శ్రీకాకుళం కలెక్టరేట్: రాష్ట్ర కార్మిక, యువజన సర్వీసులు, క్రీడల శాఖ ల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం వివిధ శాఖల అధికారులను బెంబేలెత్తించారు. జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో తన ప్రతాపం చూపించారు. రాష్ట్రమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆయన నిర్వహించిన సమీక్ష సాదాసీదాగా సాగుతుందని అధికారులు భావించారు. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. వ్యవసాయ శాఖపై సమీక్షతో సమావేశాన్ని ప్రారంభించిన మంత్రి, ఎరువులు సక్రమంగా అందజేయాలని అధికారులకు గట్టిగా చెప్పారు.
నీటి పారుదల, వంశధార ప్రాజెక్టులపై సమీక్ష జరిగినపుడు మంత్రి తీరు పూర్తిగా మారింది. నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల పరిధిలోని అంశాలను ప్రధానంగా తీసుకుని ఇంజినీర్లపై ఆయన మండిపడ్డారు. నరసన్నపేటలోని బీసీ సంక్షేమ వసతిగృహాన్ని ఎత్తివేసే అధికారం ఎవరిచ్చారని సంబంధిత ఈఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిని గమనించిన కలెక్టర్ సౌరభ్‌గౌర్ కల్పించుకుంటూ తదుపరి సమావేశంలో అన్ని అంశాలను కూలంకుషంగా చర్చిద్దామని, ఈ సమావేశాన్ని పరిచయాలకు పరిమితం చేయాలని మంత్రిని కోరారు. అనంతరం రిమ్స్, వైద్యఆరోగ్య శాఖలపై సమీక్షలు లోతుగా జరగకుండా కలెక్టర్ జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులపై పట్టు సాధించేందుకే మంత్రి ఇలా వ్యవహరించారని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి.
బెంబేలెత్తించిన మంత్రి అచ్చెన్న
Published Mon, Jun 16 2014 2:49 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement