అధికారుల నిర్లక్ష్యం.. అభివృద్ధికి విఘాతం | Disruption development negligent officials | Sakshi
Sakshi News home page

అధికారుల నిర్లక్ష్యం.. అభివృద్ధికి విఘాతం

Published Sun, Jul 19 2015 12:27 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

Disruption development negligent officials

శ్రీకాకుళం పాతబస్టాండ్: పాలకుల అలక్ష్యం... అధికారుల నిర్లక్ష్యం వెరసి కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు విఘాతం కలుగుతోంది. శాసన సభ, శాసన మండలి సభ్యుల నియోజకవర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన అభివృద్ధి నిధుల విషయంలో రెండేళ్లుగా మొండిచేయి చూపించడమే ఇందుకు కారణం. గత ఏడాది (2014-15)కి ఎన్నికలు జరిగా యి. ప్రస్తుతం రాష్ర్టం లోటు బడ్జెట్‌లో ఉందన్న సాకుతో ఈ నిధులు విడుదలను రాష్ట్ర ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఇక ఈ ఏడాది (2015-16)కి ఈ సీడీపీ నిధులు మంజూరు చేయలేమని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుగానే చేతులెత్తేశారు. దీంతో ఈ రెండేళ్లలో జిల్లాలో జరగాల్సిన సుమారుగా రూ.25 కోట్ల విలువైన అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. శాసన సభ్యులు కూడా కార్యకర్తల వద్ద పలు అభివృద్ధి పనుల విషయంలో మాట చెల్లక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రత్యేక అభివృద్ధి పనులకు వచ్చిన సుమారు రూ.30 కోట్లను ప్రస్తుత పాలకులు సకాలంలో ఖర్చచేయలేక పోయారు. దీంతో నిధులు మురిగిపోయి వెనక్కిమళ్లాయి. వెరసి జిల్లా అభివృద్ధి విషయంలో టీడీపీ పాలన విఫలమైందని తెలుస్తోంది. కొత్త పనులు రెండేళ్లుగా ఒక్కటీ ప్రారంభంకాలేదు.
 
 రావాల్సిన నిధులు ఇవీ...
 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ.. మూడు జిల్లాలకు అనుబంధంగా మరో ఇద్దరు నోడల్ ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరికి గత ఏడాది రూ.11 కోట్లకు పైగా అభివృద్ధి నిధులు మంజూరు కావాల్సి ఉన్నా విడుదల కా లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.13 కోట్లు మంజూరు కావాల్సి ఉన్నా, ఇవి కూడా విడుదల కాలేదు. దీంతో రెండేళ్ల అభివృద్ధి నిలిచిపోయినట్లే.
 
 మురిగిపోయిన నిధులు
 ఇక ప్రత్యేక అభివృద్ధి ఫండ్ పేరిట 2013-14లో జిల్లాకు గత ప్రభుత్వం రూ.61 కోట్లు కేటాయించింది. ఈ నిధులు 2015 మార్చిలోగా పూర్తిగా ఖర్చు చేయాల్సింది. అయితే ఈ నిధులు విడుదల చేసిన వెంటనే ఎన్నికలు రావడంతో గత ప్రభుత్వం ఈ నిధులు ఖర్చుచేయలేక పోయింది. తరవాత వచ్చిన టీడీపీ పాలకుల్లో సమన్వయం లేకపోవవడం, నిధులు వివిధ పనులకు కేటాయించడంలో శాసన సభ్యులకు అవగాహన లేకపోవడం, తదితర వైఫల్యాల వల్ల సుమారుగా రూ.30కోట్ల నిధులు వెనుతిరిగాయి. ఇలా టీడీపీ పాలనలో జిల్లా అభివృద్ధి క్రమంగా కుంటుపడుతున్నట్లు తెలుస్తోంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement