకుల అహంకారం చూపించారు. ఎస్ఐ అనురాధను కులం పేరుతో దూషించిన ఘటనలో టీడీపీ మహిళా నాయకురాళ్లు నన్నపనేని రాజకుమారి, సత్యవాణిపై మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదివారికి కొత్తేమీ కాదు.. దళితులను కులం పేరుతో దూషించడం, అధికారులను చులకనగా చూడటం టీడీపీ నాయకులకు కొత్తేమీ కాదు. టీడీపీ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అనేక మంది అధికారులపై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. అక్రమంగా ఇసుక తరలిస్తున్న సమయంలో అడ్డుకున్నందుకు చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు మహిళా తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేశారు. రవాణా శాఖ కమిషనర్‌గా పనిచేసిన బాలసుబ్రహ్మణ్యం పై విజయవాడ ఎంపీ కేశినేని నాని, బొండా ఉమా, బుద్ధా వెంకన్న దౌర్జన్యానికి పాల్పడ్డారు. 2017లో గుంటూరు జిల్లా ముట్లూరులో జరిగిన వినాయక ఉత్సవాల్లో పాల్గొనేందుకు మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు గ్రామంలోకి వెళ్లగా అక్కడ టీడీపీలోని ఓ వర్గం వారు అతన్ని వేడుకల్లో పొల్గొనకుండా అడ్డగించి అవమానపరిచింది. చేసేదేమీ లేక మంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఆయన వెనుతిరిగి వచ్చారు. అప్పట్లో దళిత సంఘాలు అగ్రకులాల అహంకారాన్ని తప్పుపడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. 2019 జనవరి ఒకటిన అదే గ్రామంలో దళితులపై అగ్రకులాలకు చెందినవారు మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించమే కాకుండా ప్రశ్నించారనే కారణంగా దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలు కేంద్ర ఎస్సీ కమిషన్ దృష్టికి వెళ్లడంతో కమిషన్ సభ్యులు రాములు స్వయంగా గ్రామంలోకి వెళ్లి విచారణ జరిపారు. వాస్తవాలను తెలుసుకున్న అనంతరం నిందితులను అరెస్టు చేయకపోవడంపై అప్పటి పోలీస్ అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంఘటనలు ఉన్నాయి. -
సంజీవయ్య వర్సిటీలో సగం సీట్లు రాష్ట్రానికే
అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలోని సీట్లలో సగం ఇకనుంచి రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయి. ఈ మేరకు సంజీవయ్య న్యాయ వర్సిటీ చట్టానికి కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రి కె.అచ్చెన్నాయుడు శనివారం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. వర్సిటీలో ప్రస్తుత ప్రవేశ విధానానికి బదులుగా మొత్తం సీట్లలో 50 శాతం సీట్లను ఏపీ విద్యాసంస్థల ప్రవేశ, క్రమబద్ధీకరణ ఉత్తర్వులకు అనుగుణంగా భర్తీ చేయనున్నారు. 40 శాతం సీట్లను అఖిలభారత ప్రాతిపదికన, 10 శాతం ప్రవాస భారతీయులు, విదేశీ పౌరులకు కేటాయించేలా సవరణలను ప్రతిపాదించారు. యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉపకులపతుల పదవీకాలాన్ని మూడు నుంచి ఐదేళ్లకు పెంచేలా బిల్లులో పొందుపరిచారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌లోని వర్సిటీ క్యాంపస్ ప్రస్తుతం దీని పరిధిలో లేనందున చట్టంలోని నిజామాబాద్ అనే పదాన్ని ఉపసంహరిస్తున్నారు. -
‘విద్యుత్తు’లో క్రమబద్ధీకరణ కుదరదు
కాంట్రాక్టు కార్మికులకు సర్కారు మొండి చేయి వారికి అర్హతలే లేవన్న మంత్రి అచ్చెన్నాయుడు ఓట్ల కోసం హామీ ఇచ్చి ఇప్పుడు అన్యాయం చేస్తారా? సభలో ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్సీపీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులతో తమకు ఏమాత్రం సంబంధం లేదని ప్రభుత్వం శాసనసభలో స్పష్టం చేసింది. అసలు వారు ప్రభుత్వ ఉద్యోగులే కాదని, క్రమబద్ధీకరించే యోచనేదీ లేదని తేల్చి చెప్పింది. ఒప్పంద కార్మికులంతా అర్హత లేకుండా, అడ్డదారిన విద్యుత్ రంగంలోకి వచ్చారని సాక్షాత్తూ మంత్రి అచ్చెన్నాయుడు చులకనగా మాట్లాడటం సభలో గందరగోళానికి దారి తీసింది. వారి సమస్యలను పరిశీలిస్తామనే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు మంత్రి పేర్కొనటాన్ని వైఎస్సార్సీపీ ఆక్షే పించింది. శాసనసభలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని వైఎస్సార్ సీపీ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తావించారు. దీనికి కార్మిక, ఉపాధి శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బదులిస్తూ విద్యుత్ రంగంలో కాంట్రాక్టు ఉద్యోగులే లేరన్నారు. దీనిపై పెద్దిరెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తామని ఎన్నికల్లో టీడీపీ హామీ ఇచ్చిందన్నారు. కార్మికులకు అన్యాయం చేయవద్దని వైఎస్సార్ సీపీ సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉప్పులేటి కల్పన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కనీస వేతనాలందేలా చూస్తాం: మంత్రి ప్రభుత్వం కేవలం కాంట్రాక్టు ఉద్యోగుల పర్మనెంట్ విషయమై సబ్ కమిటీ వేసిందని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కాంట్రాక్టర్ ద్వారా వారికి కనీస వేతనాలు అందేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ తీరును విపక్ష నేత జగన్ తప్పుబట్టారు. వారిని తమ ప్రభుత్వం వచ్చాక రెగ్యులర్ చేస్తామన్నారు. భరోసానిచ్చిన జగన్ హామీ: సీతారాం తమను ఉద్యోగులే కాదంటూ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించటాన్ని ఏపీ విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కేఎన్వీ సీతారాం తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పర్మనెంట్ చేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇవ్వటాన్ని స్వాగతించారు. ఈ మాటలు ధైర్యాన్నిచ్చాయన్నారు. మేం వచ్చిన తర్వాతైనా పర్మనెంట్ చేస్తాం: జగన్ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించేదే లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయటంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కార్మికుల్ని నమ్మించి వంచించటంపై నిప్పులు చెరిగారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ఒప్పంద కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తామని శాసనసభ్యుల హర్షధ్వానాల మధ్య సభలో ప్రకటించారు. ‘ఎన్నికల మానిఫెస్టోలో మీరు చెప్పిందేమిటి? ఆ రోజు మీరేమైనా కాంట్రాక్టు సిబ్బంది వేరే, ఔట్సోర్సింగ్ వేరే అని చెప్పారా? ఔట్‌సోర్సింగ్‌లోనూ అదే అర్హతలున్నవాళ్లే ఉన్నారు. పోస్టుకు తగ్గ అర్హతలున్నవారినే ఎంపిక చేశా రు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టుకు రెండింటికీ చాలా చిన్న తేడా ఉంది. క్వాలిఫికేషన్లో తేడా లేదు. మీ మేనిఫెస్టోలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేస్తామన్నారు. ఉద్యోగులంతా మీ మాటలు నమ్మారు. వాళ్లను ఇవాళ నట్టేట ముంచొద్దండీ అని గట్టిగా చెబుతున్నాం. ఇంకొకటి కూడా చెబుతున్నాం. మీరు ఒకవేళ చేయకపోతే... మేం వచ్చిన తర్వాతైనా పర్మినెంట్ చేస్తామనే భరోసా ఒప్పంద కార్మికులకిస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి పర్మినెంట్ చేయమని ప్రభుత్వానికి చెబుతున్నాం’ అని జగన్ పేర్కొన్నారు. -
కార్యకర్తల అభీష్టం మేరకే పాలన
శ్రీకాకుళం సిటీ: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలే ప్రధాన కారణమని, వారి ఆలోచనలు, సూచనల మేరకు ప్రభుత్వం పాలన సాగిస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు చెప్పారు. గురువారం ఆయన స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జి అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ నెల 17, 18 తేదీల్లో సీఎం చంద్రబాబు జిల్లా పర్యటిస్తారని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలో పాలన గాడిలో పడాల్సి ఉందన్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణానికి కలెక్టర్ 90 సెంట్ల భూమి కేటాయించారని, ప్రతి కార్యకర్త గర్వపడేలా భవనం నిర్మిస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ప్రదర్శించిన వైఖరి సరిగా లేదన్నారు. విధాన నిర్ణయాలు వ్యతిరేకించే అధికారుల భరతం పడతాం:కూన ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ అధికారులెవరైనా సరే టీడీపీ ప్రభుత్వ పరంగానే పనిచేయా ల్సి ఉంటుందని, అలాకాకుండా పార్టీ విధాన నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తే వారి భరతం పడతామని హెచ్చరించారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని చెప్పారు. ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ జిల్లా సమర్థులకే పార్టీ పదవులు కట్టబెట్టిందని, జిల్లా ప్రగతి పథం పడుతుందని పేర్కొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయానికి తన తండ్రి ఎర్రన్నాయుడు పేరు పెట్టాలని కోరారు. చౌదరి బాబ్జీ మాట్లాడుతూ జిల్లాలో పార్టీ వైభవానికి దివంగత ఎర్రంనాయుడే కారణమని, జిల్లాకు, పోలవరం ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని తీర్మానం చేశామన్నారు. అంతకుముందు పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ పదేళ్లుగా ఇబ్బందులు పడుతున్న తమను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ధనలక్ష్మి, శ్రీకాకుళం, నరసన్నపేట, ఇచ్ఛాపురం ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, బెందాళం అశోక్, మాజీ ఎమ్మెల్సీ గొర్లె హరిబాబునాయుడు, మాజీ ఎమ్మెల్యేలు దువ్వాడ నాగావళి, తలే భద్రయ్య, పాతపట్నం, పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జిలు శత్రుచర్ల విజయరామరాజు, నిమ్మక జయకృష్ణ, జిల్లా పార్టీ ముఖ్యులు పి.వి.రమణ, పేర్ల గోవిందరాజులు, జామి భీమశంకర్, గొండు వెంకటరమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
అకాడమీలతో.. ‘ఆట’పట్టు
శ్రీకాకుళం స్పోర్ట్స్:సిక్కోలు ఇక క్రీడల ఖిల్లాగా వెలుగొం దనుంది. పలు శిక్షణ సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వస్థాయిలో దాదాపు నిర్ణయాలు తీసుకోవడంతో జిల్లా క్రీడాకారులకు మంచిరోజులు రానున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం కూడా దీనికి సంబంధించి అన్ని వివరాలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయడం దాదాపు ఖరారు కాగా.. తాజాగా రెండు స్పోర్ట్స్ అకాడమీలు మంజూరైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. హాకీ, ఫుట్‌బాల్ క్రీడలకు సంబంధించిన అకాడమీలను జిల్లాకు కేటాయిం చారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర కార్మిక, క్రీడల శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ మేరకు శాప్ ఎండీకి లేఖ రాసినట్లు సమాచారం. దాంతో అకాడమీల ఏర్పాటుకు సంబంధించి కొద్దిరోజుల్లోనే ఉత్తర్వులు వెలువడనున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. గతంలో ఇక్కడ అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ అకాడమీలను నిర్వహించేవారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణానంతరం ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో దాదాపు నాలుగేళ్ల క్రితమే ఇవి మూతపడ్డాయి. ఇంతకాలానికి మళ్లీ స్పోర్ట్స్ అకాడమీలు జిల్లాకు మంజూరు కానుండటంపై ఆయా క్రీడాంశాల్లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు, ఆ సంఘాల ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేఆర్స్టేడియంలోనే.. కాగా కొత్తగా మంజూరు కానున్న రెండు అకాడమీలను ఎక్కడ నిర్వహించాలనే దానిపై అధికారవర్గాలు త ర్జనభర్జనలు పడుతున్నాయి. అయితే జిల్లా కేంద్రంలో అందరికీ అందుబాటులో ఉన్నకోడిరామ్మూర్తి స్టేడియంలోనే నిర్వహించాలని ఎక్కువమంది సూచిస్తున్నారు. మైదానం, కోచ్‌తోపాటు డీఎస్ఏ ప్రత్యేక గదులు అందుబాటులో ఉండటం వల్ల ఇక్కడ ఏర్పాటు చేస్తేనే క్రీడాకారులకు సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. శిక్షణ కోసం ఒక్కో అకాడమాకి 50 మంది వరకు క్రీడాకారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అంటే రెండు అకాడమీలకు కలిపి 100 మంది వరకు ఉంటారు. దీంతో వీరందరకీ వసతి, భోజన సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా బాలికలు సైతం అకాడమీలో ఉంటారు కనుక అందరికీ ఒకేచోట వసతి కల్పిస్తే బాలికలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించలేమన్న వాదన వినిపిస్తోంది. దీంతో ఒక అకాడమీని ఐటీడీఏ పరిధిలోని సీతంపేట లేదా మల్లి ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. క్రీడాసంఘాల పెదవి విరుపు.. ఇదిలా ఉండగా జిల్లాలో డీఎస్ఏ తరఫున ఎన్ఐఎస్ పూర్తిచేసిన శిక్షకులు ఉన్నారన్న నెపంతో తక్కువ ఆదరణ ఉన్న హాకీ, ఫుట్‌బాల్ అకాడమీలు మంజూరు చేస్తుండటంపై మిగిలిన క్రీడాసంఘాల ప్రతినిధులు, పీడీలు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, హ్యాండ్‌బాల్, తైక్వాండో క్రీడాంశాలకు మంచి ఆదరణ ఉంది. వీటిని కాకుండా ఆదరణ లేని క్రీడా అకాడమీలు ఎందుకని పీఈటీలు, క్రీడాసంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఉత్తర్వులు రావాల్సి ఉంది : జూన్ గెల్యూట్, డీఎస్డీవో జిల్లాకు రెండు స్పోర్ట్స్ అకాడమీలు మంజూరు చేస్తున్నమాట వాస్తవమే. శిక్షకులు ఉన్న క్రీడాంశాల జాబితా పంపించాం. మంత్రి అచ్చెన్నాయుడు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ లేఖలు రాశారు. దాదాపు మంజూరైనట్లే. అధికారికంగా ఉత్తర్వులు అందాల్సి ఉంది. -
మూడు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు
రిమ్స్‌క్యాంపస్: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మున్సిపాలిటీలకు మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగకుండా ఉన్న మున్సిపాల్టీల్లో ఎలక్షన్లు నిర్వహించేందుకు మంత్రివర్గం నిర్ణయిం చిందన్నారు. దీంతో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న శ్రీకాకుళం, రాజాం మున్సిపాలిటీలకు కూడా మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. శ్రీకాకుళానికి సంబంధించి కోర్టులో కేసు వేసిన వారితో చర్చలు జరిపి.. వారిని ఒప్పించి ఎన్నికలు జరిగేలా చర్యలు చేపడతామన్నారు. సూర్యదేవుని సమస్యల పరిష్కారానికి సహకరిస్తా శ్రీకాకుళం కల్చరల్: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి దేవస్థానంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు సహకారం అందిస్తానని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు అన్నా రు. సోమవారం స్వామి వారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ సమస్యలను శాసనసభ్యుల ద్వారా తనకు తెలియజేస్తే వాటిని దేవాదాయశాఖ కమిషనర్‌తో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిత్య అన్నదాన పథకంపై ఈవోతో చర్చించారు. ఇక్కడ జరుగుతున్న నిత్య అన్నదాన పథకం ఇంకా పెంపు చేయాలని కోరారు. నిర్మాణం లో ఉన్న టూరిజం హోటల్, టీటీడీ నూతనంగా నిర్మించనున్న కల్యాణ మండపం వివరాలను మంత్రికి అధికారులు, అర్చకులు వివరించారు. నాలుగేళ్లుగా ఏడాదికి మూడు కోట్ల రూపాయలకు మించిన ఆదాయం వస్తుందని, దీన్ని డీసీ స్థాయికి పెంచాల్సిన అవశ్యకత ఉందని మంత్రిని కోరారు. సిబ్బంది కొరత ఎక్కువగా ఉన్న విషయాన్ని అచ్చెన్న దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తానని అన్నారు. అనివెట్టి మండపంలో ఆలయ ప్రధానఅర్చకుడు ఇప్పిలి శం కరశర్మ మహాదాశీర్వవచనం చేసి, స్వామివారి ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని మంత్రికి సమర్పించారు. ఈయనతోపాటుగా ఎమ్మె ల్యే గుండ లక్ష్మీదేవి, ఆర్డీవో జి.గణేష్, ఈవో ఆర్.పుష్పనాథం పాల్గొన్నారు. -
బెంబేలెత్తించిన మంత్రి అచ్చెన్న
శ్రీకాకుళం కలెక్టరేట్: రాష్ట్ర కార్మిక, యువజన సర్వీసులు, క్రీడల శాఖ ల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం వివిధ శాఖల అధికారులను బెంబేలెత్తించారు. జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో తన ప్రతాపం చూపించారు. రాష్ట్రమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆయన నిర్వహించిన సమీక్ష సాదాసీదాగా సాగుతుందని అధికారులు భావించారు. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. వ్యవసాయ శాఖపై సమీక్షతో సమావేశాన్ని ప్రారంభించిన మంత్రి, ఎరువులు సక్రమంగా అందజేయాలని అధికారులకు గట్టిగా చెప్పారు. నీటి పారుదల, వంశధార ప్రాజెక్టులపై సమీక్ష జరిగినపుడు మంత్రి తీరు పూర్తిగా మారింది. నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల పరిధిలోని అంశాలను ప్రధానంగా తీసుకుని ఇంజినీర్లపై ఆయన మండిపడ్డారు. నరసన్నపేటలోని బీసీ సంక్షేమ వసతిగృహాన్ని ఎత్తివేసే అధికారం ఎవరిచ్చారని సంబంధిత ఈఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిని గమనించిన కలెక్టర్ సౌరభ్‌గౌర్ కల్పించుకుంటూ తదుపరి సమావేశంలో అన్ని అంశాలను కూలంకుషంగా చర్చిద్దామని, ఈ సమావేశాన్ని పరిచయాలకు పరిమితం చేయాలని మంత్రిని కోరారు. అనంతరం రిమ్స్, వైద్యఆరోగ్య శాఖలపై సమీక్షలు లోతుగా జరగకుండా కలెక్టర్ జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులపై పట్టు సాధించేందుకే మంత్రి ఇలా వ్యవహరించారని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. -
