జట్టుగా సాగుదాం | I want to work together for the development Accennayudu | Sakshi
Sakshi News home page

జట్టుగా సాగుదాం

Published Mon, Jun 16 2014 2:46 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

జట్టుగా సాగుదాం - Sakshi

జట్టుగా సాగుదాం

శ్రీకాకుళం కలెక్టరేట్: జిల్లా సమగ్ర అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖల మంత్రి కింజ రాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాలోని పలు శాఖల అధికారులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశాం త వాతావరణంలో ప్రారంభమైనసమావేశం నీటిపారదల శాఖపై చర్చ సందర్భంగా కొంత వేడెక్కింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల వంశధార, ఆఫ్‌షోర్ ప్రాజెక్టుల నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయని, కాంట్రాక్టర్ల పట్ల ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఈఈ రాంబాబును మంత్రి నిలదీశారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ. 2,500 కోట్లు అవసరమని అధికారులు చెప్పగా, నిధుల విషయం తనకు విడిచిపెట్టి మిగతా విషయాలు చూసుకోవాలని సూచించారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో వంశధార, నాగావళి కాలువల ద్వారా చివరి ఎకరాకు కూడా నీరు అందించాలన్నారు. జిల్లాకు ఎన్ని విత్తనాలు అవసరమో అంచనా వేసి, 80 శాతం వరకు ప్రభుత్వం నుంచి తెప్పించుకునేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.
 
 విత్తనాల కొరత లేకుండా చూడాలని సూచించారు. పంట రుణాలు, ఎరువుల విషయంలో శ్రద్ధ చూపాలన్నారు. రైతు రుణమాఫీకి సంబంధించి జాబితాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయానికి విద్యుత్ కోత లేకుండా చూస్తామని మంత్రి చెప్పారు. విద్యార్థులు లేరనే సాకుతో మూసివేసిన పాఠశాలలను తక్షణమే తెరవాలని జిల్లా విద్యాశాఖాధికారిని  ఆదేశించారు. బెల్టుషాపులు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఎక్సైజ్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ, రిమ్స్, ఎన్‌ఆర్‌ఈజీఎస్, తదితర శాఖలపై సమీక్షించారు. ఆధికారులందరూ స్థానికంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. స్థానికంగా ఉండనివారు సమస్యలను ఎప్పటికప్పుడు ఎలా పరిష్కరించగలరని ప్రశ్నించారు.
 
 రైతులకు ఇబ్బందులురానివ్వం: కలెక్టర్
 ఖరీఫ్ సీజన్ లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రానివ్వమని జిల్లా కలెక్టర్  సౌరభ్‌గౌర్ తెలిపారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈసారి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది రూ. 1722.39 కోట్ల పంట రుణాలు అందజేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 49 వేల క్వింటాళ్ల రాయితీ విత్తనాలు అవసరం కాగా ఇప్పటికే 40వేల క్వింటాళ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. మిగిలిన వాటిని కూడా రైతుల అవసరాన్ని బట్టి సరఫరా చేస్తామన్నారు. సాధ్యమైనంతవరకు విత్తనాలకు రైతులు ప్రైవేటు వ్యాపారులపై ఆధారపడే పరిస్థితి రాకుండా చూస్తామన్నారు. ఈ సమావేశంలో లోక్‌సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బెందాళం ప్రకాశ్, బగ్గు రమణమూర్తి, కంబాల జోగులు, ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, ఏజేసీ హసీం షరీఫ్, డీఆర్‌వో నూర్ బాషా కాశీం, పలు శాఖల ఆదికారులు పాల్గొన్నారు.
 
 టీడీపీ కార్యకర్తల హల్‌చల్
 సమావేశంలో ఆధికారులు, సిబ్బంది కంటే టీడీపీ కార్యకర్తల హడావుడి ఎక్కువగా కనిపించింది. టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సమావేశ  మందిరంలోకి చొచ్చుకురావడంతో పలువురు ఉద్యోగులకు సీట్లు లేకుండాపోయాయి. ప్రవేశ ద్వారం వద్ద కూడా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడటంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఒకదశలో ఉద్యోగులు కాని వారు బయటకు వెళ్లాలని అధికారులు కోరినా ఫలితం లేకపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement