సంజీవయ్య వర్సిటీలో సగం సీట్లు రాష్ట్రానికే
అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలోని సీట్లలో సగం ఇకనుంచి రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయి. ఈ మేరకు సంజీవయ్య న్యాయ వర్సిటీ చట్టానికి కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రి కె.అచ్చెన్నాయుడు శనివారం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. వర్సిటీలో ప్రస్తుత ప్రవేశ విధానానికి బదులుగా మొత్తం సీట్లలో 50 శాతం సీట్లను ఏపీ విద్యాసంస్థల ప్రవేశ, క్రమబద్ధీకరణ ఉత్తర్వులకు అనుగుణంగా భర్తీ చేయనున్నారు. 40 శాతం సీట్లను అఖిలభారత ప్రాతిపదికన, 10 శాతం ప్రవాస భారతీయులు, విదేశీ పౌరులకు కేటాయించేలా సవరణలను ప్రతిపాదించారు. యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉపకులపతుల పదవీకాలాన్ని మూడు నుంచి ఐదేళ్లకు పెంచేలా బిల్లులో పొందుపరిచారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌లోని వర్సిటీ క్యాంపస్ ప్రస్తుతం దీని పరిధిలో లేనందున చట్టంలోని నిజామాబాద్ అనే పదాన్ని ఉపసంహరిస్తున్నారు.