జట్టుగా సాగుదాం
శ్రీకాకుళం కలెక్టరేట్: జిల్లా సమగ్ర అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖల మంత్రి కింజ రాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాలోని పలు శాఖల అధికారులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశాం త వాతావరణంలో ప్రారంభమైనసమావేశం నీటిపారదల శాఖపై చర్చ సందర్భంగా కొంత వేడెక్కింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల వంశధార, ఆఫ్‌షోర్ ప్రాజెక్టుల నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయని, కాంట్రాక్టర్ల పట్ల ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఈఈ రాంబాబును మంత్రి నిలదీశారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ. 2,500 కోట్లు అవసరమని అధికారులు చెప్పగా, నిధుల విషయం తనకు విడిచిపెట్టి మిగతా విషయాలు చూసుకోవాలని సూచించారు. ఈ ఖరీఫ్ సీజన్లో వంశధార, నాగావళి కాలువల ద్వారా చివరి ఎకరాకు కూడా నీరు అందించాలన్నారు. జిల్లాకు ఎన్ని విత్తనాలు అవసరమో అంచనా వేసి, 80 శాతం వరకు ప్రభుత్వం నుంచి తెప్పించుకునేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. విత్తనాల కొరత లేకుండా చూడాలని సూచించారు. పంట రుణాలు, ఎరువుల విషయంలో శ్రద్ధ చూపాలన్నారు. రైతు రుణమాఫీకి సంబంధించి జాబితాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయానికి విద్యుత్ కోత లేకుండా చూస్తామని మంత్రి చెప్పారు. విద్యార్థులు లేరనే సాకుతో మూసివేసిన పాఠశాలలను తక్షణమే తెరవాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. బెల్టుషాపులు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఎక్సైజ్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ, రిమ్స్, ఎన్ఆర్ఈజీఎస్, తదితర శాఖలపై సమీక్షించారు. ఆధికారులందరూ స్థానికంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. స్థానికంగా ఉండనివారు సమస్యలను ఎప్పటికప్పుడు ఎలా పరిష్కరించగలరని ప్రశ్నించారు. రైతులకు ఇబ్బందులురానివ్వం: కలెక్టర్ ఖరీఫ్ సీజన్ లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రానివ్వమని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ తెలిపారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈసారి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది రూ. 1722.39 కోట్ల పంట రుణాలు అందజేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 49 వేల క్వింటాళ్ల రాయితీ విత్తనాలు అవసరం కాగా ఇప్పటికే 40వేల క్వింటాళ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. మిగిలిన వాటిని కూడా రైతుల అవసరాన్ని బట్టి సరఫరా చేస్తామన్నారు. సాధ్యమైనంతవరకు విత్తనాలకు రైతులు ప్రైవేటు వ్యాపారులపై ఆధారపడే పరిస్థితి రాకుండా చూస్తామన్నారు. ఈ సమావేశంలో లోక్‌సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బెందాళం ప్రకాశ్, బగ్గు రమణమూర్తి, కంబాల జోగులు, ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, ఏజేసీ హసీం షరీఫ్, డీఆర్వో నూర్ బాషా కాశీం, పలు శాఖల ఆదికారులు పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తల హల్చల్ సమావేశంలో ఆధికారులు, సిబ్బంది కంటే టీడీపీ కార్యకర్తల హడావుడి ఎక్కువగా కనిపించింది. టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సమావేశ మందిరంలోకి చొచ్చుకురావడంతో పలువురు ఉద్యోగులకు సీట్లు లేకుండాపోయాయి. ప్రవేశ ద్వారం వద్ద కూడా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడటంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఒకదశలో ఉద్యోగులు కాని వారు బయటకు వెళ్లాలని అధికారులు కోరినా ఫలితం లేకపోయింది. -
అబ్బో.. ఏం ప్రాధాన్యం!
