క్షేత్రస్థాయికి పరిశోధన ఫలాలు
శ్రీకాకుళం రూరల్: పరిశోధనల ఫలితాలు క్షేత్రస్థాయికి చేరాలని.. కాగి తాలపై లెక్కలు వేయ డం సరికాదని వ్యవసాయ మం త్రి పత్తిపాటి పుల్లారావు అధికారులకు సూచించారు. శనివారం నైర వ్యవసా య కళాశాల రజతోత్సవాల్లో పాల్గొన్న ఆయన అనంతరం అక్కడే జిల్లా వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత పద్ధతులకు స్వస్తి చెప్పాల న్నారు. నిధులు, ఇన్‌ఫుట్ సబ్సిడీ బకాయిల గురించి వ్యవసాయ శాఖ జేడీ ప్రస్తావించగా సమాధానం దాటవేశారు. ఏవో, ఏఈవో పోస్టుల ఖాళీలను వెంటనే భర్త్తీ చేయాలన్నారు. భూసార పరీక్షా ఫలితాలను గ్రామ సభలు పెట్టి రైతులకు తెలియజేయాలన్నారు.
కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జిల్లా విత్తన గ్రామాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నారని ప్రశ్నించారు. వివరాలు చెప్పేందుకు అధికారులు ప్రయత్నించగా.. మళ్లీ జోక్యం చేసుకొని కాగితాల్లో కాదు.. నిజంగా ఉన్నాయా?.. ఉంటే విత్తన కొరత ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. దీంతో అధికారులు నీళ్ళు నమిలారు. 100 శాతం సబ్సిడీపై అందజేసిన ట్రాక్టర్లు పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తూ గతంలో ఏదో జరిగిపోయింది.. ఇక ముందు జాగ్రత్తగా పని చేయండంటూ హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. మత్స్యశాఖలో ఎన్ని చేప పిల్లలు సరఫరా చేశారని వ్యవసాయ మంత్రి ప్రశ్నించగా 5వేల పిల్లలు అవసరమని, ఫా రం లేకపోవడంతో అందించలేకపోతున్నామని అధికారులు చెప్పారు.
సాంకేతిక పరిజ్ఞానంతో పెనుమార్పులు
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చని మంత్రి పుల్లారావు అన్నారు. రాగోలు పంచాయతీ రాయిపాడు సమీపంలో గేదెల రామారావు అనే రైతు వరినాటే యంత్రంతో సాగు చేసిన వరి క్షేత్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాంత్రీకరణ వల్ల రూ. 10 వేల తక్కువ ఖర్చుతో 5 క్వింటాళ్ల వరకు అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. రైతులకు అవగాహన కల్పించేందుకు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. ఆమదాలవలస మండలం తోటాడకు చెందిన తాండ్ర రమణ అనే రైతు రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని మంత్రిని డిమాండ్ చేశారు.
దీనికి మంత్రి పుల్లారావు సమాధానమిస్తూ ఇప్పుడిప్పుడే ప్రభుత్వం గాడిన పడుతోందని అన్నీ జరుగుతాయన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతు విద్యుత్ సరఫరా గతం కంటే బాగుంది కదా అని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ కొత్తపల్లి గీత, ఆచార్య ఎన్‌జీ. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వీసీ డాక్టర్ అల్లూరి పద్మరాజు, జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, అసోసియేట్ డీన్ ఎ.ఎస్.రావు, ఎంపీపీ గొండు జగన్నాధరావు, కర్రి జీవరత్నం, కర్రి కృష్ణమోహాన్ పాల్గొన్నారు.
శిలాఫలకానికి టీడీపీ విభేదాల సెగ
నైర కళాశాల రజతోత్సవాలల్లో టీడీపీలోని విభేదాలు మరోమారు బయటపడ్డాయి. తమ ఎమ్మెల్యే పేరు లేదంటూ కొందరు కార్యకర్తలు అప్పుడే ఆవిష్కరించిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశార. రజోత్సవాలకు గుర్తుగా కళాశాల పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర రైతు కుటుంబ విగ్ర హం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకంలో స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పేరు లేదు. దీంతో ఆమె వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శిలాఫలకాన్ని పగులగొట్టారు. దీనిపై పూర్వ విద్యార్థులు స్పందిస్తూ కేబినేట్ హోదా ఉన్న నేతల పేర్లనే శిలాఫలకంలో పెట్టామని, మిగిలిన ఆహ్వానితుల పేర్లను దాని పక్కనే ఉన్న మరో శిలాఫలకంపై వేశామన్నారు. విషయం తెలుసుకోకుండా శిలాఫలకాన్ని పగులగొట్టడం సమంజసం కాదన్నారు.