కోటబొమ్మాళి మండలంలో తన మాటకు ఎదురే ఉండదని రీతిలో వ్యవహిస్తున్న మాజీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఎంపీపీ విషయంలో తన వర్గంలోని వారికే గట్టి షాక్ ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు.
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: కోటబొమ్మాళి మండలంలో తన మాటకు ఎదురే ఉండదని రీతిలో వ్యవహిస్తున్న మాజీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఎంపీపీ విషయంలో తన వర్గంలోని వారికే గట్టి షాక్ ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఈ పదవిని మాజీ ఎంపీపీ వెలమల విజయలక్ష్మితోపాటు తిలారు సర్పంచ్ తర్రా రామకృష్ణ ఆశిస్తున్నారు. దీంతో అచ్చెన్న తెరవెనుక రాజకీయానికి తెరతీశారు.
రామకృష్ణకు మద్దతు ఇస్తున్నట్లు అచ్చెన్న ప్రకటిస్తే విజయలక్ష్మికే మద్దతని అచ్చెన్న సోదరుడు ప్రసాద్ అంటున్నారు. ఎంపీపీగా రామకృష్ణ పేరును బుధవారమే ప్రకటించిన అచ్చెన్న ఆ విషయాన్ని విజయలక్ష్మికి చెప్పి బరిలోంచి తప్పుకోవాలన్నారు. దీంతో నామినేషన్ వే సేందుకు సిద్ధమైన ఆమె నిరుత్సాహంగా ఉండిపోయారు. ఆమె మరో ఆరుగురితో పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. తనకు అవకాశం ఇవ్వకపోతే పార్టీని వీడుతానని రామకృష్ణ హెచ్చరించడంతో అచ్చెన్న సీను నుంచి తాను తప్పుకుని మండల పార్టీ అధ్యక్షుడు బోయిన రమేష్‌ను పంపించి తర్రాకే మద్దతిస్తున్నట్లు చెప్పించారు. మరోవైపు విజయలక్ష్మికీ అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చేలా సోదరుడు ప్రసాద్ ద్వారా కబురు పంపించి గురువారం ఆమె చేత నామినేషన్ వేయించారు.
దీనివెనుక లోగుట్టు పరిశీలించిన రామకృష్ణ తన తల్లి దమయంతితో హడావుడిగా నామినేషన్ వేయించారు. దీంతో అచ్చెన్న వ్యూహం బెడిసికొట్టింది. అయినప్పటికీ గురువారం బయటకు రాకుండా కథ నడిపించే యత్నం చేశారు. తర్రా వంటి సీనియర్ నేత వేరే పార్టీకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ఎంపీపీ ఆశ చూపించారని, ఏదిఏమైనా అచ్చెన్నకు సన్నిహితురాలైన విజయలక్ష్మికే ఆయన ఎంపీపీ ఇప్పిస్తారని ఆయన స్వభావం తెలిసిన వారు అంటున్నారు.
దీంతో ఎంపీపీ అభ్యర్థిత్వం రాకపోతే తర్రా బృందం పార్టీని వీడేందుకు వీలుగా గురువారం రాత్రి తిలారులో సమావేశమయ్యారు. ఏక్షణంలోనైనా అచ్చెన్న తన నిర్ణయం మార్చుకుంటే గట్టిగా బుద్ధి చెప్పడానికి కార్యకర్తలు సిద్ధపడుతున్నారు. ఇదే తీరులో అటు విజయలక్ష్మి అనుచరులు ఉన్నట్లు తెలుస్తోంది.