శ్రీకాకుళం: మంత్రి పదవి విషయంలో పంతం నెగ్గించుకున్న కింజరాపు అచ్చెన్నాయుడు శాఖల కేటాయింపులో మాత్రం షాక్ తిన్నారు. ఆయనకు ఏమాత్రం ప్రాధాన్యం లేని శాఖలను కట్టబెట్టడంతో జిల్లాలోని ఆ వర్గంలో నిస్పృహ, అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ‘కళా’ వర్గం ఒత్తిళ్లు ఏమైనా పనిచేశాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అచ్చెన్నాయడు మంత్రిగా ప్రమాణం చేసిన నాటి నుంచి ఆయనకు పంచాయతీరాజ్ శాఖ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ బుధవారం జరిగిన శాఖల కేటాయింపులో అచ్చెన్నకు కార్మిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఇచ్చారు. ఫలితంగా మంత్రి పదవి దక్కిందన్న ఆనందాన్ని ప్రాధాన్యత లేని శాఖ కేటాయింపు మింగేసింది. ఇది చాలదన్నట్లు జిల్లాలో తమకు ప్రత్యర్థి వర్గంగా ఉన్న కళావెంకట్రావు మరదలైన చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి మృణాళినికి కీలకమైన గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించడాన్ని కింజరాపు వర్గం జీర్ణించుకోలేకపోతోంది. జిల్లా నుంచి మంత్రి పదవి కోసం అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావులు తీవ్రంగా పోటీ పడ్డారు. ఎవరిస్థాయిలో వారు అధిష్టానం వద్ద లాబీయింగ్ చేసుకున్నారు. మొదట్లో కళాకు మంత్రి పదవి ఖాయమని వార్తలు వచ్చినా ప్రమాణం స్వీకారం నాటికి అచ్చెన్నాయుడు దాన్ని ఎగరేసుకుపోవడంతో కళా వర్గం చిన్నబోయింది. కింజరాపు వర్గానిదే పైచేయి అవుతోందని ఆందోళన చెందిన కళా వర్గం చంద్రబాబుపై తెచ్చిన తీవ్ర ఒత్తిడి ఫలితంగానే అచ్చెన్నాయుడుకు ప్రాధాన్యత లేని శాఖను కేటాయించారని కింజరాపు వర్గంతోపాటు టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ పరిణామం జిల్లా టీడీపీలో వర్గపోరును మళ్లీ తీవ్రతరం అవుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా దివంగత వైఎస్ హయాంలో శ్రీకాాకుళం జిల్లా మంత్రలకు రెవెన్యూ, అటవీ, రవాణా వంటి కీలక శాఖలతో ప్రాధాన్యమిచ్చారు. ఆయన ఆనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాలు సైతం అత్యంత ప్రాధాన్యత కలిగిన వైద్య ఆరోగ్యం, రోడ్లు, భవనాల శాఖలను కేటాయించడం ద్వారా జిల్లాను గౌరవించగా.. టీడీపీ ప్రభుత్వంలో జిల్లాకు ప్రాధాన్యత లేని శాఖలు కేటాయించడం కంటే ప్రాతినిధ్యం లేకుండా చేస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
అచ్చెన్నకే చాన్స్.. ప్రత్యర్థుల కళావరం!
జిల్లా నుంచి మంత్రివర్గంలో ఒక్కరికే అవకాశం అధిష్టానం వద్ద పట్టు నిరూపించుకున్న కింజరాపు వర్గం తొలిసారి అచ్చెన్నాయుడుకు అమాత్యయోగం జిల్లా పార్టీలో వైరి వర్గంపై మరోమారు పైచేయి చివరి క్షణంలో అవకాశం చేజారడంతో కళా వర్గం ఆందోళన మరోవైపు అసంతృప్తితో రగిలిపోతున్న శివాజీ అచ్చెన్నాయుడు మంత్రి అయ్యారు. జిల్లా తెలుగుదేశంలోనూ.. అధిష్టానం వద్దా కింజరాపు వర్గానిదే ఆధిపత్యమని రుజువు చేశారు. జిల్లాలో మొదటి నుంచీ వర్గాలుగా ఉన్న కింజరాపు, కళా వర్గాలు సార్వత్రిక ఎన్నికల నుంచి జిల్లాపై పట్టు కోసం ఎత్తులు పై ఎత్తులు వేస్తూ వచ్చాయి. చివరికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కోసం ఈ ఇద్దరితోపాటు శివాజీ కూడా పోటీ పడి తుది కంటా ప్రయత్నాలు సాగించారు. కళా వెంకట్రావు పేరు మంత్రి లేదా స్పీకర్ పదవికి గట్టిగా వినిపించింది. చివరికి అచ్చెన్న ఆ చాన్స్ కొట్టేశారు. స్పీకర్ పదవైనా దక్కుతుందా?.. లేక మంత్రివర్గ విస్తరణలో అవకాశమిస్తారా??.. లేకపోతే మొత్తంగా మొండిచెయ్యి చూపిస్తారా???.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు కళా వర్గాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి. శ్రీకాకుళం, న్యూస్‌లైన్: కొత్త రాష్ట్రంలో.. కొత్త ప్రభుత్వంలో.. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కొత్త నేతను మంత్రి పదవి వరించింది. టీడీపీ మంత్రివర్గంలో జిల్లా నుంచి టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఒక్కరికే చోటు దక్కడంతో ఇన్నాళ్లు ఈ విషయంలో సాగుతున్న చతుర్ముఖ పోటీకి తెర పడింది. అమాత్య పదవి కొట్టేయడం ద్వారా అధిష్టానం వద్ద తమ పట్టును నిరూపించుకున్న కింజరాపు కుటుంబం.. అదే ఊపులో జిల్లా పార్టీపై అధిపత్యానికి మార్గం సుగమం చేసుకుంది. ఈ పరిణామం కింజరాపు వర్గంతో ఢీ అంటే ఢీ అంటున్న కళా వర్గానికి మింగుడు పడనిదే. మరోవైపు శివాజీ వర్గం కూడా తమ నేతకు పదవి దక్కకపోవడంపై గుర్రుగా ఉంది. ఈ పరిణామాలు జిల్లా టీడీపీలో బలాబలాల పునరేకీకరణకు దారి తీసే అవకాశం ఉంది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా.. తొలిసారి మంత్రిగా.. నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అచ్చెన్నాయుడు మంత్రి పదవి సాధించడం ద్వారా జిల్లాలో కింజరాపు కుటుంబానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చారని ఆ వర్గీయులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దివంగత మాజీ ఎంపీ ఎర్రన్నాయడు సోదరుడైన అచ్చెన్న 1996లో జరిగిన ఉప ఎన్నికల ద్వారా ఎమ్మెల్యే అయ్యారు. అప్పటివరకు హరిశ్చంద్రపురం ఎమ్మెల్యేగా ఉన్న ఎర్రన్నాయుడు 1996 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో అచ్చెన్న ఉప ఎన్నికల్లో గెలుపొంది తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1999, 2004లలో కూడా ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన నియోజకవర్గాల పునర్వ్య వస్థీకరణ అనంతరం టెక్కలి నుంచి 2009 సాధారణ, ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. తాజాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ టెక్కలి నుంచే పోటీ చేసి నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. రాజకీయ, సామాజిక వర్గాల కూర్పులో భాగంగా అచ్చెన్నకు మంత్రివర్గంలో స్థానం లభించిందని అంటున్నారు. కళా, గౌతులపై పైచేయి మంత్రి పదవి దక్కించుకోవడం ద్వారా జిల్లా టీడీపీ లో తమ ఆధిపత్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడని కళా, శివాజీ వర్గాలపై కింజరాపు వర్గం పైచేయి సాధించింది. ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు నుంచి పట్టు కోసం ఈ మూడు వర్గాలు తలపడిన విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా ఇచ్ఛాపురం, పాతపట్నం, నరసన్నపేటల్లో ఒకదాన్ని బీజేపీకి ఇవ్వాలని అధిష్టానం భావించగా.. కింజరాపు వర్గం తీవ్రస్థాయి లో ఒత్తిడి తెచ్చి నిర్ణయం మార్చుకునేలా చేసింది. అదే సమయంలో పాలకొండ డివిజన్లో తాను చెప్పిన వారికే సీటు ఇప్పించుకోవడంలో కళా వెంకట్రావు విఫలమయ్యారు. దీంతో ఆ డివిజన్లో టీడీపీ అభ్యర్థుల ఓటమికి కళా వర్గం ప్రయత్నించిందన్న ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఇక మంత్రివర్గంలో చివరి క్షణం వరకు కళావెంకటరావు పేరు పరిశీలించిన చంద్రబాబు చివరికి అచ్చెన్నాయుడు వైపే మొగ్గు చూపారు. అదే సమయంలో కళాను చల్లబరిచేందుకుగానూ ఆయన మరదలు కిమిడి మృణాళినికి అవకాశం ఇచ్చారు. కాగా గౌతు శివాజీ వర్గాన్ని తొలి నుంచి అధిష్టానం పక్కన పెడుతూ వచ్చింది. తన టిక్కెట్టు కోసమే శివాజీ అధిష్టానంతో పెద్ద పోరాటం చేయాల్సి వచ్చింది. శివాజీ కుమార్తె శిరీషకు టిక్కెట్టు ఇవ్వాలని టీడీపీ భావించింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన శివాజీ చివరికి తన అభ్యర్ధిత్వాన్నే ఖరారు చేయించుకున్నారు. మంత్రి పదవి విషయంలోనూ అచ్చెన్నాయుడు కంటే సీనియర్‌నైన తనకే అవకాశం ఇవ్వాలని ఆశించిన, అదే వాదనతో గట్టిగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో శివాజీ అసంతృప్తితో రగిలిపోతున్నారు. అధిష్టానంపై యుద్ధం చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే శ్రీకాకుళం నుంచి విజయం సాధించిన గుండ లక్ష్మీదేవి మహిళల కోటాలో తనకు అవకాశం ఉంటుందని ఆశపడ్డారు. అయితే ఉత్తరాంధ్ర నుంచి మృణాళినికి స్థానం కల్పించడంతో లక్ష్మీదేవి కాస్త డీలా పడ్డారు. స్పీకర్ పదవైనా దక్కేనా? మంత్రి పదవి ఆశించి భంగపడిన కళావెంకటరావుకు స్పీకర్ పదవైనా దక్కుతుందో లేదోనన్న ఉత్కంఠ ఆయన వర్గీల్లో నెలకొంది. స్పీకర్ పదవి సైతం దక్కే అవకాశాలు తక్కువని ఆ వర్గం వారే చెబుతున్నారు. స్పీకర్ పదవికి సీనియర్లు పోటీపడుతున్నారు. అంతేకాకుండా కళావెంకటరావుకు అత్యంత సమీప బంధువైన మృణాళినికి మంత్రి పదవి ఇవ్వడంతో స్పీకర్ పదవి కళావెంకటరావుకు లేనట్లేనని దేశం వర్గాలు చెబుతున్నాయి. -
ఎంపీపీ అభ్యర్థి ఎంపికలో అచ్చెన్న డ్రామా
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: కోటబొమ్మాళి మండలంలో తన మాటకు ఎదురే ఉండదని రీతిలో వ్యవహిస్తున్న మాజీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఎంపీపీ విషయంలో తన వర్గంలోని వారికే గట్టి షాక్ ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఈ పదవిని మాజీ ఎంపీపీ వెలమల విజయలక్ష్మితోపాటు తిలారు సర్పంచ్ తర్రా రామకృష్ణ ఆశిస్తున్నారు. దీంతో అచ్చెన్న తెరవెనుక రాజకీయానికి తెరతీశారు. రామకృష్ణకు మద్దతు ఇస్తున్నట్లు అచ్చెన్న ప్రకటిస్తే విజయలక్ష్మికే మద్దతని అచ్చెన్న సోదరుడు ప్రసాద్ అంటున్నారు. ఎంపీపీగా రామకృష్ణ పేరును బుధవారమే ప్రకటించిన అచ్చెన్న ఆ విషయాన్ని విజయలక్ష్మికి చెప్పి బరిలోంచి తప్పుకోవాలన్నారు. దీంతో నామినేషన్ వే సేందుకు సిద్ధమైన ఆమె నిరుత్సాహంగా ఉండిపోయారు. ఆమె మరో ఆరుగురితో పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. తనకు అవకాశం ఇవ్వకపోతే పార్టీని వీడుతానని రామకృష్ణ హెచ్చరించడంతో అచ్చెన్న సీను నుంచి తాను తప్పుకుని మండల పార్టీ అధ్యక్షుడు బోయిన రమేష్‌ను పంపించి తర్రాకే మద్దతిస్తున్నట్లు చెప్పించారు. మరోవైపు విజయలక్ష్మికీ అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చేలా సోదరుడు ప్రసాద్ ద్వారా కబురు పంపించి గురువారం ఆమె చేత నామినేషన్ వేయించారు. దీనివెనుక లోగుట్టు పరిశీలించిన రామకృష్ణ తన తల్లి దమయంతితో హడావుడిగా నామినేషన్ వేయించారు. దీంతో అచ్చెన్న వ్యూహం బెడిసికొట్టింది. అయినప్పటికీ గురువారం బయటకు రాకుండా కథ నడిపించే యత్నం చేశారు. తర్రా వంటి సీనియర్ నేత వేరే పార్టీకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ఎంపీపీ ఆశ చూపించారని, ఏదిఏమైనా అచ్చెన్నకు సన్నిహితురాలైన విజయలక్ష్మికే ఆయన ఎంపీపీ ఇప్పిస్తారని ఆయన స్వభావం తెలిసిన వారు అంటున్నారు. దీంతో ఎంపీపీ అభ్యర్థిత్వం రాకపోతే తర్రా బృందం పార్టీని వీడేందుకు వీలుగా గురువారం రాత్రి తిలారులో సమావేశమయ్యారు. ఏక్షణంలోనైనా అచ్చెన్న తన నిర్ణయం మార్చుకుంటే గట్టిగా బుద్ధి చెప్పడానికి కార్యకర్తలు సిద్ధపడుతున్నారు. ఇదే తీరులో అటు విజయలక్ష్మి అనుచరులు ఉన్నట్లు తెలుస్తోంది.